Ad Code

భైరవీ (త్ర్యక్షరి)

భైరవీ (త్ర్యక్షరి)



ఇది మూడు అక్షరములు గల్గిన మంత్రము. పూజాకాలంలో "భైరవ్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

భైరవీ = భైరవీ రూపిణియైన శ్రీదేవి.

ద్వాదశ వసంతాల (పండ్రెండు సంవత్సరాల) కన్యను భైరవీ అంటారు. శ్రీదేవి ద్వాదశ వత్సరాలు వయస్సు గల్గిన బాలా కుమారి రూపంలో ఉంటుంది అని ఒక అర్థము.

భ-ర-వ అనే మూడు అక్షరాలు భైరవీ శబ్దంలో ఉన్నాయి. ఈ అక్షరాలను అనుసరించి కొందరు పండితులు ఇలా వివరిస్తారు.

భ = ధరించడం, కల్పాంతంలో సర్వ ప్రపంచాన్ని తనలో ఇమిడించు కోవడం
ర = రమణం అనగా సృష్టి తర్వాత వాటిని రక్షించడం లేక వాటితో ఆనందించడం, వినోదించడం

వ = వమనం. సృష్ట్యారంభమునందు తనలోని ప్రపంచాన్ని అంతనూ క్రమ పద్ధతిలో వెళ్ళగక్కడం.

ఈ మూడు కార్యాలు చేసే గనుక శ్రీదేవికి భైరవీ అనే పేరు సార్ధకం అని వచిస్తారు.

భైరవులు అష్ట విధాలుగా ఉంటారు. 
1. అసితాంగ భైరవుడు 
2. పరభైరవుడు
3. చండ భైరవుడు 
4. క్రోధభైరవుడు 
5. ఉన్మత భైరవుడు 
6. కరాళభైరవుడు 
7. భీషణ భైరవుడు
8. సంహారభైరవుడు

ఈ అష్టభైరవుల స్వరూపిణియైనది భైరవీదేవి. 

త్రికాల జ్ఞాన సంపన్నమైన బ్రహ్మ స్థానమును భైరవము అందురు. అందు వసించేది అగుటచే భైరవీ అనియు కొందరు వ్యాఖ్యానిస్తారు.

అజ్ఞాత శక్తులను భైరవులు అంటారు. సమస్తమైన అజ్ఞాత శక్తులకు అధినేత్రి అగుటచే "భైరవీ” నామంతో భవానీదేవి విరాజిల్లుతుంది. ఇలా ఎన్నియో అర్థాలను పండితులు భైరవ శబ్దానికి వివరిస్తారు. అనుభవసమ్మతాలైన అర్థాలు అన్నియూ గ్రాహ్యాలే అగును.

ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారికి అజ్ఞాత శక్తులవలన రక్షణ లభిస్తుంది. 

ఆత్మానుభూతియు ప్రాప్తిస్తుంది.





Post a Comment

0 Comments