Ad Code

రామాయణం (అరణ్యకాండ) - Ramayanam (Aranya kandam)


రామాయణం (అరణ్యకాండ)



అయోధ్యకాండలొ ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. రాముడి పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక, 14 సంవత్సరముల తరువాత రాముడు తిరిగి రాకపోతే, నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు.
రాముడు ఆ అరణ్యంలో తాపసులు ఉండేటటువంటి ప్రదేశం వైపునకు వెళ్ళాడు.
పుణ్యైః చ నియత ఆహారైః శోభితం పరమ ఋషిభిః 
తత్ బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మ ఘోష నినాదితం |
బ్రహ్మ విద్భిః మహా భాగైః బ్రాహ్మణైః ఉపశోభితం ||
ఆ ఆశ్రమాలలో ఉండేటటువంటి ఋషులు ఆకలిని జయించి నియమముతో కూడిన ఆహారమును తినేవారు, అందరూ వేదం చదువుకున్నారు, ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేద ధ్వని వినపడుతూ ఉండడం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే, ఆ ఆశ్రమంలో బ్రహ్మగారి సభ జెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఆశ్రమము దెగ్గర యజ్ఞములలో వాడే సృక్కు, స్రువము మొదలైన పరికరాలు ఉన్నాయి, అలంకారం కోసం సిద్ధం చెయ్యబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి. పెరుగు, లాజలు, అక్షతలు మొదలైనవి ఉన్నాయి.
రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం |
దదృశుర్ విస్మిత ఆకారా రామస్య వన వాసినః ||
వైదేహీం లక్ష్మణం రామం నేత్రైర్ అనిమిషైర్ ఇవ |
ఆశ్చర్య భూతాన్ దదృశుః సర్వే తే వన వాసినః ||
ఆ ఆశ్రమం దెగ్గరికి వచ్చాక, రాముడు తన ధనుస్సు యొక్క వింటినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు సీతారామలక్ష్మణులను చూసిన ఆ ఋషులు, వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు. బ్రహ్మతేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సుని చూసి అలా ఉండిపోయారు.
అప్పుడా ఋషులు ” మహానుభావ! మేము అందరమూ నీకు నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు రాజువి, రాజకుటుంబం నుంచి వచ్చినవాడివి. ఇంద్రుడి యొక్క అంశలొ నాలుగవ వంతు అంశ రాజులో ఉంటుంది. వనాలలో దూరంగా ఉన్నవాళ్ళని, నగరాలలో ఉన్నవాళ్ళని రాజు తన శాసనంతో రక్షిస్తాడు. బలం లేనివాడికి రాజు బలం రక్ష, బలం ఉందని చెలరేగిపోయేవాడికి రాజు బలం శిక్ష. రైతులు, వర్తకులు రాజుకి పన్ను కట్టినట్టు మేము కూడా పన్ను కడుతున్నాము, మా తపస్సులో రాజుకి ఆరవ వంతు వాటా వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు, అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివి అవుతావు. మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు, అందుకని రామ నువ్వు మమ్మల్ని ఆ రాక్షసులనుంచి రక్షించాలి ” అని అన్నారు.
అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్ధనలని స్వీకరించి, వారు ఇచ్చిన అర్ఘ్య పాద్యములు తీసుకొని సంతోషంతో అక్కడినుంచి బయలుదేరాడు. అలా కొంతదూరం వెళ్ళాక ఒకచోట చీకురువాయువులనే ఈగలు రొద చేస్తూ కనబడ్డాయి (ఈ ఈగలు పులిసిపోయి పడిఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయి). అయితే ఇక్కడికి దెగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురోడుతుండగా తన వొంటికి చుట్టుకొని, ఒక శూలాన్ని భుజానికి ధరించినవాడై, ఆ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చినవాడై, వొంటి నిండా మాంసం అంటుకున్నవాడై ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని తన వొళ్ళో కుర్చోపెట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు.
అధర్మ చారిణౌ పాపౌ కౌ యువాం ముని దూషకౌ |
అహం వనం ఇదం దుర్గం విరాఘో నామ రాక్షసః ||
చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాని భక్షయన్ |
ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యతి ||
” మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్న వాళ్ళు. ముని వేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యని నేను తీసేసుకున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది, అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు(రాధ్ అంటె ఆనందం, విరాధ్ అంటె ఆనందానికి వ్యతిరేకం) అంటారు, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని ” అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” చూశావా లక్ష్మణా, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతోందో, నాకు ఎంత కష్టమొచ్చిందో చూశావా, నా కాళ్ళ ముందు పరాయివాడు నా భార్యని ఎత్తుకొని తీసుకెళ్ళి, తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు, నాకు చాలా దుఃఖంగా ఉంది ” అని, ఆ విరాధుడి వైపు చూసి ” మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా. మేము దశరథ మహారాజు పుత్రులము, మేము రామలక్ష్మణులము, మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు ” అని రాముడు అన్నాడు.
అప్పుడా విరాధుడు ” నేను జవుడు అనే ఆయన కుమారుడిని, మా అమ్మ పేరు శతహ్రద, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను ” అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేశారు. అప్పుడా విరాధుడు ఆవులించేసరికి ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణముల చేత ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు.
అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులనిద్దరినీ పట్టుకొని, తన భుజాల మీద వేసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేశాడు, లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కిందపడ్డాడు. కిందపడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు, పైకి కిందకి పడేసారు, అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మణుడితో, ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్య తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేసాడు.
అప్పుడా విరాధుడు ” నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను, అందువలన నన్ను అస్త్ర-శస్త్రములు ఏమి చెయ్యలేవు. నాకు ఇప్పుడు అర్ధమయ్యింది, నువ్వు కౌసల్య కుమారుడవైన రాముడివి, నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడు అని. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని. కాని, నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామము వలన కుబేరుడి సభకి వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో, ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్ళి స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు శాపవిమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పుడ్చేసి సంహరించండి. ఇక్కడినుంచి ఒకటిన్నర యోజనముల దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి, నీకు మంచి జెరుగుతుంది ” అని విరాధుడు రాముడితో అన్నాడు.
తరువాత రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఆ గోతిలో వేసి, మట్టితో పుడ్చేసి, శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళారు.
వారు శరభంగ ముని ఆశ్రమానికి చేరుకోగానే, వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది, సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డార, అన్నట్టు ఆ గొడుగు ఉంది. రథం అంతా మెరిసిపోతుంది, ఆ రథం చుట్టూ 25 సంవత్సరములు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది, వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని, దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజామరలు పట్టుకొని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. కాని ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవాల్సిన వ్యక్తి, శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు.
ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! లక్ష్మణా! మనం వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు, ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద వచ్చె ఇంద్రా, అని పిలుస్తాము కదా, అదిగొ ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు, అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒకసారి చూస్తాను ” అన్నాడు.
అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి, శరభంగుడితో ఇలా అన్నాడు.
ఇహ ఉపయాతి అసౌ రామో యావన్ మాం న అభిభాషతే |
నిష్ఠాం నయత తావత్ తు తతో మా ద్రష్టుం అర్హతి ||
” రాముడు వచ్చేస్తున్నాడు, రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది, అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి ” అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మని, లక్ష్మణుడిని తీసుకొని శరభంగ ముని ఆశ్రమంలోనికి వెళ్ళి తన రెండు చెవులని పట్టుకొని శరభంగుడికి తన ప్రవర చెప్పి, నేను రాముడిని వచ్చాను అని అన్నాడు.
” రామ! నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపఃశక్తితో ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్నిగెలిచాను, అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి, నన్ను రమ్మన్నాడు. కాని నేను, నాకు ప్రియమైన అతిధి వచ్చాడు, అతనికి ఆతిధ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామ! నేను నా తపఃశక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను, యధేచ్చగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు ” అని శరభంగుడు అన్నాడు.
ఈ మాటలు విన్న రాముడు ” మహానుభావ! మీరు తపస్సు చేసి నాకు ధారపొయ్యడమేమిటి. నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను ” అన్నాడు.
రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు ” ఇక్కడికి దెగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నారు, నువ్వు ఆయనని దర్శించు. రామ! నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు. నా శరీరం జర్జరీభూతం( ముసలిదయిపోయి ముడతలు పడిపోయింది) అయిపోయింది, కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను ” అని చెప్పి, ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి, తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు.
తస్య రోమాణి కేశాం చ తదా వహ్నిః మహాత్మనః |
జీర్ణం త్వచం తద్ అస్థీని యత్ చ మాంసం చ శోణితం ||
ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరం, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటకి వచ్చి ఋషులు, నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు.
బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న బ్రహ్మగారు లేచి ” మహానుభావ! శరభంగ, స్వాగతం, సుస్వాగతం ” అన్నారు. అలా శరభంగుడు ఉత్కృష్టమైన ఆ బ్రహ్మ లోకాన్ని చేరుకున్నాడు.

శరభంగుడు వెళ్ళిపోయాక ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వైఖానసులు (విఖనస మహర్షి యొక్క సంప్రదాయంలో ఉండేవాళ్ళు), చెట్లనుంచి కింద పడినటువంటి ఎండుటాకులను తినేవాళ్ళు, సూర్య కిరణాలని, చంద్ర కిరణాలని తినేవాళ్ళు, గాలిని తినేవాళ్ళు, కేవలం నీరు తాగి బతికేవాళ్ళు, నిలబడే నిద్రపోయేవాళ్ళు, చెట్టుమీదనే ఉండి  తపస్సు చేసుకునేవాళ్ళు, ఎప్పుడూ దర్భల మీదనే ఉండేవాళ్ళు, ఇలా రకరకములైన నియమములతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు.
శరభంగుడు వెళ్ళిపోయాక ఆ మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి ” రామ! ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపఃశక్తితో రాక్షసులని నిగ్రహించగలము, కాని మేము జితఃక్రోధులం, కోపాన్ని జయించినవాళ్ళము. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము. మేము ఎప్పుడూ మా తపఃశక్తిని మాకోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు తల్లిలాంటి వాడివి, మేము నీ కడుపులో ఉన్న పిండంలాంటి వాళ్ళము, మాకు ఒకరికి చెప్పుకోవడం కూడా చేతకాదు, నువ్వు క్షత్రియుడవి కనుక మమ్మల్ని రక్షించడం నీ ధర్మం, నీ దెగ్గర ధర్మం పుష్కలంగా ఉంది, నీకు సత్యం యొక్క, ధర్మం యొక్క స్వరూపం తెలుసు, సత్యధర్మములను రెండిటినీ అనుష్టానము చెయ్యడము తెలుసు. తల్లి బిడ్డలని రక్షించినట్టు, రాజు అరణ్యాలలో ఉన్న ఋషులని రక్షించాలి. అందుకని నీకు చెప్పుకుంటున్నాము రామ.
ఏహి పశ్య శరీరాణి మునీనాం భావిత ఆత్మనాం |
హతానాం రాక్షసైః ఘోరైః బహూనాం బహుధా వనే ||
ఎవ్వరి జోలికి వెళ్ళకుండా, కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులను ఆ రాక్షసులు చంపారో ఒకసారి వచ్చిచూడు రామ, చిత్రకూట పర్వతాల మీద, దండకారణ్యంలో, మందాకినీ నది ఒడ్డున ఉండేటటువంటి ఎందరో మహర్షులను ఆ రాక్షసులు చంపేసారు. అందుకని నీ ముందు నిలబడి, రెండు చేతులతో నీకు దండం పెట్టి, నీకు శరణాగతి చేస్తున్నాము రామ, మమ్మల్ని రక్షిస్తావ?” అని ఆ ఋషులు రాముడిని అడిగారు.
