Ad Code

భగవతీ (చతురక్షరి) - Chaturakshari

భగవతీ (చతురక్షరి)

ఇది నాల్గు అక్షరాల మంత్రము. పూజాసమయంలో “భగవత్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

భగవతీ = భగయుతమైనది శ్రీదేవి.

“భగమాలినీ” మంత్ర నిర్వచన సందర్భమున భగ శబ్దము కొంతవరకును వ్యాఖ్యానింపబడింది.

భగమాలినీ శబ్దము భోగ శబ్దార్థాలైన ఐశ్వర్యాది శక్తులకును, అనంత సూర్య కుటుంబాలకును అమ్మతో కొంత భేదాన్ని సూచిస్తాయి. ఏలననగా - మాలికలు – మాలికలను ధరించిన వారి కంటే భిన్నంగా ఉండడం లోక ప్రసిద్ధము. అచ్చట ఆధార - ఆధేయ భావం ఉంది. మాలికలు అధేయములు. మాలాధారిణియైన అమ్మ ఆధారం అగును. ఈ భగవతీ మంత్రంలో అభేదం బోధింప బడుతుంది. ఎట్లనగా గుణవంతుడు అనగా గుణములు గలవాడు అని అర్థము. ఇచ్చట గుణవంతుని నుండి గుణాలను వేఱుచేసి దర్శింపలేము. దీనిని అనుసరించియే “గుణగుణినో: అభేదః" అనే న్యాయం వచ్చింది.

దీనిని అనుసరించి భగవతీ శబ్దాన్ని మనం విశ్లేషించినచో ఐశ్వర్యాది శక్తులుగానీ, అలాగే భగ శబ్ద వాచ్యాలైన అనంత సూర్యులును, అనంత సూర్య యుతములైన సూర్య కుటుంబాలూ, సమస్త సృష్టియును, తన రూపంగా గలది శ్రీదేవి అని తెలియు చున్నది.

కొందరు అనుష్టానపరులచే నిత్య తృప్తి - అనంత శక్తి - అనాద్యనంత జ్ఞాన శక్తి మొదలైనవి భగ శబ్దముచే బోధింపబడును. అవి గలది అగుటచే పరాశక్తి “భగవతి" అని వ్యాఖ్యానిస్తారు. సర్వ దేవతా శక్తులు గలది అగుటచే భగవతి అనియు మరికొందరు వివరిస్తారు.

దేవిని తమకు అన్యంగా ఉపాసించే వారిని “భగమాలినీ" శబ్దం బోధిస్తుంది. దేవిని ఆత్మ రూపంగా భావించి ఉపాసించే వారిని “భగవతీ" శబ్దం నిర్దేశిస్తుంది అని భేదాన్ని
పండితులు పేర్కొందురు.

ఈ మంత్రంతో దేవిని ఉపాసించే సాధకులు, ఐశ్వర్యాది సర్వ విభూతియుతులు అగుదురు. క్రమంగా దేవీ స్వరూపులై శాశ్వతానంద పదమును పొందగలరు. తాము ధరించుటయే గాక ఇతరులను అమ్మవలె తరింపజేసే శక్తియుతులును అయి ఉందురు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments