Ad Code

గణపతి - ప్రసన్న వదనం - Gajanana Prasanna Vadanam

గణపతి - ప్రసన్న వదనం






ఓం గం గణపతయే నమః


శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను.


(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.


ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.


ఆనందం, జ్ఞానం, ఐశ్వర్యం, బలం- ఈ నాలుగు తత్వాల ఈశ్వరత్వమే గణపతి స్వరూపం. ఆ స్వామి ఆరాధన వల్ల ఆ నాలుగూ లభిస్తాయని పురాణాలు, ఆగమాలు వివరిస్తున్నాయి. పృథ్వీవాసులందరికీ భూ తత్వమే ప్రధానం. యోగ, ఉపాసన తత్వాల పరంగా భూ రూపమైన పరమేశ్వర తత్వమే గణేశుడు. మిగిలిన నాలుగింటినీ కలబోసుకున్న అవనీ తత్వమూర్తిగా దైవాన్ని భావించడమే మట్టి గణపతి రూపంలోని ప్రత్యేకత.

నాలుగు దిక్కుల వ్యాపకత్వమే ‘చతుర్భుజం విష్ణుం’. ఏ వర్ణమూ లేని ఆకాశ తత్వమే ‘శుక్లాంబరం ధరం’. శుద్ధ జ్ఞానమే ‘శశి వర్ణం’. ఆనందానుగ్రహ భావమే ‘ప్రసన్న వదనం’.
ప్రకృతి పురుషుల ఏకతత్వమే పార్వతీ శంకరుల తనయుడిగా వ్యక్తమైంది. వేద, పురాణ, ఆగమ, కావ్య, సంగీత, నాట్య, శిల్ప, చిత్రకళ రూపాల్లో గణేశుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
తెలివితేటలకు, నాయకత్వ లక్షణాలకు గణేశుడు అధి దైవం. ఉపాసన శాస్త్రాల్లో బాల గణపతి నుంచి మహా గణపతి వరకు అనేక రూపాల్ని వర్ణించారు. దేవ, దానవ, మానవ, పశు, పక్షి, వృక్ష- ఇత్యాది భిన్నజీవుల గణాల్ని పరిపాలించే ఏక ఈశ్వర తత్వమే ‘గణపతి’ అని రుషుల తాత్పర్యం.


గణపతి తత్వాన్ని ఆధారం చేసుకొని, అత్యంత విస్తారమైన సంప్రదాయం ఉంది. శైవ వైష్ణవ శాక్తేయాల్లాగే ‘గాణపత్యం’ ఒక విశిష్ట విశాల శాస్త్రం. ఉన్న ఒకే ఈశ్వరుణ్ని భిన్న నామ రూపాలతో ఆశ్రయించి కొలుచుకొనే సమున్నత సంస్కృతిలో- ఆ పరమేశ్వరుడి గణేశ రూప లీలావైభవాలు బహు విధాలు. లోతైన తాత్వికత, యోగ రహస్యాలు వినాయకుడి విశేషాల్లో దాగి ఉన్నాయి.


వర్షాలకు భూమి తడిసి, పూర్ణంగా అంకురించి ఎదిగే దశ- భాద్రపదం. అది సత్ఫల కారిణి కావాలన్న ఒక ఆకాంక్ష ఈ మాసంనాటి గణేశ పూజలో అంతర్లీనమైంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి, భాద్రపదంలో వరద వినాయక చతుర్థి. గాణపత్యం సంప్రదాయంలో శుక్ల చవితులకు ‘వరద చవితి’ అని పేరు. ఏడాదిలో పన్నెండు చవితి తిథులు హేరంబ పూజకు ప్రాధాన్యాలు. వాటిలో ముఖ్యం ఈ శుద్ధ చవితి. అభీష్ట సిద్ధులే వరాలు. వాటిని ప్రసాదించే స్వామి ‘వరదుడు’. వరద మూర్తయే నమః అని ‘అధర్వ శీర్షోపనిషత్తు’ చెబుతుంది. సిద్ధే వరం కాబట్టి, ఆయన సిద్ధి గణపతి.


ఒక కార్యానికి ఐశ్వర్యం, దాని ఫలమైన ‘సిద్ధి’ మాత్రమే. సిద్ధి కోసమే ఏ పనైనా! కార్యానికి ఆటంకాల్ని తొలగించే సిద్ధి- గణేశ శక్తి. ఆ సిద్ధియే అసలు లక్ష్మి (సంపద). అన్నింటి కంటే గొప్ప లక్ష్మి అయిన ‘సిద్ధి’ స్వామి శక్తి కావడంతో- ఆ శక్తిని సిద్ధ లక్ష్మీదేవిగా, ఆయనను లక్ష్మీ గణపతిగా ఉపాసిస్తారు.


భారతదేశంలో ఆసేతు శీతాచలమూ విధిగా పూజించే ఈ గణనాయకుడు- దేశ ‘జనగణ’ముల ‘మన’సులకు ‘అధి నాయకుడు’. ‘భారత భాగ్య విధాత’గా అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. పంజాబ్‌, సింధు, గుజరాత్‌, మరాఠా మొదలుకొని- వింధ్య, హిమాచల, యమున, గంగాది ప్రాంతవాసులందరూ ఈ చతుర్థీ ఉత్సవాల్ని సంబరంగా జరుపుకొంటారు.


