Ad Code

విశ్వరూపా (చతురక్షరి) - Chaturakshari

విశ్వరూపా (చతురక్షరి)



ఇది నాల్గు అక్షరాలు గల్గిన మంత్రము. పూజాసమయంలో “విశ్వరూపాయై నమః” అని శ్రద్ధాభక్తులతో ఉచ్చరించాలి.

విశ్వరూపా = సమస్త ప్రపంచము తన రూపంగా గలది.

ఈ మంత్రం నుండి అనగా 256 మంత్రం నుండి ఈశ్వరా 271 మంత్రం వరకు ఒకే విషయం వివరింపబడుతూ ఉంది.

విశ్వరూపా అని సారాంశాన్ని సంగ్రహంగా బోధించి ఏవిధంగా పరాశక్తి విశ్వరూపయో అనే విషయం విశ్లేషింప బడుతుంది. ప్రస్తుత మంత్ర భావము నిశ్చల తత్త్వంతో ప్రకాశిస్తూ ఉండే చైతన్యవంత శ్రీశక్తి. ఇట్టి శక్తి పరవశానందంతో నర్తిస్తూ, వ్యాపిస్తూ, నవరసాత్మకమైన ఈ సృష్టిని రచిస్తూ,పెంపొదిస్తూ ఉంటుంది. మహాద్భుతమైన ఈ రచనా శిల్పం మిక్కిలి క్రమబద్ధంగా ఉంటుంది. ప్రకాశించే తత్త్వాన్ని కామేశ్వరుడు అని, ప్రకాశము అని అందురు. నర్తించే తత్త్వాన్ని శ్రీదేవి, లలితాదేవి,రాజరాజేశ్వరి, ఇత్యాది నామాలతో పిలుస్తారు. విస్తరణ రూపం పరాకాష్ఠ నందగానే అదే ధంగా కుంచించుకొని పోతుంది. అంతయును ఒక బిందువుగా ఏర్పడుతుంది. శ్రీచక్ర బిందువు దీనికి సంకేతమే అగును. ఇటుల శ్రీదేవి పిండాండ బ్రహ్మాండాది రూపమైన విశ్వము తానే అయినది. అందుచే “విశ్వరూపా” అని ఉపాసింపబడుతుంది. వ్యష్టి రూపము పిండాండము.

సమష్టి జీవరూపము బ్రహ్మాండము అగును. ఇక వ్యష్టి పక్షమున విశ్వ - తైజస - ప్రాజ్ఞ - జీవాంగములు గలవు.

ప్రత్యగాత్మలు అనే సమష్టి పక్షమున విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత (అంతర్యామి) పరమాత్మలు అనే నాల్గు ఈశ్వరాంగములు. అటులనే వ్యష్టి పక్షమున జాగ్రత్ - స్వప్న - సుషుప్తి, తురీయము అనే నాల్గు అవస్థలు. సమష్టి పక్షమున బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులు అనే పంచ దైవతములు ఇత్యాదికము అంతయును శ్రీదేవియే అగును. ఇటుల ఆ తల్లి “విశ్వరూపా” అని ఉపాసింపబడుతున్నది.

ఈ చరాచర విశ్వంలో ఆ తల్లికి భిన్నంగా ఏదియును లేదు.

ఈ మంత్రంతో ఉపాసించే వారికి సర్వత్రా తల్లియే గోచరిస్తుంది. రాగద్వేషాలు అంతరిస్తాయి. శాంతి శుభాలను త్వరలో పొంది తరిస్తారు.





Post a Comment

0 Comments