ఆనాటి కాలంలో ఆచారాలు
ఆనాటి కాలంలో గ్రామాలలోకి ఏదైనా కొత్త వస్తువు రావాలంటే గ్రామ పెద్దల అనుమతితో ఆవస్తువును తీసుకురావసి ఉంటుంది.
గ్రామ పెద్దలు 4 రకాల విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ వస్తువు గ్రామంలోకి వచ్చేదానికి అనుమతి ఇచ్చేవారు.
1. ఆ వస్తువు గ్రామంలోని వృత్తిదారుల వృత్తికి ఏదైనా హాని చేస్తుందా,
2. వ్యక్తిగత లేదా సామాజిక ఆరోగ్యానికి హాని చేస్తుందా,
3. ఎవరి ఆర్థిక స్వాతంత్రానికి ఏమైనా హానిచేస్తుందా,
4. ఆద్యాత్మిక విషయాలకు ఏదైనా హానిచేస్తుందా అని పరిశీలించి అనుమతిచ్చేవారు. కాబట్టి గ్రామంలోని అన్ని వృత్తులు కాపాడ బడేవి.
నేడు శాస్త్ర సాంకేతికత అనే ముసుగులో పై నాలుగు విషయాలు నిరాదరణకు గురై వ్యవస్థ చిన్నాభిన్నమైనది.
ఓ చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని ముగిస్తాను. రేజర్ ప్రవేశంతో మంగలి వారి ఆదాయానికి గండిపడింది. వాషింగ్ మిషన్ ప్రవేశంతో రజకుల వృత్తి మాయమైంది. ఇలా ప్రతి ఒక్క వృత్తి దారుల వృత్తిని నాశనం చేసే పరికరాలు దేశంలో ప్రవేశించాయి. ఇటువంటి వాటి ప్రవేశం లేకపోతే ఎంతమందికి పని దొరికి ఉండేది. ప్రతి ఒక్కరూ వారి వారి వృత్తులలో, వృత్తులతో గౌరవంగా బ్రతుకుతుండేవారో ఆలోచించండి. ప్రతి వారికీ ఇంకొకరితో అవసరాలు ఉండేవి. మానవ సంబంధాలు బలపడేవి. ప్రేమ అభిమానం, కర్తవ్యాలు ఉండేవి.
సాంకేతికత చిన్నదైతే సమాజం దానిని తనలో ఇమడ్చుకుంటుంది. సాంకేతికత పెద్దదైతే సాంకేతికతే సమాజాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. ప్రస్తుతం మనం మన దేశ ఆర్థిక విధానానికి విరుద్దంగా యంత్రభుతముల కోరలు తోముతున్నాము. స్వతంత్ర జీవనం పరతంత్రమైంది. యజమానులు కూలీలు (ఉద్యోగులు) గా తయారయ్యారు. ప్రతి చేతికీ పని అనేది కలగానే మిగిలింది. 18 సంవత్సరాల వయస్సునుండి 65 సంవత్సరాల వయస్సున్న వారి వరకూ నిరుద్యోగులు ఉన్నారు.
దీనికి ఒక్కటే కారణం భారతీయ ఆర్థిక విధానాన్ని, జీవన విధానాన్ని అర్థం చేసుకోలేక యాంత్రీకరణ పేరుతో పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం వలన స్వయంపోషకత్వం, స్వాభిమానం అనే గుణాలు మననుండి దూరమై బానిస బ్రతుకులు బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది. మన జీవితాలను రాజకీయ నాయకులకు తాకట్టు పెట్టాము. గాంధీజీ గ్రామ స్వరాజ్యం అనే సిద్దాంతానికి ఆయన అనుంగు శిష్యుడే వెన్నుపోటు పొడవండం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది.
నాటి భారతీయ జీవనమంతా ఆరోగ్య, ఆనంద,ఆద్యాత్మికతల కలబోత. మోక్షమే భారతీయుల జీవన పరమావథి.
0 Comments