Ad Code

సహస్రశీర్షవదనా (అష్టాక్షరి) - Ashtakshari

సహస్రశీర్షవదనా (అష్టాక్షరి)




ఇది ఎనిమిది అక్షరాలు గల్గిన మంత్రము. పూజాకాలంలో "సహస్రశీర్ష వదనాయై నమ” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

సహస్ర - శీర్ష - వదనా = అనంతమైన శిరములు, ముఖములు గలది శ్రీదేవి.
ఇచ్చట - సహస్రము అనగా అనన్తము, అపరిమితము అని అర్థము. వెయ్యి అని పరిగణితమైన సంఖ్య అర్థము గాదు.

ఈ సహస్రశీర్షవదనా” అనే మంత్రము, “సహస్రాక్షి" అనే మంత్రము “సహస్రపాత్” అనే మంత్రము అనగా ఈ 282, 283, 284 అనే మూడు మంత్రాలు శ్రీదేవి యొక్క విరాట్
రూపతను బోధిస్తున్నాయి. శీర్షము అనగా శిరము (1) శిరము ఉన్నచో వదనము (ముఖము) తప్పక ఉండును గదా! మరల వదన అనే పదం ఎందులకు? అని చాలా మందికి సందేహం గల్గవచ్చును. అందుకు సమాధానము వద - వ్యక్తాయాం వాచి అనే ధాతువు నుండి “వదన” అనే శబ్ద ఉత్పన్నం అయ్యింది. “వదతి ఇతి వదనం” వ్యక్తంగా స్ఫుటంగా మాట్లాడునది వదనం అగును. తలలు గల్గిన ప్రాణులు అన్నియును స్ఫుటంగా మాట్లాడలేవు. తినుటకు నోరు మాత్రం చాలా వరకు ఉంటుంది.

ఉదాః- ఈగ, దోమ, ఎండ్రకాయ, పురుగులు మొదలైనవి. కుక్కలు, పిల్లులు, మేకలు మొదలైనవి కొన్ని ధ్వనులను చేస్తాయి కానీ, ఆ ధ్వనులు అవ్యక్తముగానే ఉంటాయి. మన ఉచ్ఛారణవలె వ్యక్తంగా ఉండవు. అందుచే "వదన” పదం వాడబడినది అని గ్రహింపదగును. ఈ సృష్టిలోని అనంతకోటి ప్రాణుల యొక్క శిరములు, వ్యక్త ధ్వనులు చేసే వదనాలు, ఆ పరాశక్తి యొక్క స్వరూపములే అని సారాంశము.

1. పురుష సూక్తంలోనూ (సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్" అని ఉన్నది.
2. విష్ణు సహస్రనామంలోను "సహస్ర మూర్ధా విశ్వాత్మా - సహస్రాక్ష సహస్రపాత్" ఉన్నది. దీనిచే దేవతా సర్వైక్యము తెలియదగును.

ఈ మంత్రంతో దేవిని ఉపాసించే సాధకులకు సర్వ సృష్టియును దేవీ రూపంగా భాసిస్తుంది. మరియూ రాగద్వేషాలు అంతరించి తరిస్తారు.




సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.




Post a Comment

0 Comments