మహాత్రిపురసుందరీ (అష్టాక్షరి)
ఇది ఎనిమిది అక్షరముల మంత్రము. పూజాకాలంలో “మహాత్రిపురసుందర్యై నమ:” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
మహా త్రిపురసుందరి = మూడు పురములందలి సుందరీమణుల కంటెనూ మహిమాన్వితమైనది.
శ్రీచక్ర బిందువునకు ప్రథమ త్రికోణంలో మూడు కోణములందు కామేశ్వరీ - వజేశ్వరీ - భగమాలినీ అని మూడు కోణదేవతలు ఉందురు. సౌందర్య మూర్తులు ఆ కోణదేవతలు మువ్వురును తనే అయి ఆనందమయియై విరాజిల్లునది అగుటచే మహా త్రిపురసుందరీ నామంచే కీర్తింపబడుచున్నది శ్రీదేవి.
కొందరు జాగ్రదవస్థా, స్వప్నావస్థా, సుషుప్యావస్థా అనే అవస్థాత్రయాన్ని మూడు పురములు అందురు. అటులనే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు పురాలు. అట్టి త్రికాన్ని అతిక్రమించినది అగుటచే మహా త్రిపురసుందరీ అనియు అందురు. ఇటులనే జ్ఞాత -జేయ - జ్ఞానములు.
బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు; అ - కార, ఉ-కార, మ - కారాలు, జ్ఞాన, క్రియా, ఇచ్ఛా శక్తులు భూః భువః, సువః అనే వ్యాహృతి త్రయము ఇత్యాదిగా ఎన్నియో త్రికములను కొందరు పండితులు పేర్కొందురు. వీటన్నింటికినీ అతీతమైన అనంత సౌందర్య విధాయినియైనది శ్రీదేవి అందురు.
ఈ మంత్రముచే శ్రీదేవిని ఉపాసించే వారికి త్రిగుణాతీతమైన సత్య, శివ, సుందరమైన ఆత్మానుభూతి లభిస్తుంది.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments