సుప్తా (ద్వ్యక్షరీ)
ఇది రెండు అక్షరాలు గల్గిన మంత్రము. పూజాసమయంలో “సుప్తాయై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
సుప్తా = సుషుప్త్యావస్థా రూపమైనది శ్రీదేవి. అనగా “సుషుప్తి” అనే అవస్థకు సాక్షిణియై ఉండేది.
"విశ్వరూపా” అనే 256వ మంత్ర వివరణమే 271వ మంత్రము అయిన “ఈశ్వరీ” అనే మంత్రము వరకు అని వెనుకదెల్పిన విషయాన్ని పాఠకులు గుర్తుంచుకొనవలయును. శ్రీలలితా సహస్రనామ మంత్రావళిలో,
“విశ్వరూపా జాగరిణీ స్వపనీ తైజసాత్మికా
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా"
అనే 62-63 శ్లోక మంత్ర భావాలు "మాండూక్యోపనిషత్తు" యొక్క సారాంశములై గంభీరంగా ఉన్నాయి. పాఠకులు మాండూక్యోపనిషత్తును అధ్యయనం చేయడం శుభము. ప్రస్తుతం సంగ్రహంగా వివరణ చేయబడుతున్నది. “సర్వావస్థా వివర్జితా” అనే 263వ మంత్రం తర్వాత మరికొన్ని విషయాలు తెలుపబడును. గాఢ నిద్రావస్థ స్థితిలో సాక్షిణియై విరాజిల్లేది శ్రీదేవి.
జాగ్రదవస్థను జీవుని ప్రథమ పాదం అనియు, స్వప్నావస్థ జీవుని ద్వితీయ రూపమైన “ప్రత్యగాత్మ స్థితిని” జీవుని చతుర్ధపాదము అనియును మాండూక్యోపనిషత్తుచే వివరింపబడింది.
“యత్ర సుప్తో న కల్చిన కామం కామయతే
న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తమ్
(మాండూక్యోపనిషత్).
గాఢ నిద్రావస్థలో జీవుడు జాగ్రదవస్థ యందు వలే ఏ కోరికను కోరడు. స్వప్నావస్థయందు ఏ విధమైన కలలను చూడడు. ఇటువంటి ఘనీభూత ప్రజాస్థితి “సుషుప్తావస్థ”
లేక “సుషుప్త్యవస్థ” అనబడును. జాగ్రదావస్థలో జీవుడు నేత్ర స్థానమునందు ఉంటాడు.
స్వప్నావస్థలో కంఠస్థానము నందుండే హిత నామక నాడిలో అణిగియుంటాడు. సుప్తావస్త జీవుని స్థానము హృదయము. ఇచ్చట అనగా హృదయంలో బుద్ధిలేదు. అందుచే రాగేచ్ఛాదులు లేవు. రాగేచ్ఛాదులు బుద్ధి ధర్మములే అగును. ఆత్మ ధర్మాలు గావు. అందువల్లనే నిద్రనుండి లేచిన తర్వాత నేను సుఖముగా నిద్రించినాను. నాకు ఏమియును తెలియలేదు అనును. సుషుప్తిలో ఆత్మ ఉన్నది. ఇది ఆనందస్వరూపము. ఒక మహాత్ముడు నిర్వికల్ప సమాధిలో ఏ సుఖాన్నైతే అనుభవిస్తాడో, అలాంటి సుఖాన్ని అజ్ఞానియు గాఢనిద్రలో అనుభవిస్తాడు. అయితే అది ఆత్మసుఖము అని అజ్ఞానికి తెలియదు. సుషుప్తిలో అనుభవం ఉంటుంది.
జాగ్రదావస్థలో స్మరణ ఉండును. అనుభవం లేనిది స్మరణ రాదు. నిన్నటి అనుభవాన్ని నేడు స్మరిస్తున్నాము. స్మరణయు, స్మృతియు పర్యాయపదాలు అగును.
సుప్తావస్థ యందును సాక్షిణియై విరాజిల్లేది శ్రీదేవి. ఉపాసించే సాధకులకు ఆ తల్లి సర్వశుభములతో రక్షిస్తుంది.
0 Comments