ఇది షోడశాక్షరముల మంత్రము. పూజాకాలంలో “శ్రుతి సీమన్త సిందూరీకృత పాదాబ్జధూళికా నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
శ్రుతి - సీమంత - సిందూరీకృత - పాద - అబ్ద - ధూళికాః; శ్రుతి వేదములు అనే స్త్రీల యొక్క
సీమన్త = పాపిటలందు,
సిందూరీకృత = కుంకుమ పువ్వులుగా (కుంకుమ పువ్వుల
పూతగా) చేయబడిన,
పాద అబ్జ = కమలములవంటి పాదముల యొక్క ధూళికా = దుమ్ము గలది.
స్త్రీలు మోకరిల్లి పంచాంగ నమస్కారము చేయవలయును అని శాస్త్ర నియమము. పంచాంగములు అనగా అయిదు అవయవాలు అవి..
నొసలు, కాళ్ళు రెండు, మోకాళ్ళు రెండూ మొత్తము ఈ అయిదు అవయవాలు నేలకు తాకునట్లు చేసే నమస్కారాన్ని అనగా మోకరిల్లి చేసే నమస్కారము పంచాంగ నమస్కారం అందురు.
శ్రుతులు, వనితలు సింహసనాసీనయైన అమ్మవారికి మోకరిల్లి నమస్కరిస్తున్నారు. అమ్మవారి పాదములు పాదపీఠికపై ఉన్నాయి. పాదములు తమ తలలకు తగులునట్లుగా ముఖ్యంగా పాపిటలకు తగులునట్లుగా శ్రుతి కాంతలు నమస్కరిస్తున్నారు. అప్పుడు పాదములకు ఉండే సిందూర రజము శ్రుతికాంతల సీమంత భాగముల పై కొంత పడుచున్నది.
వ్యాస భగవానుడు కన్నులకు కట్టినట్లుండే ఈ దృశ్యమును అంతః కరణమున దర్శించియే మంత్రమును ఉచ్చరించియుండును. శ్రుతికాంతలు బాలికలు కానందున నడి పాపిటలను ఉంచుకొన్నారనియు గ్రహింపదగును.
విషయాలు సరిగా ఉన్నప్పుడు పై అధికారి వాటి పై ముద్ర వేస్తాడు. వేద ధర్మాలు పవిత్రాలు అనుటకు పరాశక్తి పాదముద్రలు పడినాయి అనియు తెలియదగును.
ఈ మంత్రముతో దేవిని ఆరాధించే సాధకులు వైదిక ధర్మవర్తనులు అవుతారు. వేధోక్త విధిని అమ్మను సేవిస్తారు.
0 Comments