చక్రరాజనికేతనా (అష్టాక్షరి)
ఇది అష్టాక్షరముల మంత్రము. పూజాసమయంలో “చక్రరాజ నికేతనాయై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
చక్రరాజ = చక్రశ్రేష్ఠమైన శ్రీచక్రమే,
నికేతనా = నివాసముగా గలది శ్రీదేవి.
శ్రీచక్రములో నాలుగు శివ కోణములు,
అయిదు శక్తి కోణములు ఉండును,
తొమ్మిది ఆవరణములు ఉంటాయి.
శివుని యొక్క - శక్తి యొక్క సమైక్య రూపమే శ్రీచక్రముగా విరాజిల్లుతూ ఉంటుంది. మరియు ఆయా స్థలములందు చతుష్టష్టి కోటి యోగినీ గణము ఉంటుంది. అందు బిందు స్థానమున శ్రీదేవియు, కామేశ్వరుడును ఉంటారు.
ఇటుల సర్వదేవతా నివాసము అగుటచే శ్రీచకము చక్రరాజము అనబడు చున్నది. అందు కామేశ్వరులతో నివసించేది శ్రీదేవి.
చర్ అనే మూల ధాతువు నుండి చక్రము అను పదము జనించింది. భ్రమణం, కదలిక, నడుచుట, తినుట, త్రాగుట,.నృత్యం చేయుట, ఆనందించుట, ఏడ్చుట, ఎగురుట, మొదలైనవి అన్నియును కదలికలే. కానీ కదలికలు అన్నీ జడమూ, జీవరహితము అయిన కదలికలుగావు.
చైతన్యవంతంగా విస్తరిస్తూ ఆనందించే కదలిక యిది. కామేశ్వరుడు ప్రకాశము, శ్రీదేవి విమర్శయు అగుదురు. ఆయన చూస్తే ఆమె నర్తిస్తుంది. ఈమె నర్తిస్తే ఆయన చూస్తాడు.
విడదీయరాని జంట ఇది. ఆమె నర్తిస్తూ ఉంటే సమస్త జగత్తూ ఆవిర్భవిస్తుంది. ఈ సృష్టి అనేది పరాకాష్ట నందగానే ఆమె నర్తన చాలిస్తుంది. అప్పుడు సృష్టి.అంతయు వచ్చినట్లు తిరోధానం పొందుతుంది. తిరోధానకరీశ్వరీ అని లలితా సహస్రనామావళి. ఇంతటి మహిమాన్వితమైనది అగుటచే శ్రీచక్రము చక్రరాజము అయినది. అందు బిందు భాగంలో శ్రీ కామేశ్వరుడితో ఉండేది శ్రీదేవి.
ఈ మంత్రముతో దేవిని అర్చించే వారికి సృష్టితత్త్వము అవగతమై రాగ ద్వేషాలు అంతరిస్తాయి. శాంతి, సుఖాలు ప్రాప్తిస్తాయి.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments