Ad Code

సృష్టికర్త్రీ (చతురక్షరి) - Chaturakshari

సృష్టికర్త్రీ (చతురక్షరి)



ఇది నాల్గు అక్షరములు గల్గిన మంత్రం. పూజాసమయంలో "సృష్టికరై నము" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

సృష్టి - కర్త్రీ = వియదాదికమైన సమస్త సృష్టిని చేయునది శ్రీదేవి
ఆకాశాధికమైన సమస్త సృష్టి చేయునది ఆ పరాశక్తియే అని సామాన్య భావం.

విశ్వరూపా అనే 256వ మంత్రం నుండి సర్వావస్థా వివర్జితా అనే 268 మంత్రం వరకు, అనగా అష్ట మంత్రాలచే జీవుని నాల్గు అవస్థలు, సమష్టి పక్షమున ఈశ్వరుని నాల్గు అవస్థలు, వాటికి అతీత స్థితియును బోధింప బడినాయి.

ఇప్పుడు ఈ 264వ మంత్రం నుండి 274 మంత్రమైన “పంచకృత్య పరాయణా” అనే మంత్రం వరకు శ్రీదేవి యొక్క పంచకృత్యములు బోధింప బడుతున్నాయి. అందు కృత్యము అయిన సృష్టిని ఈ మంత్రము వరకు 11 మంత్రాలు గలవు.

సృష్టి అనేది రజోగుణ ప్రధానమైనది. అమ్మ కన్నులు మూసుకొనగానే సమస్త ప్రపంచము ప్రళయం పొందుతుంది. కన్నుల తెరువగానే ప్రారబ్దానుగుణంగా జీవకోటి ఆవిర్భవిస్తుంది.
“ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూవనావళిః” లలితా సహస్రనామావళి.

“డు - కృ - : కరణే అనే ధాతువు నుండియే గాక “కృతీ = ఛేదన్” అనే ధాతువు నుండియు కొందరు అనుభవజ్ఞులైన మహాత్ములు "కర్త్రీ” అనే పదాన్ని నిర్వచిస్తారు. ఈ "కర్త్రీ" పదంచే కృంతనము-ఛేతనము అనగా కత్తిరించుట, తొలగించుట, నశింపజేయుట మొదలైన అర్థాలు గ్రహింపవచ్చును. అప్పుడు తనను ఆశ్రయించిన వారికి అనగా అనన్య శరణాగతులైన భక్తులకు సృష్టిని అనగా జనన మరణాది సంసారబంధమును, కత్తిరించేది, తొలగించేది, నశింపజేసేది అనియు భావము లభిస్తుంది. ఇందుకు సమర్థముగా భావనోపనిషత్తులోని ఈ మంత్రము ఉల్లేఖిస్తారు.

“తేన నవరంధ్ర రూపోదేహః” ఈ మంత్రానికి 'సృష్టికర్త్రీ" అనే మంత్రానికి వలెనే రెండు అర్థాలు - ఇలా ప్రతిపాదిస్తారు.

తేన = శ్రీగురు యోగంచే,
నవరంధ్ర రూపః = తొమ్మిది రంధ్రాలచే ఆకర్షకరమైన
దేహ = దేహమును అనుగ్రహింప బడినది. ఇది సృష్టి పక్షము.
విముక్తి పక్షము, కృంతన పక్షమున తేన = ఆ శ్రీ గురు చరణ శరణ లాభంచే
న - వ = అవాంఛనీయమును,
ఏలననగా రంధ్ర-రూప = రంధ్రముల ద్వారా లోపభూయిష్టమైన,
ఇహ = ఈ శరీరము లేక ఈ ప్రపంచము కోయబడినది.

కత్తిరింపబడినది. గురుచరణ శరణముచే లోపభూయిష్టమును, దుఃఖరూపమును అయిన ఈ సంసారబంధము ఖండితము అగును అని సారాంశము.

దో - అవఖండనే అని ధాతువు ద్వతి - ఖండయతి సమూలతః ఇతిద:- అ ప్రత్యయాంత దివాదికము – సమూలముగా ఖండించునది అని భావము.

మండలాత్మకమును, ఋతు, సంవత్సరాది కాల నియామకమును అయిన నక్షత్ర వలయము, కృత్తికా (కత్తెర) నక్షత్రంలో ఆరంభమైనది అని వేదాంగమైన జ్యోతిష శాస్త్రము బోధిస్తున్నది.

పూర్యాది గ్రహదశలు కృత్తిక నుండియే మొదలు అవుతున్నాయి. ఇటుల ఈ నామానికి అర్థాలను అనుభవజ్ఞుల బహుధా నిర్వచిస్తారు.

ఫలము:- ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారికి సృష్టి రహస్యాలు అవగతం అగును. మరియు సంసారబంధ విముక్తియును ప్రాప్తిస్తుంది.





Post a Comment

0 Comments