Ad Code

పేదల్లేని గ్రామం - No One Poor In This Village

పేదల్లేని గ్రామం


అదొక చిన్న పల్లెటూరు. దాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వారిలో విదేశీయులూ ఉంటారు. ఆఖరికి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కూడా ఓసారి చూసి వెళ్లారు. అంతగా ఏముందా ఊళ్లో అంటే నేర్చుకోవడానికి చాలానే ఉంది. అభివృద్ధికీ స్వావలంబనకీ నిఖార్సైన ఉదాహరణ ఆ పల్లె. ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ పంచాయతీకి ప్రెసిడెంటుగా చేసిన షణ్ముగం. ఆయన ఆధ్వర్యంలో ఒకటీ రెండూ కాదు, పదుల సంఖ్యలో ప్రథమ స్థానాలు అందుకున్న ఆ ఆదర్శ పంచాయతీ కథా కమామిషూ అభినందనీయం ఆసక్తికరం.

ఒడంతురై నీలగిరుల సానువుల్లో కోయింబత్తూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. చుట్టూ పచ్చని అరటి తోటలూ మబ్బులతో దోబూచులాడే కొబ్బరి చెట్లూ పసుపు ఆరబోసినట్లుండే ఆవ తోటలు.

ఒడంతురై గ్రామ పంచాయతీ కింద ఉన్న ఓ డజను చిన్న చిన్న పల్లెల్లో అంతా కలిసి  పదివేల జనాభా ఉంటుంది. అందులో కొందరే రైతులు. ఎక్కువ మంది చుట్టుపక్కల తోటల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు గిరిజనులు.

పాతికేళ్ల క్రితం ఆ పంచాయతీ పేదరికానికి ప్రతినిధిలా ఉండేది. ఇళ్లంటే చిన్న చిన్న గుడిసెలు. పొద్దున్నే లేచి పిల్లలూ పెద్దలూ తలా ఓ బిందె పట్టుకుని రెండు మూడు గంటలు నడిచి వెళ్లి నది నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. ఆ తర్వాత పెద్దలు కూలికి వెళ్తే పిల్లలు వీధులమ్మట తిరుగుతూ ఉండేవారు.

అలాంటిది పదేళ్లలో ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయి. గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు. వాకిట్లో మంచినీళ్ల పంపులు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు. పిల్లలకోసం చక్కటి బడులు. ఇప్పుడది ఎందరికో పాఠాలు చెబుతున్న ‘మోడల్‌ విలేజ్‌’. ఆ మార్పుకి కారణం రామస్వామి షణ్ముగం.

