Ad Code

లక్ష్మీదేవికి అష్టరూపాలు ఎందుకు?

లక్ష్మీదేవికి అష్టరూపాలు ఎందుకు?

ఒక్కో రూపం విశిష్టత ఏంటి తెలుసుకుందాం.
అమ్మ అనే శబ్దానికి ఫలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలం?
అమ్మ మోసే బాధ్యతలు ఏమిటని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వచించగలం?
అమ్మంటే అమ్మేై బిడ్డ అవసరాన్ని బట్టి అమె వివిధ రీతులుగా స్పందిస్తుంది.
బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది. ఆదిశక్తి అయినా, అమ్మవారు కూడా ఇంతే. ఆమెను భక్తులు ఒకటి కాదు, రెండు కాదు. వేనవేల రూపాలలో పూజించుకుంటారు. వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుచుకుంటారు.
హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతున్నారు. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
అష్టఐశ్వర్యాలను సిద్దించే అష్టలక్ష్ముల రూపాలు:
ఆదిలక్ష్మి:
'మహాలక్ష్మి' అనికూడా అంటారు.
నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
పాలకలడలిపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మే.
ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.
ధాన్యలక్ష్మి:
హిందు సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు. ఒక జీవన విధానం కూడా!
అందుకే మన సంస్కృతి యావత్తు వ్యవసాయాన్ని అల్లుకుని ఉండటాన్ని గమనించవచ్చు.
ఆ వ్యవసాయం దాంతో పాటు మనజీవితాలూ కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లే. ధాన్య లక్ష్మి. అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యం మొత్తం ఆకుపచ్చరంగులో ఉంటుంది. ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. శారీరిక దారుఢ్యాన్ని ప్రసాధించే తల్లి.
ధైర్యలక్ష్మి:
సంపదలు లేకపోయిన, మూడు పూటలా నిండైన తిండి లేకపోయినా, పరువుప్రతిష్ట మంటగలసినా, కానీ ధైర్యం లేని మనిషి అడుగు ముందుకు వేయలేడు. రేపటి గురించి ఆశతో జీవించలేడు.
అందుకు ఈ ధైర్యలక్ష్మీని తమతో ఉండమని భక్తులు మనసారా కోరుకుంటారు.
ఈమెనే 'వీరలక్ష్మి' అని కూడా అంటారు. పేరుకు తగ్గట్లే ఎనిమిది చేతులు కలిగినది.
ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) తో ద‌ర్శ‌న‌మిస్తుంది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
ధైర్య సాహసాలు, మనోధైర్యాన్ని ప్రసాధించే తల్లి.
గజలక్ష్మి:
రాజ్య ప్రదాత. సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆ సంపదకు తగిన హుందాతనాన్నీ ప్రతిష్టనూ, అందించే తల్లి. గౌరవం కలిగించని సంపద ఎంత ఉంటేనేం?
గజలక్ష్మీ సాక్షాస్తూ ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీర సాగరమథనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకిస్తుంటాయి.
ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది.
రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి. సకల శుభాలకు అధిష్టాన దేవత.
సంతానలక్ష్మి:
జీవితంలో ఎన్ని సిరులన్నా, సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది.
తరం తమతో నిలిచిపోతుందన్న బాధ పీడిస్తుంది. ఇలాంటి వారి ఒడిని నింపే సంతాన లక్ష్మీ ఆరు చేతులతో దర్శనిమిస్తుంది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది.
ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.
విజయలక్ష్మి:
విజయమంటే కేవలం యుద్దరంగంలోనే కాదు. యుద్దానికి ప్రతిబింబమైన జీవితపోరాటంలోనూ అవసరమే! చేపట్టిన ప్రతి కార్యంలోనూ, ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటుంటాము. వారి అభిష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది. సకల కార్యసిధ్దికి సర్వత్రా విజయసిద్దికి అధిష్టాన దేవత.
విద్యాలక్ష్మి:
జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అటు ఆధ్యాత్మికంగాను, ఇటు లౌకికమైన జ్జానాన్ని ఒసగే తల్లి ఈ విధ్యాలక్ష్మీ. ఒకరకంగా సరస్వతీ దేవికి ప్రతిరూపం అనుకోవచ్చు. ఆమె వలే శ్వేతాంబరాలను ధరించి,
పద్మపు సింహాసనంలో కనిపిస్తుంటారు. శారదా దేవి. చదువులతల్లి. చేతి యందు వీణ వుంటుంది.
విద్యా వివేకాలకు, మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లి.
ధనలక్ష్మి:
భౌతికరమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే, ఆ సంపదని ఒసగి దారిద్య్రాన్ని దూరం చేసేదే ధనలక్ష్మీ. అందుకే ఆమె చేతిలో దానానికి చిహ్నంగా బంగారు నాణేలు స‌మృద్ధికి సూచనగా సూచించే కలశం దర్శనమిస్తుంటుంది. ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది.
శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి.
అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.
అమ్మ లక్ష్మి తల్లి అందరిని చల్లగా చూడమ్మా.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.

Post a Comment

0 Comments