Ad Code

మహాకామేశమహిషీ (అష్టాక్షరి) - Ashtakshari

మహాకామేశమహిషీ (అష్టాక్షరి)



ఇది అష్టాక్షరములు గల్గిన మంత్రము. పూజా కాలంలో “మహాకామేశ మహిష్యై నమ:” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

మహాకామేశ + మహిషీ = మహిమాన్వితములైన కోరికలకు అధిపతియైనవాడు, పరమేశ్వరుడు. అతనికి పట్టపురాణి శ్రీదేవి. అనగా శివశకైక్య స్వరూపిణి అని భావము.
"కము - కాస్తే” అనే ధాతువునుండి కామ శబ్దము ఉత్పన్నమైనది. కాంతి అనగా ఇచ్చ, కోరిక అని అచ్చటనే వ్యాఖ్యానింప బడినది. అనర్థదాయకమైన కోరికనే సామాన్యంగా కామం అని వ్యవహరిస్తారు.

గీతాచార్యుడును “జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్” అని కామమును మహా శత్రువుగా పేర్కొన్నాడు. ఇచ్చట కామ పదానికి మహా అనే విశేషణము ఉంది. మహా (మహత్) అనేది పవిత్రతను, మహాత్మ్యాన్ని బోధిస్తుంది. అందుచే ధన, దార, పుత్రాది భౌతికమైన కోరికలు గాక మహిమాన్వితమైన ప్రశస్తమైన పరమపురుషార్థ రూపమైన కోరికను మహాకామ పదం బోధిస్తుంది. దానినే ముముక్షుత లేక జిజ్ఞాసుత అనియు తలంపదగును.
అటువంటి మహా కామానికి అనగా పరమ పురుషార్థానికీ, తత్కారణ జ్ఞాన సిద్ధికి అధిపతి పరమేశ్వరుడు.

'జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్” (శాస్త్రము), పవిత్ర జ్ఞానము, తద్వారా పవిత్ర కోరికలు మహేశ్వరి కరుణచే లభిస్తాయి అని సారాంశము.

ఈ కారణం చేతనే మనవారు 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరి చేతనే అక్షరాభ్యాసం ఈ బిడ్డలకు చేయిస్తారు. ఇట్టి విశుద్ధమైన కోరికలకు అధినాయకుడైన పరమేశ్వరునికి అనగా మహాకామేశ్వరునకు శక్తిరూపిణియైనది శ్రీదేవి అని భావము.

ఈ మంత్రముచే దేనిని ఉపాసించే వారికి జ్ఞానసిద్ధి లభిస్తుంది. పవిత్రమైన కోరికలు జనిస్తాయి. జీవిత పరమార్థాన్ని సాధిస్తారు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.



Post a Comment

0 Comments