Ad Code

గోవిందరూపిణీ (షష్టాక్షరి) - Shatakshari

గోవిందరూపిణీ (షష్టాక్షరి)



ఇది ఆరు అక్షరాల మంత్రము. పూజాకాలంలో "గోవింద రూపిణ్యై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

గో-వింద-రూపిణీ
గో = వేదాంత వాక్కులచే,
వింద = తెలియదగిన - తెలియబడే,
రూపిణీ = రూపము గలది శ్రీదేవి.

ఈ అర్ధ సాధన విషయంలో ఇలా విగ్రహ వాక్యము చెప్పవచ్చును.

గోభిః = వేదాంత వాక్యైః
విందతే = లభతే
రూపం = ఆకృతి, విశేషః,
యస్యాః సా = వేదాంత రూపిణీ.

వేదాంత వాక్కులచే తెలియదగిన రూపం గలది. శ్రీ సూక్తము, భావనోపనిషత్తు మొదలైనవి అమ్మవారి స్వరూపము వివరంగా బోధిస్తున్నాయి.

విశేషాంశములు:
గో - వింద = ఇంద్రియాలకు ఆహ్లాదమును గల్గించే; రూపిణీ = రూపము గలది అనియు కొందరు నిర్వచనం చేస్తారు. కుండలినీ శక్తి సహస్రార చక్రమును చేరినచో సుధాసార ప్రవర్షంచే సర్వేంద్రియాలు ఆనంద ప్లావితములు అగుట సాధకులకు అనుభవ సిద్ధము.

గోవిందుడు అనగా విష్ణువు. అమ్మవారి సోదరుడు. “పద్మనాభసహోదరీ” అని లలితా సహస్రనామావళి. విష్ణువు స్థితికారుడు. అందుచే విష్ణు రూపముతో జగత్తును రక్షించేది శ్రీదేవి.

గో - సూర్య కిరణముల ద్వారా అనగా బంగారు వన్నె గల సూర్య కిరణాల ద్వారా,
వింద = తెలియదగిన; రూపిణీ = రూపం గలది శ్రీదేవి. “హిరణ్య వర్ణాం హరిణీమ్” అని శ్రీ సూక్తము.

“రుక్మాభాం స్వసుధీ గమ్యమ్” అనియు శ్రుతి. సాధకులకు ప్రథమముగా ఆత్మానుభూతి బంగారువన్నెతో భాసించడం అనుభవసిద్ధము.

గో - పదమునకు భూమి, సరస్వతి, ఇంద్రియాలు వంటి వాటి యధార్థ స్థితి తెల్పిన వాడు గోవిందుడు. అట్టి రూపము కలది శ్రీదేవి. అనగా వాక్కులను, ఇంద్రియాదులను క్రమ పద్ధతిలో ఉపయోగింపజేసి జీవితమును తరింపచేసేది శ్రీదేవి. ఇటుల పండితులు ఎన్నియో అర్థాలు బోధిస్తారు. లక్ష్య ప్రాపకములైన అర్థాలు అన్నియును గ్రాహ్యములే అగును.

ఈ మంత్రముచే దేవిని ఉపాసించేవారు లక్ష్యమైన పరమ పదమును పొంది తరిస్తారు.





Post a Comment

0 Comments