సంహారిణీ (చతురక్షరి)
ఇది నాల్గు అక్షరముల మంత్రము. పూజాసమయంలో "సంహారిణ్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
సంహారిణీ - సమ్యక్ (అనగా లెస్సగా) జాగ్రత్తగా - ఒకానొక క్రమపద్ధతిలో సమస్త సంసారమును తనయందు కల్పాంతమున లీనము చేసుకొనేది పరాశక్తి. విద్యా వియదాది.
కామేశ్వరుడు ప్రకాశము అనియు, శ్రీదేవి విమర్శరూపిణి యనియు, వీరిరువురు శ్రీచక్ర బిందు నివాసులు అనియు వెనుక వివరింపబడినది. “విమర్శ రూపిణీ జగత్ప్రసూః” (లలితా సహస్రనామావళి). ఎటుల అనులోమ క్రమంగా ఆ తల్లి నుండి క్రమ పద్ధతిలో ఆకాశాది సంసారము వచ్చిందో, కల్పాంతము నందు ప్రతిలోమ క్రమంలో ఉపసంహారం పొంది చివరకు ఆ తల్లిలో లీనం అవుతుంది. ఈ విధంగా తనలో సమస్త సృష్టిని ఉపసంహరించుకొనేది పరాశక్తి అని భావం.
సంహారము అనగా చంపుట, నాశనం చేయుట అని అర్థము గాదు. వేణీ సంహారము అనగా కురులను ఒకానొక క్రమ పద్ధతిలో ఉంచడం. ఇలాగే ఋతు సంహారము మొదలైన స్థలము లందును అర్థమును గ్రహింపదగును. కానీ లోకంలో సంహరించుట అనేది చంపుట, నాశనం చేయుట అనే అర్థాలలో ప్రస్తుతం వాడబడుతూ ఉంది. ఇచ్చట మాత్రం అట్టి అర్థాన్ని గ్రహింపరాదు.
తనను ఉపాసించే భక్తులకు సర్వేంద్రియ చాపల్యాలను తొలగించి ఎకాగ్రతను దయతో అనుగ్రహించేది శ్రీదేవి. దీనినే యోగము అనియు తలంపదగును.
ఫలము:
ఈ మంత్రముతో ఉపాసించే సాధకులకు సృష్టి రహస్యము అవగతమై ఏకాగ్రత గల్గి తరిస్తారు.
సాధకుల ఇంద్రియ ప్రవృత్తులను ఉపసంహరించి తరింపజేస్తుంది పరాశక్తి.
0 Comments