నరసింహ క్షేత్రం - ధర్మపురి
ప్రసిద్ది గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం తెలంగాణాలో కరీంనగర్ పట్టణానికి కేంద్రానికి 75 కి మీ దూరం లో ఉంది.
పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వరాలయం, అనాది నుంచి శైవ,వైష్ణవ ప్రతీకగా నిలిచి ఉంది. ఇక్కడ స్వామి వారు యోగానంద నారసింహ స్వామిగా భక్తుల కోర్కెలు నేరవేరుస్తున్నాడు. యమలోకం లో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఏర్పర్చుకున్నట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.
ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజుని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితి. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గం లో నడిపించి నాలుగు పాదముల ధర్మం తో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురి అని పేరు వచ్చింది అని పురాణాలూ పేర్కొంటున్నాయి.
త్రిమూర్తులు నెలకొన్న ధర్మపురి:
ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు ఏవైనా పూర్వం సంస్కృతీ, సంప్రదాయాల నెలవులే. శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ఆలయం వున్నత స్ధితిలో వుండేది. బహుమనీ సుల్తానుల దండయాత్రలలో శిధిలమైన ఈ ఆలయాలు 17 వ శతాబ్దంలో తిరిగి ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.. ఇక్కడ గోదావరీ తటంలో అతి ప్రాచీనమైన నరసింహాలయమేగాక ఇంకా ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, వినాయకుడు వగైరా మనం అన్ని చోట్లా చూసే దేవతలతోబాటు, అరుదుగా దర్శనమిచ్చే బ్రహ్మదేవుడుకీ, దాదాపు కనిపించని యమధర్మరాజుకీ కూడా ఉపాలయాలున్నాయి. అలాగే ఇక్కడ ప్రవహించే గోదావరి నదిలో బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, వగైరా గుండాలున్నాయి.
ఈ క్షేత్ర విశేషాలు:
పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రంలో ఆవిర్భవించాడు. ఇక్కడి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి. ఆవరణలో నృసింహస్వామిని అష్టదిగ్బంధనం చేస్తున్న ఎనిమిది ఆంజనేయస్వామి విగ్రహాలను దర్శించవచ్చు. శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు. రాముడు ప్రతిష్టించిన లింగంగనుక ఇక్కడి శివుడు రామలింగేశ్వరుడైనాడు. ఇది సైకత లింగం. శివుడు, కేశవుడు ఒకే చోట కొలువుతీరారుగనుక ఇది హరి హర క్షేత్రం. బ్రహ్మాది దేవతలిక్కడ తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమినిత్రవ్వి, ఆ కుండములో వచ్చిన నీటితో స్నానము చేసి శ్రీ నరసింహస్వామిని గురించి తపస్సు చేసి, ఆయన అనుగ్రహం పొంది, ఆయన ఆలయంలోనే స్ధానం పొందాడు. ఇక్కడ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మ ఉపాలయం చూడవచ్చు. అందుకనే ఇది త్రిమూర్తుల క్షేత్రం అయింది.
యమధర్మరాజు రోజూ పాపులను చూసీ చూసీ, వారికి శిక్షలు వేసీ వేసీ, తనకి లేనిపోని పాపాలంటుకుంటున్నాయని దీగులుచెంది, ఆ పాప ప్రక్షాళనకు తీర్ధయాత్రలు చేస్తూ, ఇక్కడ గోదావరిలో స్నానం చేశాడుట. దానితో ఆయనకి మనశ్శాంతి లభించి, నరసింహస్వామి మందిరానికెళ్ళి పూజించాడు. నరసింహస్వామి ప్రసన్నుడై ఇంకముందు నీముందుకెలాంటి పాపాత్ముడు వచ్చినా నీకెలాంటి దోషమూ వుండదనే కాక తన సన్నిధిలో నివసించమని కూడా ఆనతినిచ్చాడు. నరసింహస్వామి ఆలయం వెలుపల వున్న యమధర్మరాజు ఆలయం దర్శించి, అక్కడ గండ దీపంలో నూనె సమర్పించినవారికి అపమృత్యు దోషం వుండదనీ, మృత్యు భయం వుండదనీ ప్రతీతి. యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి యమకుండమని పేరు.
పూర్వము వీరసేనుడనే రాజుకి విజయ అనే కుమార్తె వుండేది. అత్యంత సౌందర్యవతి అయిన ఆమెకు విధివశాత్తూ ఒక సర్పంతో వివాహం జరిగింది. ఆవిడ ఆ సర్పాన్ని వెంటబెట్టుకుని తీర్ధయాత్రలు చేస్తూ ఇక్కడకొచ్చి సర్పరూపంలో వున్న తన భర్తతోసహా గోదావరిలో సరిగంగ స్నానం చెయ్యగా ఆమె భర్తకి సర్ప రూపం పోయి నవ యవ్వనుడుగా కనిపించాడు. భర్తతో సహా నరసింహస్వామిని అర్చించి తన దేశానికి వెళ్ళిన విజయ అక్కడివారికి తన పాతివ్రత్యాన్ని నిరూపించటానికి వారిని తీసుకుని తిరిగి ధర్మపురికి వచ్చింది. నరసింహస్వామిని ప్రార్ధించి, స్వామీ నీవే నా పాతివ్రత్యాన్ని వీరందరికీ తెలియజెయ్యాలని మూడు పిడికిళ్ళ ఇసుక కుప్పలా పోసింది. అది వెంటనే ఒక పెద్ద ఇసుక స్తంభమయింది. దానిని ఇప్పటికీ చూడవచ్చు. విజయని అప్పటినుంచి అందరూ సత్యవతి అని పిలిచారు. ఆ దంపతులు స్నానం చేసిన కుండం సత్యవతీ కుండంగా పేరుగాంచింది. ఇక్కడ సరిగంగ స్నానాలు చేసి స్వామిని దర్శిస్తే అత్యంత ఫలప్రదాయకం.
కుజదోషనివారణ:
యోగాసీనుడైన శ్రీ లక్ష్మిసమేత నృసింహ స్వామి స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తాడు. ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్ర రూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడవున్నది. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ది చెందింది. కుజదోషమున్న వారు ఈ క్షేత్రంలో స్వామివారికి కళ్యాణము చేయిస్తే వారికా దోషం పోయి, శీఘ్రంగా వివాహమవుతుందని భక్తుల నమ్మకం. సాధారణంగాకుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవవచ్చు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. చూపిస్తుందంటారు. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చిస్తే ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. ధర్మపురి గర్భాలయంలో ఉన్నది ప్రహ్లాదయుతుడైన నారసింహుడు. ధర్మపురిలో యోగనారసింహుడు, ఉగ్రనారసింహుడు, ప్రహ్లాదనారసింహుడు, లక్ష్మీ నారసింహుడు అనే తత్వాలు ప్రకాశించాయి.
ఫాల్గుణ శుధ్ధ ఏకాదశి:
స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుధ్ధ ఏకాదశినుంచి 13 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు మన రాష్ట్రాలలోని నలుమూలలనుంచేకాక, మహారాష్ట్రనుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న క్షేత్రాలను అవకాశం వున్నవారు తప్పక దర్శించాలి.
0 Comments