Ad Code

పద్మనాభసహోదరీ (అష్టాక్షరి) - Ashtakshari

పద్మనాభసహోదరీ (అష్టాక్షరి)


ఇది అష్టాక్షరముల మంత్రము. పూజాసమయంలో “పద్మనాభ సహోదర్యై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

పద్మనాభ - సహోదరీ = పద్మనాభుని యొక్క సోదరి శ్రీదేవి.

బ్రహ్మము - “ధర్మ" అనియు, “ధర్మము" అనియు, రెండుగా ఉండును. "ధర్మ" నారాయణుడు, "ధర్మము" పరమేశ్వరియు అగుదురు. నారాయణుడు అనగా విష్ణువు. ఆతనికే పద్మనాభుడు మొదలైనవి పర్యాయపదాలు అగును. ఇటుల ఇరువురును ఒకే బ్రహ్మ యొక్క అంశలు అగుటచే అన్నాచెల్లెండ్రు అయినారు. ఈ విషయమున మరికొన్ని పౌరాణిక గాథలును గలవు.

ఒకప్పుడు దేవతలు రాక్షస వినాశమునకై యజ్ఞము చేశారు. పరమేశ్వరీ కరుణచే ఆ హోమకుండం నుండి ఒక అండము ఆవిర్భవించింది. ఆ అండము యొక్క అర్ధ భాగం నుండి “పద్మనాభుడు", తక్కిన అర్థ భాగం నుండి “పరాశక్తియు” ఆవిర్భవించారు. ఇట్లు ఏకాండ జన్ములు అగుటచే "పద్మనాభుడును - పరాశక్తియు” అన్నాచెల్లెండ్రు అయినారు. వీరలే ద్వాపర యుగంలో - దేవకికి కృష్ణ భగవానుడుగాను, యశోదకు యోగమాయగాను జనించారు అని భాగవతం ద్వారా తెలుస్తుంది.

నిర్గుణము అయిన బ్రహ్మము యొక్క దృష్టి ప్రసారంచే "ప్రకృతియు, పురుషుడును” ఆవిర్భవించారు. వీరు ఇరువురు తమ కర్తవ్యం తెలియక విచారిస్తూ ఉంటారు. అప్పుడు అశరీరవాణి “నీటిలో తపస్సు చేయండి కర్తవ్యం స్ఫురిస్తుంది” అని వినిపిస్తుంది. ఆ విధంగా నీటిలో తపస్సు చేసి కర్తవ్యాన్ని గ్రహిస్తారు. నీటికి "నారములు" అని పేరు గలదు. నారముల వలన అయనమును అనగా కర్మ గమనమును గుర్తించిన వారు అగుటచే అమ్మవారు “నారాయణియు” అయ్యగారు “నారాయణుడు” అయినారు అని శివ పురాణ ద్వితీయాధ్యాయంలో గలదు. నార శయనం (అనగా జల శయనం) వలన నారాయణీ, నారాయణులు అనియు కొందరు అందురు. ఇటుల వీరికి ఏకోదర జనితత్త్వం ఉన్నది. అందుచే అమ్మగారు పద్మనాభ సహోదరి అయినది. ఇరువురును భక్తరక్షా దీక్షితులు.

కాంచీ పురమున ఒక్కప్పుడు బ్రహ్మ దేవుడు తపస్సు చేస్తాడు. అప్పుడు పద్మాసనయు, పద్మహస్తయును అయిన పరాశక్తి తన సోదరుడైన పద్మనాభుడితో సహా ప్రత్యక్షమై అతనికి అభీష్ట వరమును ప్రసాదిస్తుంది. ఇటుల వీరి సోదరత్వమును బోధించే గాధలు చాలా గలవు.
ఈ మంత్రముతో దేవిని ఉపాసించే వారికి అమ్మ కరుణయు, పద్మనాభుడైన విష్ణు దేవుని కరుణయు ప్రాప్తిస్తాయి.

సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments