కరివేపాకుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఎక్కడో ఒక్కరో ఇద్దరో తప్ప చాలామంది కూరలో కరివేపాకును తినడానికి ఇష్టపడరు. కానీ కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆధునిక పరిశోధకులు. ఐరన్ లోపం వల్లే రక్తహీనత వస్తుందని తెలిసిందే. కానీ అది లేకపోవడమే కాదు, దాన్ని శోషించుకోలేకపోవడంవల్ల కూడా రక్తహీనత వస్తుంది. అలా శరీరం ఐరన్ తీసుకోవడానికి ఫోలిక్ ఆమ్లం దోహదపడుతుంది. ఈ రెండూ కూడా కరివేపాకులో సమృద్ధిగా ఉండటంవల్ల రక్తహీనతకు దీన్ని మించింది లేదు అంటారు ఆహార నిపుణులు.
ఆయుర్వేదం ప్రకారం పొట్టలోని విషపూరితాలను సైతం కరివేపాకు చక్కగా తొలగిస్తుంది. అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచుతుంది.
కాలేయం దెబ్బతిన్నవాళ్లకి కరివేపాకు ఎంతో మేలుచేస్తుంది. ఇందులోని క్యాంఫెరాల్ అనే యాంటీ ఆక్సిడెంటు ఆక్సీకరణ ఒత్తిడినీ హానికర రసాయనాలనూ తొలగిస్తుంది. టీస్పూను నెయ్యిలో అరకప్పు కరివేపాకు రసం, కాస్త పంచదార, మిరియాలపొడి వేసి సిమ్‌లో మరిగించి తీసుకుంటే కాలేయ సమస్యలు తగ్గుతాయట.
కరివేపాకులోని పీచు కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. ఇది కొవ్వుని సైతం కరిగిస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు. పరగడుపున కొద్దిగా పచ్చి కరివేపాకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కరివేపాకు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని చైనా నిపుణుల అధ్యయనంలోనూ తేలింది.
ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఇది విరేచనాలనీ తగ్గిస్తుంది. వ్యాధి వెంటనే తగ్గాలంటే చిన్నరేగుపండు సైజులో కరివేపాకుని ముద్దలా చేసి మజ్జిగతో రోజుకి రెండుమూడుసార్లు తీసుకోవాలట.
క్యాన్సర్ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ కారణంగా ఎదురయ్యే దుష్ఫలితాలు తగ్గాలంటే కరివేపాకు ఎంత తింటే అంత మంచిది. దగ్గూ కఫంతో బాధపడుతుంటే టీస్పూను కరివేపాకు పొడిని తేనెతో తీసుకుంటే ఫలితం ఉంటుంది.
కరివేపాకులోని హానికర సూక్ష్మజీవుల్ని నివారించే గుణంవల్ల మొటిమలూ ఫంగల్ ఇన్ఫెక్షన్లూ కూడా తగ్గుముఖం పడతాయి. కరివేపాకులోని అనేక పోషకాలు శిరోజాలు దెబ్బతినకుండానూ వూడిపోకుండానూ చూస్తాయి. అంతేకాదు, దీన్ని నూరి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుంది.
0 Comments