పదవి చేపట్టి దాదాపు పాతికేళ్ల క్రితం సంగతిది. రైతుగా ఒకరి మీద ఆధారపడకుండా హాయిగా సాగిపోయేది నలభయ్యేళ్ల షణ్ముగం జీవితం. ఊరి పరిస్థితులే అతడికి విసుగు తెప్పించేవి. తాగునీటి వసతి లేదు, రోడ్లు లేవు, పిల్లలకు బడులు లేవు, కరెంటు లేదు. ప్రభుత్వాలేమో ఏమేమో చేసేస్తున్నామని వార్తల్లో చెబుతుంటాయి. తన ఊరేమో ఎన్నేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. గ్రామసభ జరిగినప్పుడల్లా ప్రెసిడెంటుని నిలదీసేవారు. కానీ అటునుంచి సరైన సమాధానం వచ్చేది కాదు. విసిగిపోయిన షణ్ముగం 1996లో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రెసిడెంటు అయ్యారు. ఊరి ప్రజలకు స్థానిక పాలన ఎలా ఉండాలో చేసి మరీ చూపించారు. ఊరివాళ్లకు ఆయన చెప్పిందే వేదం. రెండు దశాబ్దాలపాటు ఆయన ప్రతిపాదించిన ఏ పథకానికీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవలేదు. మొదటి పదేళ్లూ ఆయనా, ఆ తర్వాత పదేళ్లూ ఆయన భార్య లింగమ్మాళ్‌(పంచాయతీని మహిళలకు కేటాయించడంతో) పంచాయతీ ప్రెసిడెంట్లుగా పనిచేసి ఊరి అభివృద్ధిని ఓ కొలిక్కి తెచ్చారు. ఈ దంపతుల కృషి వల్ల గ్రామ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. దానికి తగ్గట్టుగా ప్రజల జీవన ప్రమాణాలూ పెరిగాయి. అవినీతిరహితంగా సాగిన వారి పాలనే అందుకు కారణం అలా డబ్బొచ్చింది
ఎన్నికల్లో గెలిచి బల్లకు ఇటువైపు కూర్చున్నాక అసలు పరిస్థితి అర్థం అయింది. అంటారు షణ్ముగం తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ. ఊళ్లో ఎటు చూసినా సమస్యలే. పంచాయతీ ఆదాయమేమో కేవలం రూ.20వేలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు. డబ్బుంటే ఏ పని అయినా చేయొచ్చని ముందుగా ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించారు. గ్రామసభ పెట్టి పరిస్థితి ప్రజలకు వివరించారు. నూరుశాతం పన్నులు కడితే దానికి మూడు రెట్లు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తుందనీ ఆ డబ్బు ఉంటే ఎన్ని పనులో చేసుకోవచ్చనీ చెప్పారు. వారూ సహకరించారు. దాంతో ఆదాయం రూ.1.75 లక్షలకు పెరిగింది. ప్రభుత్వం నుంచి రూ.5.25 లక్షలు వచ్చాయి. అలా ఆ తర్వాత ఏడాది రూ.3.5 లక్షలు వసూలు చేస్తే ప్రభుత్వం పదిన్నర లక్షలిచ్చింది. చేతికి డబ్బు అందడంతో షణ్ముగం అభివృద్ధి ప్రణాళికల మీద దృష్టిపెట్టారు. పన్నుల వసూళ్లలో కఠినంగా వ్యవహరించడం పట్ల ప్రజలెవరూ అభ్యంతరం చెప్పలేదు. అందుకు తగినట్లుగా పంచాయతీ అందిస్తున్న సేవల్ని వారు గుర్తించారు. ఎవరు ఏ ఫిర్యాదుతో వచ్చినా రెండురోజుల్లో పరిష్కారమయ్యేలా చూసేవారు షణ్ముగం.

ఇంటికి నీరు నిజానికి ఆ రోజుల్లో ఊరి జనాభా రెండు వేలు మాత్రమే. అంతమందికీ ఒకే ఒక్క బోరుబావి ఉండేది. అందుకే చాలామంది దూరంగా ఉన్న నదినుంచో, తోటల్లోని బావుల నుంచో నీరు తెచ్చుకునేవారు. అవి శుభ్రమైనవి కాకపోవటంతో తరచూ అనారోగ్యాలకు గురయ్యేవారు. మరికొన్ని బోరుబావులు వేయించినా వేసవిలో అవి ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకని భవానీ నది నుంచి పన్నెండు పల్లెలకూ పైపుల ద్వారా నీటి సరఫరాకి రూ.30లక్షల ప్రతిపాదనతో ప్రాజెక్టు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అంత డబ్బు ఒక్క పంచాయతీకే ఇవ్వడం కుదరదన్నారు అధికారులు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు సహకారంతో గ్రామీణ నీటి సరఫరాకోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దానికింద అయితే పది శాతం ఖర్చు పంచాయతీ పెట్టుకోవాలి. కలెక్టర్‌ ఆ విషయాన్ని షణ్ముగం దృష్టికి తెచ్చారు. మరోసారి ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందిస్తే ఈసారి ఖర్చు 48 లక్షలు తేలింది. దాంతో షణ్ముగం పరిస్థితిని ప్రజలకు వివరించారు. పదోవంతు అంటే దాదాపు ఐదు లక్షలు ఊరి తరఫున కట్టడానికి ప్రజలు అంగీకరించారు. డబ్బున్నవారు ఎక్కువిచ్చారు. లేనివాళ్లు తమ స్తోమత మేరకు వందా ఐదొందలూ ఇచ్చారు. ఆ పథకం అమలుపై మంగళూరులో జరిగిన దక్షిణ ప్రాంత సదస్సుకి- ప్రజల నుంచి అంత పెద్ద మొత్తం కడతామన్న హామీతో హాజరైన పంచాయతీ ప్రెసిడెంటు షణ్ముగం ఒక్కరే. దాంతో తొలి ప్రాజెక్టు వారికే మంజూరయింది. ఏడాదికల్లా 13కి.మీ.ల పైప్‌లైన్‌, ఫిల్టర్‌ పాయింట్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు సిద్ధమై అన్ని పల్లెలకీ నీళ్లు వచ్చాయి. ఎంత పెద్ద పని తప్పిందో అంటూ ఆనందంతో పొంగిపోయారు గృహిణులు. పిల్లల్ని బడికి పంపించడం మొదలెట్టారు.

