మహాసనా (చతురక్షరి)
ఇది నాల్గు అక్షరాల మంత్రము. పూజా కాలంలో “మహాసనాయై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
"మహత్ ఆసనమ్ యస్యాః సా మహాసనా" అని విగ్రహవాక్యము. మహిమాన్వితమైన ఆసనము, నివాస స్థానము గలది లేక అయినది శ్రీదేవి అని సామాన్య భావము.
క్షితి మొదలుకొని శివ పర్యంతము ముప్పదియారు తత్త్వములు అనే ఆసనములను అధిష్టించి ఉన్నది పరాశక్తి అనదగును. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులను పంచబ్రహ్మలను ఆసనములుగా గలది అనియు తలంపవచ్చును. సమష్టి కుండలిని అనంత సృష్టి అని గ్రహించాము. అనంతమైన సృష్టియే తన రూపంగాను,నివాసం గానూ గలది అగుటచే శ్రీదేవి మహాసనా అగును. కొందరు శ్రీచక్రమే సమస్త సృష్టికిని సంకేతము అగుటచే, అదియే అనగా శ్రీచక్రమే ఆసనంగా గలది శ్రీదేవి అనియు అనుభవయుతంగా బోధిస్తారు. "శ్రీచక్ర రాజనిలయా" "పంచబ్రహ్మాసన స్థితా" అనే మంత్రాలు ఈ భావాన్నే వివరిస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తారు.
ఈ మంత్రముతో శ్రీదేవిని ఉపాసించే వారికి అంతటను ఆ తల్లియే గోచరిస్తుంది. అమ్మ రక్షణము లభిస్తుంది.
0 Comments