Ad Code

మహోన్నతం శివతత్వం


మహోన్నతం శివతత్వం


రుద్రుడు మహాదేవుడు దేవదేవుడు పరమేశ్వరుడికి ఎన్నెన్ని పేర్లో. ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుగా గుర్తొచ్చే దేవుడు శివుడు. పాలకడలి చిలికినపుడు హాలాహలం పుట్టగానే సురాసురులంతా మొరపెట్టుకున్నది శివుడికే. ఆయనగారేమో భక్త వత్సలుడాయే ఎవరైనా అలా పిలవగానే ఇలా కొలువుదీరుతాడు. ఆపదల నుంచి ఇట్టే గట్టెక్కిస్తాడు. ఆదిభిక్షువైనా తనను నమ్మి తపమాచరించిన వారికి వరాల జల్లు కురిపించే భోళా శంకరుడితడు. భస్మాసురుడికి అలా వరాలిచ్చే తనమీదికే తెచ్చుకున్నాడు. పురాణాల్లో అసురులంతా వరాల కోసం నీలకంఠుడిని ఆశ్రయించడం వెనుక ఆయన అమాయక చక్రవర్తి కావడమే కారణం కాబోలు.

ఉమారమణుడు, గిరిజావరుడు, గౌరీపతి భార్యపేరుతో తనను కొలిస్తే ఆ స్వామి ఎంతగా పులకిస్తాడో. తన శరీరంలో సగం వాటా ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా వెలసి యుగయుగాల కిందటే స్త్రీ స్వామ్యానికి పునాదులు వేసిన స్త్రీ వాది ఈ పార్వతీ వల్లభుడు.

భక్త సులభుడు అని శివుడికి మరో పేరుంది. ఖరీదైన పూజలు, విలువైన నైవేద్యాలు, ఆభరణాదులు ఇవేవీ ఆయనకు అక్కర్లేదు. నెత్తిన గంగమ్మ ఉన్నా నాలుగు చెంబుల నీళ్లు కుమ్మరిస్తే చాలు తెగ ఆనందపడిపోతాడు. విభూది రాస్తే చల్లబడిపోతాడు. ఈ వెండికొండ రేడుకు రెండు మారేడు దళాలు పెడితే చాలు కరుణిస్తాడు.

జడలు కట్టిన జుట్టు నెత్తిన గంగ బేసి కన్నులు మెడలో సర్పం చేతిలో భిక్షపాత్ర ఇదీ శివరూపం. పరమేశ్వరుడు అనుగ్రహించిన మూడు గీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలియజేస్తాయి. మూడో కన్ను జ్ఞాననేత్రం. పాక్షికంగా మూసి ఉండే రెండు కన్నులూ ధ్యానస్థితిలో అంతర్ముఖస్థితిని తెలియజేస్తాయి. శ్మశాన సంచారం వైరాగ్యానికి సూచన. శివుడి లింగరూపం ఆ స్వామి నిర్గుణ పరతత్వ స్వరూపాన్ని సూచిస్తుంది. భగవంతుడు సర్వ వ్యాపకుడు అన్న సత్యాన్ని బోధిస్తుంది. ఏ విధంగా అర్చించినా ఏ రీతిగా అలంకరించినా పరతత్వం ఒకటే. అందుకే లింగమూర్తికి అవయవాలు లేవు. ఈ సత్యాన్ని తెలియజేసే తత్వస్వరూపమే ‘లింగం’. సోమవారం వేళ స్వామిని అభిషేకిస్తూ, పంచాక్షరీ మంత్రాన్ని (ఓం నమ శివాయ) మననం చేస్తూ ధన్యులమవుదాం.




Post a Comment

0 Comments