Ad Code

రుచులు దేనికి కావాలి? నాలుకకా? శరీరానికా? - Health Care And Life Style


రుచులు దేనికి కావాలి? నాలుకకా? శరీరానికా?



షడ్రుచులు అంటే ఆరు రుచులు. తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు.

వంటల్లో వగరు, చేదు రుచులకు చోటుండదు.
ఈ ప్రపంచంలో ఎవరైనా ఎన్ని రకాలుగా అయినా వండుకోవడానికి వాడే రుచులు ఏడు రకాలు.
అవి ఉప్పు, నూనె, నెయ్యి, తీపి, పులుపు, కారం, మసాలాలు. ఈ ఏడింటిలో ఉప్పు తల్లిలాంటిది. మిగిలినవి దాని పిల్లలు అని చెప్పొచ్చు.

ఇక విషయానికి వద్దాం! వంటలలో వాడే ఏడు రుచులు దేనికి కావాలి? శరీరానికా? నాలుకకా? లేదా రెండింటి గురించా? మనం దేని గురించి ఈ రుచులు వాడుతున్నాం? ఆలోచించండి.

వంట వండిన తరువాత పాత్రల్లోని పదార్థాన్ని అరచేతిలో/ప్లేటులో వేసుకొని నాలుకతో రుచి చూస్తారు. అన్ని రుచులు సరిగ్గా సరిపోయాయా? లేదా ఇంకేమైనా కావాలా? అని.

నాలుకను అడిగితే వెంటనే ఇంకాస్త ఉప్పు ఉంటే బావుంటుందనో/ఎక్కువనో ఠక్కున చెబుతుంది. దాన్ని సరిచేస్తాం. ఎవరూ శరీరాన్ని రుచి కావాలా, వద్దా అని అడగరు. కొసరి కొసరి ప్రతీ రోజూ అడిగి మరీ రుచులను వేయించుకునేది నాలుకే.

అందుకే రుచులు అనేవి శరీరం కోరే కోర్కెలు కావు, కేవలం నాలుక కొరకు మాత్రమే. జిహ్వని జయిచండి. మనం తినే ఏడు రుచులు నాలుకకు పట్టవు. నాలుక కాసేపట్లో ఆ రుచులన్నింటినీ దులిపేసుకుని, తను శుభ్రంగా ఏమీ అంటనట్లు కూర్చుంటుంది. చివరకు ఆ రుచులన్నీ పొట్ట, ప్రేగులను ఇబ్బంది పెట్టి, అక్కడ నుండి ప్రతి అవయవానికి చేరి వాటిలో పేరుకు పోతూ, అవయవాలను ముప్పతిప్పలు పెడుతుంటాయి.

ఆ రుచులను నాలుక వల్ల తిన్నా, ఆ నష్టాన్ని అనుభవించేది శరీరం. వాస్తవానికి ఏ రుచీ శరీరానికి అక్కర్లేదు. ఈ రుచుల కారణంగా శరీరానికి ఎన్నో రకాల జబ్బులొస్తున్నాయి. కానీ.. నాలుకకు ఇంత వరకు ఏ జబ్బూ రాలేదు. శరీరాన్ని మోసం చేస్తూ తను హాయిగా తప్పుకుంటుంది. కాబట్టి నాలుక చెప్పినట్లు వినడం గానీ, నాలుక కొరకు తినడం గానీ చెయ్యకూడదు. అందుకే మన పెద్దలు జిహ్వ(నాలుక) జయిస్తే లోకాన్ని జయించవచ్చంటారు.

బెత్తెడు నాలుక గురించి ఆలోచిస్తూ బారెడు శరీరాన్ని నాశనం చేసేవి ఆ ఏడు రుచులు. రుచి ఎక్కడుందో రోగం అక్కడే ఉంది. బారెడు శరీరాన్ని రక్షించుకోవడానికి బెత్తెడు నాలుకను ఇబ్బంది పెట్టినా దోషం లేదు. ఏడు రుచులను ఎత్తివేసి నాలుక తిక్క కుదురుస్తూ, శరీరాన్ని రక్షించుకుంటూ ఉంటే ఆరోగ్యం అనేది వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చేస్తుంది.

ఈ ఏడు రుచులు ఏడు సరిగమలు లాంటివి. ఏడు సరిగమల నుండి ఎన్నో వందల రాగాలు పుడుతున్నాయి. అలాగే, ఏడు రుచుల నుండీ ఎన్నోవేల రోగాలు కూడా పుడుతున్నాయి. రోగాలు రాకుండా చేసుకోవాలంటే ఏడు రుచులపై దృష్టి సారించండి. శరారానికి హాని చేసే రుచులను వదిలిపెట్టండి. ఆరోగ్యంగా ఉండండి.


Post a Comment

0 Comments