వినాయకుడు విఘ్నాధిపతి ఎలా అయ్యాడు
ఏ కార్యాన్ని ప్రారంభించే ముందైనా వినాయకుడిని పూజిస్తాం. ఎలాంటి విఘ్నాలు కలుగకుండా చూడమని వేడుకుంటాం. వినాయకుడు విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాడు? గణపతికి ఆ వరాన్ని ఇచ్చింది వేదవ్యాసుడు. వ్యాసుడు పంచమవేదమైన మహాభారత రచయితగా మనకు తెలుసు. అతను భారతాన్ని ధారళంగా చెబుతుంటే దానిని లిఖించినది గణపతే. వేద వ్యాసుడు భారతాన్ని గ్రంథస్తం చేయాలన్న ఆలోచన వచ్చాక గణపతిని లేఖికునిగా ఉండమని కోరాడు. అప్పుడు వినాయకుడు మధ్యమధ్యలో విరామాలు తీసుకోకుండా చెబితేనే రాస్తానని చెప్పాడు.
అందుకు ఒప్పుకున్న వ్యాసుడు తాను చెప్పింది అర్థంచేసుకునే రాయాలని తిరిగి గణపతికి షరతు పెట్టాడు. అందుకు ఒప్పుకున్నాడు వినాయకుడు. వ్యాసుడు ఆగకుండా శ్లోకాల్ని చెబుతుంటే గణపతి రాస్తున్నాడు. మధ్యలో ఒకసారి కలం కాస్త విరిగిపోయింది. గ్రంథస్తానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని భావించిన వినాయకుడు తన దంతాన్ని విరిచి దాంతో రాయడం మొదలుపెట్టాడు. అలా మహాభారతం పూర్తయ్యింది. వ్యాసుడు గణపతి చిత్తశుద్ధిని మెచ్చుకుని ‘విఘ్నము కలుగకుండా వ్రాసినందుకు విఘ్నరాజుగా వెలుగొందుతావని’ గణపతిని దీవించెను.
0 Comments