అంతలోనే ఊరివాళ్లందరికీ నీళ్లిచ్చామన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు ప్రెసిడెంటుకి. మోటార్లతో పంపింగ్‌ వల్ల కరెంటు బిల్లు భారంతో పంచాయతీ నడ్డి విరిగినంత పనైంది. బడ్జెట్‌లో సగానికి పైగా ఆ బిల్లుకే సరిపోతే ఇక మిగతా పనులేం చేయగలం అనుకున్న షణ్ముగం ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట మొదలెట్టారు. బయోమాస్‌ గ్యాసిఫయర్‌ విధానాన్ని ప్రయత్నిద్దామనుకున్నారు. ఈ పద్ధతిలో ఏవైనా జీవవ్యర్థాలను ఉపయోగించి గ్యాస్‌ని తయారుచేయవచ్చు. దాని గురించి బరోడా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. రాగానే తొమ్మిది కిలోవాట్ల గ్యాసిఫయర్‌ని ఏర్పాటుచేశారు. కలప మిల్లుల్లో వ్యర్థంగా పడివుండే కర్రముక్కల్ని కిలో 60పైసల చొప్పున కొని అందులో వాడేవారు. దాంతో కరెంటు ఖర్చు సగానికి తగ్గి, నాలుగేళ్లు బండి సాఫీగా సాగింది. ఇంతలో కర్రముక్కల ధర కిలో రూ.3.50కి పెరిగింది. మరో పక్క కరెంటేమో యూనిట్‌కి రూ.1.75 మాత్రమే. దాంతో గ్యాసిఫయర్‌ని మూసేసి మళ్లీ కరెంటే వాడారు.
అయితే పునరుత్పాదక ఇంధన వనరుల అన్వేషణ మాత్రం ఆపలేదు షణ్ముగం. ఎక్కడ సదస్సు జరిగినా హాజరవుతూ సోలార్‌ వీధి దీపాల గురించి తెలుసుకున్నారు. రెండు పల్లెల్లో వీధి దీపాలకోసం 2కెవి సోలార్‌ సిస్టమ్స్‌ని ఏర్పాటుచేశారు. దాంతో కరెంటు బిల్లు ఐదు వేలు తగ్గింది. ఈ రెండు ప్రయోగాల అనుభవాన్నీ క్రోడీకరించి రెండు పాఠాలు నేర్చుకున్నానంటారు షణ్ముగం. అవేంటంటే- విద్యుత్‌ బోర్డు ద్వారా సరఫరా అయ్యే కరెంటుని ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంచుకోవాలి. రెండోది పునరుత్పాదక విద్యుత్‌ వనరులతో డబ్బు పొదుపు చేయడమే కాదు, డబ్బు సంపాదించవచ్చు కూడా అని. దాంతో ఈసారి పెద్ద లక్ష్యాన్నే పెట్టుకున్నారాయన. ఏకంగా విండ్‌ మిల్‌కి ప్రణాళిక సిద్ధంచేసుకున్నారు.

