Ad Code

కృష్ణాష్టమి పర్వదినం - Krishna Janmashtami

కృష్ణాష్టమి పర్వదినం


ఏటా శ్రావణ బహుళ అష్టమి తిథి కృష్ణాష్టమి పర్వదినం. ఇది మనకు ముఖ్య మైన పండుగల్లో ఒకటి. శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మదినోత్సవ పర్వం కావడం వల్ల జన్మాష్టమిగా కూడా ప్రసిద్ధి. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు. కృష్ణ జయంతి నాడు ఉపవాసం ఉండి స్వామిని పూజిస్తే సకల పాపాలు హరించుకపోతాయని పురాణాలు పేర్కొన్నాయి.

కృష్ణుడిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, జయం కలుగుతాయని స్కంద పురాణోక్తి. కృష్ణాష్టమి నాడు చంద్రుడికి అర్ఘ్యమివ్వాలని, బంగారంతో కానీ, వెండితో కానీ ద్వాదశాంగుల విస్తారమైన చంద్రబింబం చేసి వెండి, బంగారుపాత్రలలో దానిని ఉంచి, పూజించి అర్ఘ్యమివ్వాలని, అలా చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణంలో ఉంది.కృష్ణావతారం దశావతారాల్లో ఎనిమిదోవది. కృష్ణ చరితం హరివంశ భాగవత విష్ణు పురాణాల్లో విపులంగా ఉంది. ఆబాల గోపాలానికి కృష్ణుని లీలలు, కొంటె చేష్టలు తెలిసినవే. కృష్ణుడు లోకోత్తర సుందరమూర్తి. మహాబల పరాక్రమశాలి.

రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. ఆయన ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం భగవద్గీత. కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రాన రాత్రి సమయాన జన్మించాడు కనుక అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తారు. జనన సూచకంగా ఉయ్యాలలు కట్టి ఆడిస్తారు. బాల్యంలో కృష్ణుడు చేసిన బాల్య చేష్టలకు నిదర్శనంగా వీధులలో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇంటి ముందర చిన్ని కృష్ణపాదముద్రలను వేసి ఆయనను ప్రార్థిస్తారు. పూజిస్తారు. ఇలా అనేక రకాలుగా స్వామిని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయి. కృష్ణం వందే జగద్గురుం.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments