శ్రీ మహావిష్ణువు దశావతారాలు
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించాడు. పరమేశ్వరుడూ అంతే సృష్టికోసం అయిదు అవతారాల్లో వ్యక్తమయ్యాడు. ఆ అవతారాలే తర్వాత శివుడి పంచ ముఖాలుగా ప్రసిద్ధి పొందాయి. మహేశ్వరుడు నిర్వహించే అయిదు మహాకృత్యాలైన సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలకు ఇవి ప్రతీకలు. ఇవి భూతనాథుడి అనంతత్త్వాన్ని వివరిస్తాయి. శివపురాణంలో ఉన్న విశేషాలివి.
సద్యోజాత అవతారం : శ్వేతవరాహకల్పంలో సృష్టికార్యాన్ని నిర్వహించే సమయంలో బ్రహ్మదేవుడు ముందుగా పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానించాడు. ఆ సమయంలో తెలుపు, ఎరుపు రంగుల మిశ్రమవర్ణంతో ఒక బాలుడు ఉద్భవించాడు. అతడే సద్యోజాతమూర్తి. సృష్టి కార్యక్రమం నిర్వహించటానికి అవసరమైన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు.
తత్పురుషావతారం : పీతావాసకల్పంలో బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పీతాంబరాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. తత్పురుష గాయత్రీ మంత్రోపాసన ఫలితంగా ఆవిర్భవించిన ఈ మూర్తి తత్పురుషమూర్తిగా పూజలందుకుంటున్నాడు. తత్పురుష పరమేశ్వర అనుగ్రహం వల్ల బ్రహ్మదేవుడికి సృష్టిక్రియకు అవసరమైన శక్తి వచ్చిందని అంటారు.
వామదేవావతారం : రక్తకల్పంలో ఈ అవతారం కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు చేసిన ప్రార్థనకు సంతోషించి, పరమేశ్వరుడు ఎర్రని పూలమాల ధరించి, ఎరుపు రంగు వస్తాల్రు, ఆభరణాలు ధరించి వామదేవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈయన అనుగ్రహాన్ని పొందిన బ్రహ్మదేవుడు సకల ప్రాణికోటిని సృష్టించాడు.
అఘోరావతారం : శివకల్ప సమయంలో సర్వసృష్టి చేసే సందర్భంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని ధ్యానించాడు. అప్పుడు పరమేశ్వరుడు నల్లని వస్తాల్రు, కిరీటం ధరించి, నలుపు రంగు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఈయన అనుగ్రహఫలితంగా బ్రహ్మదేవుడు సకల సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించాడు.
ఈశానావతారం : విశ్వరూపకల్పంలో పరమేశ్వరుడు ఈశానావతారంలో వ్యక్తమయ్యాడు. తెల్లటి శరీర ఛాయ కలిగి ఉన్న ఈ పరమేశ్వరమూర్తి బ్రహ్మదేవుడికి సృష్టి కర్మ చేసే విధానాన్ని బోధించాడు. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి తారకాసురుడి కంఠాన్ని ఛేదిస్తాడు. ఈ ఘటనలో తారకుడి మెడలో ఉన్న అమృతలింగం అయిదు ముక్కలై భూమిపై ఐదుచోట్ల లింగాలుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాటినే పంచారామక్షేత్రాలని చెబుతారు. వీటిలో అమరారామం (అమరావతి) అఘోర ముఖానికి, ద్రాక్షారామం తత్పురుష ముఖానికి, కుమారారామం (సామర్లకోట) వామదేవ రూపానికి, సోమారామం (భీమవరం) సద్యోజాత రూపానికి, క్షీరారామం (పాలకొల్లు) ఈశానముఖానికి ప్రతీకలని అంటారు.
0 Comments