బతుకమ్మ ఎలా పుట్టిందంటే
పూల జాతరగా, ప్రకృతి వేడుకగా తెలంగాణ నేల జరుపుకొనే అతిపెద్ద పండుగ బతుకమ్మ.
హైందవ సంప్రదాయంలో ప్రతి వేడుక వెనుకా ఒక కథ ఉంటుంది.
ప్రతి సంబురానికీ ఒక సందర్భం ఉంటుంది. అలాగే బతుకమ్మ పుట్టుక వెనుకా చాలా గాథలు ఉన్నాయి. దాదాపు ప్రతి కథా ఒక స్త్రీ వ్యథ నుంచే పుట్టుకొచ్చింది. పూలను రాశిగా పేర్చి బతుకమ్మ ఆడే ఆచారం ఎప్పుడు పుట్టింది.
అన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, తెలంగాణ నేల మీద కనీసం పాతిక తరాలను చూసింది బతుకమ్మ.
ఒక్కేసి పువ్వేసి రాశిపడవేసి
రాశి గొలుతూ రావె రత్నాల గౌరీ పువ్వుల్ల గౌరి కొమ్మల్ల గౌరి పచ్చన్ని పాలవెల్లే గౌరమ్మ. మీ ఇంటి కోడళ్లమే అంటూ బతుకమ్మ ఆడుతారు పడతులు. ఈ ఆడపిల్లలు గౌరమ్మకు కోడళ్లంటే, గౌరమ్మ వీళ్ల పుట్టింటి ఆడపిల్ల అన్నది ఈ పదాల వరుసలోని భావన. నిజమే తెలంగాణ ప్రజలు మంగళగౌరిని తమ ఇంటి అమ్మాయే అనుకుంటారు. బతుకమ్మ పండుగ పుట్టుక వెనుకా ఇలాంటి కథలే కనిపిస్తాయి. వాటిలో మొదటగా దాదాపు వెయ్యేళ్ల క్రితం వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయానికి సంబంధించిన కథలోకి వెళ్లాలి. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం కల్యాణి చాళుక్యుల పాలనలో ఉండేది. వేములవాడ చాళుక్యులు వీరికి సామంతులుగా ఉన్నారు. ఆ సమయంలో కల్యాణి చాళుక్యులకు, చోళులకు మధ్య యుద్ధం జరిగింది. ఇందులో వేములవాడ చాళుక్యులు కల్యాణి చాళుక్యుల పక్షం వహించారు. అప్పటికే వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ సమయంలో చోళ చక్రవర్తి రాజరాజు కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ ఆలయంలోని భారీ శివలింగాల్ని పెకలించి తీసుకెళ్లి తండ్రికి బహుమతిగా ఇచ్చాడట. ఇక్కడి బృహదమ్మ (పార్వతి) నుంచి బృహదీశ్వరుడిని వేరుచేయడంతో తెలంగాణ ప్రజలు నొచ్చుకున్నారు. ఆమెకు సాంత్వన చేకూర్చేందుకు శివలింగాకృతిలో గౌరీదేవి రూపంగా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటలు ఆడారట. ఈ ఘటనకు గుర్తుగా ప్రతి ఏడాదీ ఇలా చేస్తున్నారని కథ. బృహదమ్మ (గొప్పది)నే జన వ్యవహారంలో "బతుకమ్మ" గా మారిందని అంటారు.
దుర్గాదేవి మూర్ఛిల్లితే
మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి అలసిపోయి మూర్ఛిల్లిందట. అప్పుడు ఆమెను మేలుకొలిపేందుకు దేవుళ్లంతా పూలగౌరమ్మను పేర్చి పాటలు పాడారట. బతుకమ్మా బతుకమ్మా అంటూ వేడుకున్నారట. ఇది జరిగింది దసరా నవరాత్రుల్లోనేననీ, అప్పటినుంచీ అమ్మ విజయానికి గుర్తుగా బతుకమ్మ వేడుక చేసుకుంటున్నారనీ మరో కథనం.
బతికివచ్చిన రాజు కూతురు
పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకు ఏడుగురు కొడుకులు, ఒక్కతే కూతురు. ఆమె పెళ్లి చేసి తల్లిదండ్రులు కాశీయాత్రకు వెళతారు. ఈ మధ్యకాలంలో కూతురు పుట్టింటికి వస్తుంది. ఆమె కొద్దిరోజులు అక్కడే ఉండవలసి వస్తుంది. అవి దసరా రోజులు. అనుకోకుండా రావడంతో ఆమె దగ్గర పండుగకు సరిపడే చీరలూ, నగలూ లేవు. అందుకే పండుగకు పెట్టుకోవడానికి కాళ్ల కడియాలూ, పట్టుచీరా అడుగుతుంది. మొదటి ఆరుగురు వదినలూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. చివరి వదిన మాత్రం తీసుకున్న కడియాలు సొట్టపోయినా, చీర చిరిగిపోయినా బాగుండదని హెచ్చరిస్తుంది. కానీ పండుగ సమయంలో ఆటలాడటంతో కడియాలు సొట్టబోయి, వాటికి తగులుకుని చీర చిరిగిపోతుంది. భర్తతో కొట్లాడి సొంత అన్నతోనే ఆడపడుచును చంపిస్తుంది చిన్నవదిన. చివరికి ఆమె చనిపోయిన చోట అందమైన కొలను ఏర్పడుతుంది. కాశీ నుంచి తిరిగివచ్చిన తల్లిదండ్రులు అందులో తామరను కోయబోతే ముట్టుకోవద్దని కూతురి గొంతు వినిపిస్తుంది. ఈ కథలను చిలుకా గోరింకలుగా మారిన ఆమె కళ్లు భర్తకు చెబుతాయి. ఆ రాజ్యపు ఆడపిల్లలంతా పదిరోజులు పూలగౌరిని పేర్చి ఆ కొలనులో వదిలితే చివరి రోజు పదహారేళ్ల బాలాకుమారిగా తిరిగి వస్తానని పలుకుతుంది తామర. అలా దసరా పండుగ సమయంలో ఆడబిడ్డ బతికివచ్చిన గుర్తుగా ఇప్పటికీ బతుకమ్మను పేర్చుకుంటున్నారని ప్రాచుర్యంలో ఉన్న ఒక గాథ.
ధర్మాంగదుడి కూతురుగా
దక్షిణ భారతదేశానికి చెందిన చోళ రాజ్యానికి రాజు ధర్మాంగదుడు. ఆయనకు పుట్టిన వందమంది కుమారులు యుద్ధంలో చనిపోతే శ్రీమహాలక్ష్మి కోసం భార్యాభర్తలిద్దరూ తపస్సు చేసి ఆమె అనుగ్రహం పొందుతారు. సిరుల తల్లి వాళ్ల కడుపున పుడుతుంది. చిన్నతనంలో ఎన్నో గండాలను దాటి, మహిమలు చూపిస్తుంది. అందుకే ఆమె చల్లగా ఉండాలని బతుకమ్మా అని పిలిచేవాళ్లనీ, లక్ష్మీదేవి అంశ కాబట్టి ఆమెకు పూజలు చేసేవారన్నది తెలంగాణలో ధర్మాంగదుడి కథగా పాటల రూపంలో ప్రాచుర్యంలో ఉన్న మరో కథనం. నిజాం నవాబుల కాలంలో అధికారుల దాష్టీకానికి బలైపోయిన ఆడపిల్లల గుర్తుగా వాళ్లను తలుచుకుంటూ, ఇలాంటి కష్టం మరెవరికీ రాకుండా చూడమంటూ గౌరీదేవిని ఇలా బతుకమ్మగా పూజిస్తున్నారన్నది చరిత్రకారులు చెబుతున్న ఇంకో కథనం.
కాపుబిడ్డ కథ:
కాపు దంపతులకు ఏడుగురు సంతానం పుడితే ఒక ఆడపిల్ల బతుకుతుంది. ఆమెకు బతుకమ్మ అనే పేరు పెడతారు. ఆ తర్వాత అబ్బాయి పుడతాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు అవుతాయి. ఒకసారి వదినా మరదళ్లు చెరువుగట్టున స్నానం చేసి వస్తారు. అప్పుడు ఒకరి చీరను మరొకరు ధరిస్తారు. ఈ విషయంలో మాటామాటా రావడంతో ఆడబిడ్డను చంపేసి, చెరువుగట్టునే పాతి పెడుతుంది మరదలు. ఆ ప్రాంతంలో తంగేడు విరగబూసిందట. తన బాధను భర్తకు కలలో కనిపించి చెప్పిందట బతుకమ్మ. అప్పటినుంచి ఆమె గుర్తుగా తంగేడుపూలతో బతుకమ్మను పేర్చి పండుగ చేశారట.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
0 Comments