పద్మనయనా (పంచాక్షరి)
ఇది పంచాక్షరముల మంత్రము. ఈ మంత్రంతో దేవిని అర్చించే సమయంలో “పద్మ నయనాయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
పద్మ - నయన = పద్మములతో సమానమైన కన్నులు గలది శ్రీదేవి అని సామాన్యమైనఅర్థం.
పద్మములు రెండు విధాలుగా ఉంటాయి.
1.శ్వేత పద్మములు
2. రక్త పద్మములు
కుడికన్ను - రక్తవర్ణము - సూర్యాత్మకము,
ఎడమ కన్ను - శ్వేత వర్ణము - చంద్రాత్మకం.
సూర్య చంద్రులు నేత్రాలుగా గలది అమ్మవారు అని సామాన్య భావము.
పద్మాలు సూర్యోదయంలో వికసిస్తాయి. సూర్యాస్తమయంతో ముకుళిస్తాయి. అందుచే కాలగమనాన్ని సూచిస్తాయి. కన్నులు యొక్క రెప్పపాటుల పరిగణనాన్ని అనుసరించియే విఘడియలు, ఘడియలు, మొదలైన కాలవిభాగము గలదు. అనగా కాలగణన విషయంలో కనులకును, పద్మాలకును సామ్యము గలదు. అందుచేతనే కన్నులను పద్మాలతో పోల్చుదురు.
పద్మాలు నీటిలో ఉంటాయి కాని నీటికి తగులవు. నీరు తగిలినచో దళాలు కుళ్ళిపోతాయి. అందుచే అనాసక్త జీవితానికి బోధకములు పద్మాలు అనియు శాస్త్రజ్ఞులు అందురు.
పద్మములను కన్నులతోనే గాక, ముఖము, చేతులు, కాళ్ళు ఇత్యాదులతోనూ పోల్చడంగలదు. పద్మవదన, పద్మహస్త, పద్మచరణ, పాదపద్మ ఇటువంటి ప్రయోగాలు కలవు. దీనిచే చేతులతో చేసే పనులు, నడకలు తుదకు అన్ని పనులునూ అనాసక్తంగానే ఉండాలి. నాది, నేను అనే భావంతో ఉండరాదు.
కాలం విలువైనది. కాలాన్ని వ్యర్థం చేయకుము. జీవితమును అనాసక్తంగా సత్కార్యాలకు ఉపయోగించి ధన్యము గావించుకొనుము. ఇత్యాది అంశాలు బోధితములు.
ఈ మంత్రముతో దేవిని ఉపాసించేవారికి అనాసక్త జీవితం అలవడుతుంది. జన్మము సార్థకం గావించుకొందురు.
0 Comments