భగమాలినీ (పంచాక్షరి)
ఇది అయిదు అక్షరాలు గల్గిన మంత్రము. పూజాకాలంలో "భగమాలిన్యై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి. భగ - మాలినీ = భగములు మాలికలుగా గలది శ్రీదేవి. భగ శబ్దానికి పండితులు బహు విధాలైన అర్థాలను బోధిస్తారు. ముఖ్యమైనవి మాత్రం ఇచ్చట తెలుపబడు తున్నాయి. "ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశ్వః శ్రియః జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణాం భగ ఇతీరథ:" 1. సమగ్రమైన ఐశ్వర్యము 2. వీర్యము 3. యశస్సు 4. సంపద 5. జ్ఞానము 6. వైరాగ్యము నక్షత్ర - ఋక్షః భం - తారా ఇత్యాది నిఘంటువును అనుసరించి “భ” అనగా నక్షత్రము. భాతి ఇతి భం - గగనమున ప్రకాశించేది అని సార్ధక నామము. "భైః నక్షత్రైః గచ్ఛతీతి భగః” ప్రకాశించే నక్షత్రాలతో కూడి ప్రయాణించేవాడు సూర్యుడు లేక భః గశ్చ = భగః = స్వయంగా ప్రకాశిస్తూ గమనం చేసే వాడు సూర్యుడు అనియు తలంపదగును. ఇటుల సూర్యులను మేషాది రాశి భేదంచే పండ్రెండుగా విభజిస్తారు. సూర్యుడికి దినమణి - గగన మణి వంటి నామములు గలవు. అనంత సంసారంలో ఇలాంటి సూర్య కుటుంబాలు ఎన్నియో గలవు. అందుచే సూర్యులను, సూర్య కుటుంబాలను మాలికలుగా ధరించునది శ్రీదేవి. ఒక సూర్య కుటుంబము ఒక్క బ్రహ్మాండము అగును. బ్రహ్మాండ సప్తకము జగత్తు, కొన్ని జగత్తులు ఒక విశ్వము, కొన్ని విశ్వములు ఒక మహా విశ్వము, కొన్ని మహావిశ్వాలు ఒక్క సంసారము ఇత్యాదిగా సృష్టికి పరిగణనగలదు. ప్రతి విషయాన్ని విశేషంగా తెలియగోరేవారు. మహర్షి గార్యాయణ ప్రణీతమైన ప్రణవనాథ క్రియా ప్రకరణాన్ని అధ్యయనం చేయగలరు. ఈ మంత్రంతో దేవిని ఉపాసించే భక్తులకు అనంత బ్రహ్మాండ రహస్యాలు అవగతం అగును. విశ్వాత్మభావం - శాంతి - పరమపదం ప్రాప్తిస్తాయి.
0 Comments