Ad Code

భానుమండలమధ్యస్థా (అష్టాక్షరి) - Ashtakshari

భానుమండలమధ్యస్థా (అష్టాక్షరి)



ఇది అష్టాక్షరములు గల్గిన మంత్రము. పూజాసమయంలో "భానుమండల మధ్యస్థాయై నమ:" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

భాను - మండల - మధ్యస్థా = సూర్య మండలము యొక్క మధ్య భాగము నందు ఉండేది శ్రీదేవి. మరో అర్థం భా - అను - మండల - మధ్యస్థా = వెలుగును అనుసరించి ఏర్పడిన మండలము యొక్క మధ్యన అనగా శ్రీచక్ర మధ్యవర్తియైన బిందు భాగము నందు ఉండేది పరాశక్తి.

సూర్య మండలము వలె కాంతులను విరజిమ్మే శ్రీచక్ర మధ్య భాగము నందు బిందు మండలము నందు వసించేది శ్రీదేవి అని సామాన్య భావము. చంద్రాగ్ని మండల సమ్మేళన రూపమైనది సూర్య మండలము. అదియే పరబ్రహ్మ స్వరూపము. అందు విరాజిల్లేది పరాశక్తి అనియు బోధిస్తారు. అందుకు శాస్త్ర ప్రమాణము:

"భానుమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీమ్"
"పాశాంకుశ ధనుర్భాణహస్తాం ధ్యాయేత్పురాధికః"

పాశము, అంకుశము, ధనువు, బాణములు హస్తములందు ధరించినదియు, త్రిపుర సుందరియును అయిన శ్రీదేవిని "భానుమండల మధ్యవర్తిని" గా సాధకుడు ధ్యానింప వలయును. సామాన్యంగా సాధకులకు కొందరికి ఇది అనుభవ సిద్ధంగానే ఉంటుంది. “ఉద్యంతే మస్తయన్త
మాదిత్యయభిధ్యాయన్" అని శ్రుతి.

నాభీ స్థానమునందు దశదళముల చక్రం ఉంటుంది. దీనిని మణిపూరకచక్రం అనియూ అందురు. ఇచ్చట భైరవీదేవిని ఉదయ సంధ్యా కాలములందు ధ్యానింప వలయును. మణిపూరక స్థానాన్నే సూర్య చంద్రాగ్నుల ఉత్పత్తి స్థానం అనియూ అరుణోపనిషత్తు బోధిస్తున్నది. భైరవీ రూపంగా భానుమండల మధ్య భాగము నందు ధ్యానింప బడుటచే "భానుమండల మధ్యస్థా" అని శ్రీదేవి కీర్తింపబడుచున్నది.

పరబ్రహ్మ స్థానము చంద్రాగ్నుల కలయికయైన భానుమండలము. అందుచే పరాశక్తిని ఈ మంత్రముతో ధ్యానించే వారికి త్వరలో అమ్మ సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. జీవన్ముక్తులై తరిస్తారు.



సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.






Post a Comment

0 Comments