సరిగ్గా ఆ సమయానికి ప్రెసిడెంట్‌గా ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే ఆ సీటును మహిళలకు కేటాయించడంతో తన భార్యనే ప్రెసిడెంట్‌గా నిలబెట్టి గెలిపించి, ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు.

గాలిమరతో విద్యుత్తు ఒక గ్రామపాలనా సంస్థ విండ్‌మిల్‌(గాలిమర)ని ఏర్పాటుచేయడం (2006లో) దేశంలోనే ప్రథమం. ఒడంతురైకి 140కి.మీ. దూరంలో మైవాడి అనే ప్రాంతంలో చాలా గాలిమరలున్నాయి. విండ్‌ఫార్మ్‌ అంటారా ప్రాంతాన్ని. పలు వ్యాపార సంస్థలు అక్కడ గాలిమరలను ఏర్పాటు చేసుకున్నాయి. షణ్ముగం కూడా తమ గాలిమరను తీసుకెళ్లి అక్కడ పెట్టించారు. అలా చేయడం వల్ల ప్రత్యేకంగా దాని నిర్వహణ ఖర్చు తప్పింది. ఒక్కో గాలిమర నుంచి తయారైన విద్యుత్తు రాష్ట్ర విద్యుత్తు శాఖ గ్రిడ్‌కి చేరుతుంది. దాని ధర సంబంధిత యజమాని ఖాతాలో జమవుతుంది. 350 కిలోవాట్ల సామర్థ్యం కల ఈ విద్యుత్తు ప్లాంట్‌ ఏడాదికి ఆరులక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అందులో రెండు లక్షల యూనిట్లను రాష్ట్ర విద్యుత్‌ బోర్డుకు అమ్ముతారు. దానికి పెట్టుబడి కోటిన్నర పైనే అయింది. నలభై లక్షలు పంచాయతీ దాచుకున్న సొమ్ము. మిగతాది బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. 2013లో ఆ లోను కూడా తీరిపోయింది. ఇప్పుడు విద్యుత్తు అమ్మడం వల్ల పంచాయతీకి ఏటా దాదాపు 20 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. ఆ డబ్బంతా ఏం చేస్తున్నారూ అంటే, అభివృద్ధికి చిరునామా

ఆదాయం పెరుగుతున్నకొద్దీ ఒక్కో సమస్యా పరిష్కరించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు షణ్ముగం. పంచాయతీ పరిధిలోని అన్ని పల్లెలకూ పక్కా రోడ్లు వేయించారు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు పెట్టించారు. వీధులన్నీ ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి. అన్ని ఊళ్లకీ పాఠశాలలు అందుబాటులో ఉండేలా చూశారు. పై చదువులకు పట్టణానికి వెళ్లే పిల్లల కోసం బస్సు సౌకర్యం కల్పించారు. ఒకప్పుడు ఆ పంచాయతీలో నలభై మంది పిల్లలు బడికెళ్తే గొప్ప. ఇప్పుడు 400 మంది వెళ్తున్నారు. గ్రామ పరిసరాల్లో అందుబాటులో ఉండే వనరులను ఉపయోగించి స్వావలంబన సాధించడానికి యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించారు. జామ్‌, లెదర్‌ పాలిషింగ్‌ పౌడర్‌ తయారీ లాంటి చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు యువకులు. అంతే కాదు, ఆ పంచాయతీ పరిధిలో ఇప్పుడు ఒక్క గుడిసె కూడా లేదు. అన్నీ పక్కా ఇళ్లే ఊరంతా సొంతిళ్లే.

