ధర్మాధర్మవివర్జితా (అష్టాక్షరి)
ఇది ఎనిమిది అక్షరముల మంత్రము. పూజాసమయంలో “ధర్మాధర్మ వివర్జితాయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
ధర్మ - అధర్మ - వివర్జితా = ధర్మ కర్మల చేతను, అధర్మ కర్మల చేతను విడువబడినది.
ఈ మంత్ర భావము చాలా గంభీరమైనది.
సాధకులు ఏకాగ్రతగా అర్థం చేసుకోవాలి. ధారయతి లోకాన్ ఇతి ధర్మః లోకాలను రక్షించేది ధర్మము. ధర్మానికి మూలము వేదము అని శ్రుతి. వేద నిషిద్ధ కర్మలు అధర్మములు.
"ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే”.
ధర్మ సంరక్షణకై నేను ప్రతి యుగములో అవతరిస్తాను అని భగవద్గీత. ఇలాంటి స్థితిలో శ్రీదేవిని ధర్మాధర్మ వివర్జితా అనడం ఎట్లు సాధ్యం అగును?
'ఉపాస్య ఉపాసకయోః అభేదః' అనే న్యాయాన్ని అనుసరించి దేవి ఉపాసకులు గూడ ధర్మాధర్మాలు గుర్తింపక స్వేచ్ఛానువర్తనులై ఉంటారను ప్రశ్నలు సామాన్యులకు జనిస్తాయి.
ఇందుకు సమాధానం:
పరిపూర్ణంగా శ్రీదేవిని శరణు పొందిన వాడు అధర్మ కార్యాలను ఎట్టి స్థితి లోను చేయరు. తన్ను అనన్యంగా ఉపాసించే భక్తులను ఆ తల్లి పవిత్ర ధర్మ మార్గంలోనే హృదయవాసినియై నడిపిస్తుంది. అందుచే ధర్మ నిర్ణయ విషయంలో కాలాన్ని వ్యర్థం చేయక పరిపూర్ణంగా అమ్మను.శరణు పొందాలి అనే భావమే ఈ మంత్రం ద్వారా సాధకులు గ్రహించాలి.
“తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాని తే
తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః
నాశయమ్యాత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వతా!" (భగవద్గీత)
శ్లోక భావము:
నన్ను నిత్యం అనన్యంగా భజించేవారికి నన్ను చేరడానికి అవసరమైన బుద్ధిని నేను అనుగ్రహిస్తాను. జ్ఞానదీపంగా వారి హృదయంలో ప్రకాశిస్తాను. అజ్ఞాన తిమిరాన్ని నశింపజేస్తాను. ఇటుల అజ్ఞానం నశించిన పుణ్యపురుషులు రాగద్వేషమయములైన అధర్మకార్యాలు
ఎన్నటికినీ చేయరు.
“సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః (భగవద్గీత)
ఈ శ్లోకంలో గీతాచార్యుడును ధర్మాధర్మ విచారణను వీడి నా శరణుపొంది అన్ని కర్మలను చేయవలసినది అని ఉద్భోదించారు.
తనను నమ్మిన వారిని జ్ఞానమార్గంలో, ధర్మమార్గంలో ఆ తల్లియే హృదయ వాసినియై నడిపిస్తుంది. అందుచే ధర్మాధర్మ శాస్త్ర చర్చలో పడక ఆ తల్లిని పూర్ణంగా శరణు పొంద వలయును.
ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారికి ఆ దేవియే తన్ను చేరే మార్గం చూపిస్తుంది. అందుచే వారు శాస్త్ర చర్చలో మనస్సును వాడుకొనరు. అనగా కాలాన్ని వ్యర్థపరచరు.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments