తిరుమల శ్రీవారి నైవేద్యాలు
సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. రోజుకు మూడు పూటలా స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.
ఉదయం బాలభోగం మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి ఉంటాయి. మధ్యాహ్నం రాజభోగంలో శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం ఉంటాయి. ఇక రాత్రి శయనభోగంలో మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం ఉంటాయి.
అల్పాహారాల విషయానికి వస్తే లడ్డు, వడ, అప్పం, దోసె ఉంటాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగుతేలే ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు. ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది.
అష్టోత్తరశతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి స్వామివారిని తాజాపూలతో అలంకరిస్తారు. అష్టోత్తరశతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం పెడతారు. ఇక పవళించే సమయం దగ్గర పడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడిపాలు స్వామివారికి సమర్పిస్తారు.
0 Comments