అక్కడి ప్రజల్లో దాదాపు 90 శాతం తోటల్లో కూలిపనులు చేసేవాళ్లే. తిండి గడవడమే కష్టమైన వారికి స్థలమూ సొంతిల్లూ కలలో మాట. చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. వారికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అప్పటి ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలన పథకం ప్రవేశపెట్టారు. షణ్ముగం వెంటనే దరఖాస్తు చేసి 45 ఇళ్లు మంజూరుచేయించుకుని కట్టించారు. ఆ తర్వాత రెండేళ్లకు మరో 25, మూడేళ్ల తర్వాత 135 అలా గిరిజనుల కోసమే మొత్తం 250 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వినోబాజీ నగర్‌ అనే మరో పల్లెలో 101 ఇళ్లు కట్టారు. సౌరశక్తిని ఉపయోగించుకునేలా కట్టిన గ్రీన్‌ హౌస్‌లు అవన్నీ. ఒక్క పంచాయతీ పరిధిలో వందకు పైగా పర్యావరణ హిత నివాసాలు కట్టడం ఇక్కడ మాత్రమే జరిగింది. ప్రభుత్వ నియమం ప్రకారం సొంత స్థలం ఉంటేనే ఇళ్ల నిర్మాణానికి నిధులిస్తారు. అందుకని వారందరికీ ముందుగా ప్రభుత్వ భూమిని పట్టాలుగా రాసిచ్చారు లింగమ్మాళ్‌. ఆ తర్వాత ప్రభుత్వ పథకం సాయంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. అలా సోలార్‌ పవర్డ్‌ గ్రీన్‌ హౌస్‌ పథకం కింద పేదలకు దాదాపు వెయ్యి ఇళ్లు కట్టించారు. నీటి పైపులైనుతో పాటు ప్రతి ఇంటికీ సౌరఫలకాన్నీ ఏర్పాటుచేశారు. ఇప్పుడు మొత్తం పంచాయతీ పరిధిలో ఇల్లులేని పేద ఒక్కరు కూడా లేరు. అందరివీ సొంతిళ్లే. అందులో సగానికి పైగా సర్కారు కట్టించినవే. రాష్ట్రంలో అత్యధికంగా గ్రీన్‌ హౌస్‌లు కట్టించిన పంచాయతీ- ఒడంతురై.

అప్పు ఇస్తారు ఒడంతురై పంచాయతీ పరిధిలో నివసించేవారికి ఎలాంటి అవసరమొచ్చినా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లరు. వైద్యం, కాన్పులు, దుకాణాల్లో పెట్టుబడి లాంటి పెద్ద అవసరాలే కాదు, ఆఖరికి పిల్లలకు చెవులు కుట్టించడమూ, పుస్తకాలు కొనడమూ కూడా పల్లెల్లో పెద్ద విశేషాలే. అందుకని ఆ అవసరాలన్నిటికీ గ్రామ పంచాయతీలోని సూక్ష్మరుణ నిధి నుంచి అప్పులు ఇస్తారు. గ్రామస్థులు తమ అవసరాన్ని తెలుపుతూ వినతిపత్రం రాసిస్తే చాలు, సాయంత్రానికి డబ్బు చేతికందుతుంది. వారికి డబ్బు అందినప్పుడు నామమాత్రపు వడ్డీతో ఆ అప్పుని చెల్లించేస్తారు. ఒకేసారి కట్టలేనివారు వాయిదాల్లో కడతారు. పెద్ద వ్యాపారాలు చేయాలనుకునేవాళ్లకి బ్యాంకు లోన్లు కూడా గ్రామపంచాయతీ అండగా ఉండి ఇప్పిస్తుంది. పాతికేళ్ల క్రితం 1500 ఉన్న జనాభా ఇప్పుడు పదివేలు అవడానికి కారణం జరుగుతున్న అభివృద్ధిని చూసి వలసవెళ్లిన వాళ్లంతా తిరిగిరావడమే.