వేదాల ప్రకారం, యజ్ఞ తత్వమే గణపతి. దేవత, మంత్ర, ద్రవ్య, క్రియ- అనే నాలుగింటితో కూడినదే యజ్ఞం. ఈ నాలుగు గణాల నియామకుడైన యజ్ఞ రూపుడు ‘గణపతి’. యజ్ఞంలో ఉపయోగించే వేదాలు నాలుగు. అగ్నిగుండం చతురస్రం- చతుర్భుజ గణపతి స్వరూపం. ఆయన నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన ‘చవితి’ పూజలవాడు.
యోగపరంగా మొదటి చక్రమైన మూలాధారంలో గల ఈశ్వరశక్తి, వేదపరంగా శబ్దాలన్నింటికీ మొదటిదైన ప్రణవ శక్తి- గణపతి. అందుకే ఆయన తొలి దైవం.
భారతీయుల సమైక్యానికి గణపతి ఉత్సవాలను ప్రధాన భూమికగా ఎంచుకున్న తిలక్‌ వంటి మహాత్ముల భావన సాకారమై- భిన్న ‘గణా’లవారిని ‘ఏక’ భావనా సూత్రంతో సమన్వయపరచే గణపతి తత్వం దేశ హితాన్ని సిద్ధింపజేయాలి!



హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానం లో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు – వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)
వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు – ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము – ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రథము. హిందూ సంప్రదాయము తో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.


32 గణపతులు:
ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు).
ఇంకా అవాంతర భేదగణపతులు 11 – మొత్తం 32
శ్రీ గణపతి
వీర గణపతి
శక్తి గణపతి
భక్త గణపతి
బాల గణపతి
తరుణ గణపతి
ఉచ్చిష్ట గణపతి
ఉన్మత్త గణపతి
విద్యా గణపతి
దుర్గ గణపతి
విజయ గణపతి
వృత్త గణపతి
విఘ్న గణపతి
లక్ష్మీ గణపతి
నృత్య గణపతి
శక్తి గణపతి
మహా గణపతి
బీజ గణపతి
దుంఢి గణపతి
పింగళ గణపతి
హరిద్రా గణపతి
ప్రసన్న గణపతి
వాతాపి గణపతి
హేరంబ గణపతి
త్ర్యక్షర గణపతి
త్రిముఖ గణపతి
ఏకాక్షర గణపతి
వక్రతుండ గణపతి
వరసిద్ధి గణపతి
చింతామణి గణపతి
సంకష్టహర గణపతి
త్రైలోక్యమోహనగణపతి



బాధ్రపద శుద్ధ చతుర్ధి నాడు వచ్చే వినాయక చవితి

మాఘ కృష్ణ చతుర్ధి నాడు వచ్చే వినాయక



బాధ్రపద శుద్ధ చతుర్ధినాడు వచ్చే వినాయకచవితి దాధాపు దేశమంతటా పెద్దయెత్తున నిర్వహింపబడుతుంది. ఈ పండుగలో గమనించదగిన ముఖ్యాంశాలు


మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ ఇంటింటా పాలవెల్లి క్రింద మంటపంలో ప్రతిష్టించి అనేక రకాల పత్రితోను పూలతోను పూజ చేయడం

లడ్డూలు, పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్ధాల నివేదన


వీధివీధినా గణపతి ప్రతిష్ట, సామూహిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు


9రోజుల ఉత్సవాల తరువాత, 10వ రోజున ఉత్సవ విగ్రహాల నిమజ్జనం



వినయకుని తొండము “ఓం” కారానికి సంకేతమని చెబుతారు.
ఏనుగు తల – జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.
మనిషి శరీరము – మాయకూ, ప్రకృతికీ చిహ్నము
చేతిలో పరశువు – అజ్ఙానమును ఖండించడానికి సంకేతము
చేతిలో పాశము – విఘ్నాలు కట్టిడవసే సాధనము
విరిగిన దంతము – త్యాగానికి చిహ్నము
మాల – జ్ఙాన సముపార్జన
పెద్ద చెవులు – మ్రొక్కులు వినే కరుణామయుడు
పొట్టపై నాగ బంధము – శక్తికి, కుండలినికి సంకేతము
ఎలుక వాహనము – జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.

అష్ట వినాయక మందిరాలు
మహారాష్ట్రలో పూణె సమీపంలో (100 కిలోమీటర్ల పరిధిలో) ఉన్న ఎనిమిది ఆలయాలను అష్టవినాయక మందిరాలంటారు. ఒక్కొక్క ఆలయంలోను గణపతి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకొంటాడు.
1.మోరెగావ్, అష్టవినాయక మందిరం pune to morgaon 80 km
2.సిద్ధి వినాయక మందిరం, సిద్ధాటెక్ pune to Siddhatek 111 km
3.బల్లాలేశ్వర మందిరం, పాలి pune to Ballaleshwar Pali 119 km
4.వరద వినాయక మందిరం, మహాడ్ pune to mahad 130 km
5.చింతామణి మందిరం, తియూర్ pune to Theur 28 km
6.గిరిజాత్మజ మందిరం, లేయాంద్రి pune to Lenyadri 97 km
7.విఘ్నహర మందిరం, ఒజార్ pune to Ozar 223 km
8.మహాగణపతి మందిరం, రంజనగావ్ pune to Ranjangaon, 52 km



కాణిపాకం: చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు కలదు. చిత్తూరు నుండి ప్రతి ముప్పై నిముషాలకు ఒక బస్సు కలదు. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.



కాణిపాకంలో కొలువు తీరిన వినాయకునికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయని, స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.

 

సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.









Post a Comment

0 Comments