విజ్ఞానఘనరూపిణీ (అష్టాక్షరి)
ఇది అష్టాక్షరముల మంత్రము. పూజాసమయంలో “విజ్ఞానఘన రూపిణ్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
విజ్ఞాన మన రూపిణీ = అయమాత్మబ్రహ్మ, ఇత్యాది రూపమైన అపరోక్షానుభూత్యాత్మకము అగు అనుభవ జ్ఞానమును వర్షించే మేఘము వంటిది.
జ్ఞానము బహువిధాలుగా ఉంటుంది.
(1) శాస్త్రజ్ఞానము
(2) అనుభవజ్ఞానము
(3) శ్రవణజ్ఞానము మొదలైనవి.
శాస్త్రజ్ఞానముతో బాటు అనుభవజ్ఞానము గల్గిన వారు విజ్ఞానులు అనబడుదురు. వీరు అనుభవ విశిష్ఠమైన జ్ఞానము కలవారు అని నిర్వచనము. శ్రీ వ్యాసమహర్షి. శ్రీ వివేకానందస్వామి, సద్గురు శ్రీ మలయాళ మహర్షి మొదలైన వారు విజ్ఞానులు అనదగుదురు.
“ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యదాక్షాత్వా మోక్ష్యసే శుభాత్ ||
(శ్రీ భగవద్గీత)
సంగ్రహ భావముః -విజ్ఞాన సహితులైన సద్గురువులను ఆశ్రయించిన వారు అశుభమైన సంసార ప్రవాహాన్ని త్వరలో తరిస్తారు. పరాశక్తి శ్రీదేవి అనన్త కరుణా మూర్తి. విజ్ఞానము అనగా సాధకులకు సులభంగా ఆత్మానుభూతి రూపమైన అనుభవజ్ఞానమును వర్షించే వర్షా మేఘము వంటిది.
వెనుకటి మంత్రమునందు ఈ విషయం కొంత తెలుపబడింది. మూలాధారం నందలి కుండలినీ శక్తిని జాగృతం గావించి సహస్రారచక్రం చేర్చినచో సాధకునికి వెంటనే సుధాసార ప్రవృష్టి గల్గుతుంది. అప్పుడు ఆత్మానుభూతి రూపమైన విజ్ఞానం అనుభూతం అవుతుంది.
“సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ” (లలితా సహస్రనామావళి).
ఇటుల ఉపాసకులకు అందరికిని, అనుభవరూపమైన విజ్ఞానాన్ని వర్ణించే వర్షాకాల మేఘ స్వరూపిణీ శ్రీదేవి.
ఈ మంత్రంతో అమ్మను ఉపాసిచే సాధకులకు త్వరలో ఆత్మానుభూతియు, ఐహిక, ఆముష్మిక శుభాలును ప్రాప్తిస్తాయి. ఈ విషయమున శ్రుతి ప్రమాణము.
“ఇదంయతు మహద్భూతం అనన్తమపారం ప్రజ్ఞానమేవచ”
శ్రీదేవి ప్రభావము మహిమాన్వితమును, అనన్తమును, అపారమును, ప్రజ్ఞానమును అయినది.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments