Ad Code

మహాబుద్ధిః (చతురక్షరి)


మహాబుద్ధిః (చతురక్షరి)


ఇది నాల్గు అక్షరాల మంత్రము. పూజా కాలంలో “మహాబుద్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

మహతీ బుద్ధి: యస్యాః సా = మహిమాన్వితమైన బుద్ధిగలది శ్రీదేవి.

"మనః సంకల్ప రూపస్యాత్ బుద్ధిః స్సాన్నిశ్చయాత్మికా" అనే శ్రుతిని అనుసరించి, సంకల్ప వికల్పాది రూపంగా చపలమైన
జ్ఞానం అనేది మనస్సు అనబడుతుంది. నిశ్చయాత్మకమైన
జ్ఞానాన్ని బుద్ధి అందురు. మనస్సు ఇంద్రియాల ద్వారా అనేక విషయాలను అనుసరిస్తుంది.

అందలి మంచి చెడ్డలను గూర్చి వాద ప్రతివాదాలు లాయరు మాదిరిగా చేస్తుంది. బుద్ధి న్యాయమూర్తి వలె నిర్ణయం చేసి తీర్పును వెల్లడిస్తుంది. బుద్ధియు, రాగ ద్వేషాలచే కలుషితమై సరియైన తీర్పును వెలువరించని, మానవునికి పతనం తప్పదు. “బుద్ధినాశాత్ ప్రణశ్యతి” (గీత).

మన బుద్ధులు భ్రష్టములు కాకుడా ఉండాలంటే మహాబుద్ధి పరాశక్తిని అయిన అమ్మను శరణు పొందాలి.
“యో బుద్దేః పరతస్తు సః"

"ఏవం బుద్ధేః పరం బుద్ధ్యాం సంస్తభ్యాత్మానమాత్మనా
జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదమ్”
(భగవద్గీత)

బుద్ది కంటె పరమైనది పరబ్రహ్మము లేక పరాశక్తి అగును. అందుచే ఆ తల్లిని శరణు పొందినచో మన బుద్ధులు కామాది దోషములనుండి విముక్తి అవుతాయి.

అమ్మ బుద్ది ఎన్నటికినీ కామాది దోష కలుషితం కాదు. అందుచేతనే ఆ తల్లికి మహాబుద్ధి అని సార్థక నామము. ఆ అమ్మను ఆశ్రయిస్తే మనకు ఆమె కరుణచే మహా బుద్ధి ప్రాప్తిస్తుంది.

మన బుద్ధి, అనగా సంసారం నందలి జీవకోటిలో ఒక్కొక్కరి బుద్ధి, కొన్ని విషయాలనే గ్రహిస్తుంది. అమ్మ కరుణచే మహాబుద్ధి ప్రాప్తిస్తే, అన్నింటిని గ్రహించే శక్తి లభిస్తుంది. అనగా పవిత్రతా, ఏకాగ్రతా, ఆత్మానుభూతి, బ్రహ్మానుభూతి ఇత్యాది శుభాలు స్వయంగా గల్గుతాయి. అప్పుడు
“ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం మిదం విజ్ఞాతం భవతి" (ఒకటి తెలిస్తే అన్నియును తెలియును) అనే శ్రుతి ప్రకారము అన్నియును తెలుస్తాయి. మహాబుద్ధి స్వభావము ఇదియే.

"మహాబుద్ధి"అనే నమంతో అమ్మను ఉపాసించే సాధకులకు, క్రమంగా అమ్మ కరుణచే మహాబుద్ధి లభిస్తుంది. తద్వారా ఆత్మానుభూతియు, అఖండ బ్రహ్మానుభూతియు స్వయంగా ప్రాప్తిస్తాయి.


Post a Comment

0 Comments