కొంచెం బిజినెస్‌ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పల్లెల పంచాయతీ ప్రెసిడెంట్లనీ సమావేశపరిచింది. ‘ఒడంతురై పంచాయతీకి వెళ్లి చూసి నేర్చుకోండి’ అని పంపించింది. అది మొదలు గ్రామీణాభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్తు, నీటి పారుదల ఒకటని కాదు ఎన్నో శాఖల అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. కేరళ, కర్ణాటక, సిక్కిం తదితర రాష్ట్రాల నుంచి, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌ లాంటి దేశాల నుంచి, ఆఖరికి ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో సహా ఎందరో వచ్చి చూసి వెళ్లారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలుసుకున్నారు.

'అయితే ఇలా వచ్చేవారందరికీ ఊరిని చూపించడానికీ వివరించి చెప్పడానికీ మాకేం అభ్యంతరం లేదు. కానీ అంత సమయం వారికోసం వెచ్చిస్తున్నప్పుడు మాకూ ఏదైనా లాభం ఉండాలిగా. అందుకే అలా వచ్చేవాళ్లు మాకు వెయ్యి రూపాయలు చెల్లించాలని నియమం పెట్టాం. అలా వచ్చిన డబ్బుని సూక్ష్మరుణ నిధికి జమచేస్తున్నాం' అని చెబుతారు షణ్ముగం. ‘ఆయనలో మంచి వ్యాపారవేత్త లక్షణాలు ఉన్నాయి. చేసే ప్రతి పనిలో ఎంతో కొంత మిగిలేలా చూసేవారు. అదే మరో కొత్త పథకానికి పెట్టుబడి అయ్యేది’ అంటారు గ్రామస్థులు. ‘ఆయన వేసిన దారిలోనే ముందుకు వెళ్తున్నాం’ అంటారు ప్రస్తుత ప్రెసిడెంట్‌ తంగవేల్‌.   ఇప్పటికీ ఎక్కడెక్కడి నుంచో షణ్ముగంకి ఆహ్వానాలు అందుతుంటాయి. అంత మార్పు ఎలా తేగలిగారో వచ్చి మాకూ చెప్పమంటారు. ‘స్థానిక సంస్థలు ప్రభుత్వ పథకాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం. నీటి సరఫరాకీ, ఇళ్లు కట్టించడానికీ ఆఖరికి కోటిన్నర ఖర్చుతో విండ్‌మిల్‌ పెట్టడానికీ అన్నిటికీ మేము ప్రభుత్వ పథకాలనే ఆధారం చేసుకున్నాం. గాలీ ఎండా కావలసినంత ఉచితంగా దొరుకుతాయి. వాటిని సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాలి. అలాగే ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వగలగాలి’ అని చెబుతారాయన.

ఒడంతురై వెళ్లినవాళ్లు ఆ ఇళ్లూ నీళ్లూ కరెంటూ అన్నీ చూసి ఎంత ముచ్చట పడతారో మరో విషయం చూసి అంతకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోతారు. పంచాయతీ ఆదాయమూ, చేపట్టిన పథకాలూ, ఖర్చుల గురించి ఏకంగా పంచాయతీ కార్యాలయం గోడల మీదే రాసి ఉంటుంది. అది కోట్ల రూపాయల గృహనిర్మాణ పథకం కావచ్చు, జనన మరణ ధ్రువపత్రానికి చెల్లించే వంద రూపాయలు కావచ్చు. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన ప్రతి సందర్భమూ ఆ గోడల మీదికి ఎక్కాల్సిందే. ఎక్కడా పైసా తేడా రాదు. నాయకుడికి పారదర్శకత అన్నిటికన్నా ముఖ్యమని షణ్ముగం చెప్పకనే చెప్పారు! శిరంగు నాయుడు బజరంగ్ దళ్.





Post a Comment

0 Comments