Ad Code

కామాక్షీ అమ్మ వారి వైభవం

కామాక్షీ అమ్మ వారి వైభవం


క్వణతకాంచీ దామా కరికలభ కుంభస్తననతాపరిక్షీణామధ్యే పరిణిత శరచ్చంద్రవదనా |
ధనుర్బాణాన్ పాశం సృణి మపి దధనా కరతలైఃపురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా ||

ఒకప్పుడు పరమశివుడు కైలాసపర్వతం మీద కూర్చుని ఉన్న సమయంలో, అమ్మవారు లీలావినోదంగా ఆయనతో సంతోషంగా కాలంగడుపుతూ, ఆయన రెండు కళ్ళూ మూసింది. ఆయన రెండు కళ్ళు 'సూర్యచంద్రౌ చ నేత్రే'ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. అగ్నిహోత్రం మూడవ కన్ను. ఆ కారణం చేత ఆవిడ ఆయన రెండు కన్నులూ మూస్తే లోకమంతా చీకటియిపోయింది. సూర్యచంద్రుల గమనం లేకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ధర్మచక్రం ఆగిపోతుంది. ఏది లుప్తమైనా పరవాలేదు గానిధర్మచక్రం ఆగిపోకూడదు.ఏ పని చేసినా ఆయా కాలాలలో చేయాలి తప్ప, ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చేయకుండా వేరొక పని చెయ్యకూడదు. సూర్యచంద్రులు కదలిక లేక ఆగిపోవడంతో లోకమంతా చీకట్లు కమ్మి కాలం తెలియలేదు కాబట్టి చేయవలసిన అనుష్టానాలు జరగక ధర్మానికి గ్లాని ఏర్పడింది. ఇది జరిగినది పరమశివునకు లిప్తకాలమైనా భూలోకంలో దాని ప్రభావం చాలా ఉంటుంది. లోకులు ఖేదపడ్డారు. ఈశ్వరునిలో ఉన్న గొప్పదనం ఏమిటంటే అమ్మవారికి పాపపుణ్యాలు ఉండవు. కానీ ఒక పని చేసినప్పుడు ఇతరులు బాధ పడేటట్లు చేస్తే అది దోషమవుతుంది. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. సూర్యచంద్రుల ప్రకాశం లేక లోకులు బాధ పడ్డారు. పార్వతీ దేవి కదా అని ఉపేక్షిస్తే లోకంలో మిగిలిన వాళ్ళు ఇతరులను బాధపెట్టి మేం మాత్రం ఎందుకు ఉపేక్షించ కూడదు అంటారు. అందుకని ఆయన భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి అంటే ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేసింది.ఆ తల్లి ఉత్తరభారతంలో హిమాలయాల మీద ఎప్పటి నుండో తనని కుమార్తెగా పొందడానికి ప్రయత్నిస్తూ తపస్సు చేసుకుంటున్న కాత్యాయన మహర్షి కుమార్తె అయి, కాత్యాయనుని కూతురు కాబట్టి కాత్యాయిని అని పేరుపొందింది. ఆ తల్లి యుక్త వయస్సు పొందిన తరువాత ఆమెకి వివాహం చేయవలసివచ్చింది. అమ్మవారు ఎంతమందికైనా కూతురవుతుంది కాని పరమేశ్వరునికే ఇల్లాలు. ఆయనని భర్తగా తేవడం ఆమెకే సాద్యం తప్ప ఇతరులకు సాధ్యం కాదు. కాత్యాయనమహర్షి కొన్ని వస్తువులిచ్చి అమ్మా! ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు ఏ ప్రాతాంనికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయి ఈశ్వరుడు స్వీకరించి భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుంటాడు. ఆమె బయలుదేరి దక్షిణదేశం వస్తుండగా, కాంచీపురానికి వస్తున్నప్పుడు ఆమెకి ఇచ్చిన వస్తువులు మార్పు చెందాయి. ఆ పట్టణంలోనే తపస్సు చేయాలని అమ్మవారు అక్కడ తపస్సు ప్రారంభించింది. పరమశివుడు ఆమెకి తన పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో ఎంతటి మహాపతివ్రతో లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆయన తన జటాజూటంలోని గంగపాయను ఒకదానిని విడచి పెట్టాడు. విశేషమైన ప్రవాహంతో విచ్చేస్తున్నది. ఆవిడ ఇసుక లింగాన్ని చేసి ఆరాధన చేస్తున్నది. ఆమెకి తాను కొట్టుకుపోతాననిబెంగ కాదు, సైకత లింగం కొట్టుకొనిపోతుందేమో అని బెంగ కలిగి దుర్గమ్మ ఆవిర్భవించేటట్లుగా ధ్యానం చేసి ఆ నీటినంతటినీ త్రాగేయమంది. ప్రళయకాల బంధిని అయిన గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టి దుర్గమ్మ తాగేసింది. శివుడు చూసి ఏం చేస్తుందో చూద్దామని అంతకన్నా అధృతమైన ప్రవాహాన్ని విడిచి పెట్టాడు. బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం వైపు వస్తుంటే, పార్వతీదేవి కంప కంప అన్నది. అంటే భయం భయం అని అర్థం. అమ్మవారే భయం పోగొట్టగలిగిన ఆదిశక్తి. ఆవిడకు భయం లేదు. సైకత లింగం వెళ్ళిపోతుందని ఆవిడకు భయం. ఆ శివలింగం పోవడానికి వీలు లేదు. లింగానికి నీళ్ళు తగిలేముందు నేనే వెళ్ళీపోవాలని, తన పతిభక్తిని చాటిచెప్పడానికి, సైకత లింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నది. అప్పుడు అమ్మవారి కుచములు, కంకణాల ముద్రలు శివలింగం మీద పడ్డాయి. పరమశివుడు చూసి అమ్మవారి పతిభక్తికి మెచ్చి, ప్రవాహాన్ని ఉపసంహారం చేసి అమ్మవారిని తాను స్వీకరించాడు.




Post a Comment

0 Comments