ఆ ఋషుల యొక్క ప్రార్ధనలని విన్న రాముడు ” మీరు నన్ను ఆజ్ఞాపించాలి, అంతేకాని మీరు నన్ను ఎప్పుడూ కూడా అలా శరణాగతి చెయ్యకూడదు. ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను, నాకు తెలియలేదు మీరు ఇంత కష్టపడుతున్నారని. ఈ అరణ్యాలలో తపస్సు చేసుకునేటటువంటి ఋషులని ఇక నేను రక్షిస్తాను, మీరు నా శక్తిని, నా తమ్ముడి శక్తిని చూస్తారు ” అన్నాడు.
తరువాత రాముడు ఆ మహర్షులందరితో కలిసి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరారు.
వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఆ సుతీక్ష్ణ మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఆశ్రమం అంతా శోభాయమానంగా ఉంది. అప్పుడు రాముడు సీతాలక్ష్మణసహితుడై లోపలికి వెళ్ళి సుతీక్ష్ణ మహర్షి దెగ్గర కూర్చుని ” మహాత్మా! నన్ను రాముడు అంటారు, ఒకసారి మీరు నన్ను చూసి, నాతో మాట్లాడవలసింది అని అభ్యర్దిస్తున్నాను ” అని అన్నాడు.
కళ్ళు తెరిచిన ఆ సుతీక్ష్ణుడు ఇలా అన్నాడు ” రామ! దేవేంద్రుడు నా దెగ్గరికి వచ్చి, నేను చేసిన తపస్సు చేత నేను లోకములన్నిటిని గెలిచాను కనుక నన్ను ఊర్ధలోకములకు తీసుకువెళతాను అని రథం ఎక్కమన్నాడు. చిత్రకూట పర్వతం మీద నివాసం ఉంటున్న రాముడిని దర్శించుకొని, ఆయనకి ఆతిధ్యం ఇచ్చి వస్తానని చెప్పాను. అందుచేత నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నాను రామ ” అన్నాడు.
శరభంగ మహర్షి చెపినట్టు సుతీక్ష్ణుడు కూడా రాముడికి తాను తపస్సు చేత గెలుచుకున్న లోకాలని ధారపోస్తాను అన్నాడు.
అప్పుడు రాముడు ” మీరు సంపాదించుకున్న లోకములలో నేను విహరించడం కాదు, నా అంతట నేను కూడా తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకని నేను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని నాకు చూపించండి ” అన్నాడు.
“అయితే ఇక్కడ దెగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వు వాటన్నిటిని చుసిరా. నువ్వు వాటిని చూసి వచ్చాక చెబుతాను ” అని సుతీక్ష్ణుడు అన్నాడు.
” నాకు కూడా ఆ ఆశ్రమాలన్నిటిని చూడాలని ఉంది, అందుకని ఆ ఆశ్రమాలన్నిటిని చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను ” అని రాముడు అన్నాడు.
ఆ రోజూ రాత్రికి సుతీక్ష్ణుడి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం స్నానం చేసి, సంధ్యావందనం చేసి సుతీక్ష్ణుడి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దెగ్గరికి వచ్చాడు. అప్పుడా సుతీక్ష్ణ మహర్షి ” రామ! నువ్వు ఇక్కడే ఉండి నీ తపస్సుని యదేచ్ఛగా ఆచరించు, ఇక్కడ ఏవిధమైన ప్రమాదము ఉండదు, కాని ఇక్కడికి మృగములు వస్తుంటాయి, అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు ” అన్నాడు.
అప్పుడు రాముడన్నాడు ” మృగాలని చూస్తే ధనుస్సు పట్టుకోవడం నా అలవాటు, ఋషులు ఉండే ప్రాంతానికి మృగాలు వస్తే, ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను కోదండం పట్టుకొని బాణ ప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న ఆ మృగాలని చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగచ్చు, అందువలన బాణ ప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నాకు వేరు ఆశ్రమం కావాలి, అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించికోడానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తాపసుల ఆశ్రమాలని దర్శించుకొని వస్తాను ” అన్నాడు.
” అయితే నువ్వు అన్ని ఆశ్రమాలని దర్శించుకొని మళ్ళి ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను ” అని  సుతీక్ష్ణుడు రాముడితో అన్నాడు.
సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు, సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అనింది ” నేను పెద్దల దెగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చెయ్యాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు కదా. కాని మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి, అందులో మొదటిది అసత్యము పలకడం, మీరు ఎన్నడూ అసత్యము చెప్పరు, ఇక ముందు కూడా అసత్యము చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ, నేను మీ భార్యని, నాకు తెలుసు మీరు ఎన్నడూ పర స్త్రీని అటువంటి భావనతో చూడరని. మూడవది ఏంటంటే…..
తృతీయం యద్ ఇదం రౌద్రం పర ప్రాణ అభిహింసనం |
ఏ కారణము లేకుండా, అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం. కాని ఆ మూడవ దోషం ఇవ్వాళ మీయందు నాకు కనబడుతోంది. మీరు నిన్న తాపసుల ఆశ్రమాలకి వెళ్ళారు, అప్పుడా తాపసులు తమని హింసిస్తున్న రాక్షసుల నుంచి రక్షించమని కోరారు. అప్పుడు మీరు ఏమన్నారు, ఇకనుంచి నా పౌరుషం చూడండి నా తమ్ముడి పౌరుషం చూడండి అని, తాపసులని హింసించే రాక్షసులని ఇకనుంచి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీకు, రాక్షసులకి ప్రత్యక్ష వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేదన్నా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదన్నా అపకారం చేస్తే, మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి, కాని ఇప్పుడు మీరు ఒక తాపసిలాగ ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు. అలాంటి మీరు ఆ తాపసులకి రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగ ఎలా ప్రతిజ్ఞ చేశారు. అందువలన కామజనితమైన ఆ మూడవ దోషము మిమ్మల్ని ఆవహించింది. కాబట్టి నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు. కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో, అలా మీకు కలిగిన ఈ దోషము వలన, క్రమక్రమంగా మృగాలని, రాక్షసులని చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పడు మీకు, రాక్షసులకి మధ్య నిష్కారణంగా శతృత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడమనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో, ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి…….
పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని పాడుచేద్దామని, ఇంద్రుడు ఒక యోధుడి వేషాన్ని ధరించి, ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన దెగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘ అయ్యా! నేను ఆపదలో ఉన్నాను, నేను సైనికుడిని అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నాదెగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు. కనుక నేను మళ్ళి వచ్చి తీసుకునేదాక ఈ ఖడ్గాన్ని మీ దెగ్గర ఉంచండి’ అని, ఆ యోధుడి వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి  వెళ్ళిపోయాడు. ఆ ఋషి కూడా సరే అన్నాడు.
మళ్ళి ఆ యోధుడు వచ్చి ఖడ్గాన్ని అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పినవాడిని అవుతానని, ఆ ఋషి తాను కూర్చునే దర్భాసనం కిందనే ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక, ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతోందని, ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి. అలా ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చెయ్యడం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రకోపించి, ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని, కొమ్మలని నరకాలనిపించింది, తరువాత మృగాలని చంపాలనిపించింది, తరువాత దారిదొంగతనాలు చెయ్యాలనిపించింది, తరువాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చెయ్యాలనిపించింది. రామ! ఇంద్రుడు ఏమి చెయ్యలేదు, కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు, కాని ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేసాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం, బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే, మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చెయ్యండి, ఈ కోదండం, బాణాలు పట్టుకోండి. కాని ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు?
మీరు నాతో ఒక మాట అనొచ్చు, ‘ నేను రాజుని కాకపోవచ్చు, కాని నేను ఒక క్షత్రియుడిని, అందుకని నేను కోదండాన్ని పట్టుకోవడంలో తప్పులేదు’ అని. మిమల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే, వారిని మీరు రక్షించండి, తప్పులేదు. అంతేకాని, ఎక్కడో ఋషులని ఎవరో రాక్షసులు ఇబ్బందిపెడుతున్నారని, రాక్షసులందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చెయ్యడం నాకు నచ్చలేదు. నేను స్త్రీని కదా, ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పనేమో. మీ తమ్ముడితో ఆలోచించి, ఒక మంచి నిర్ణయానికి రండి ” అని సీతమ్మ రాముడితో అనింది.
సీతమ్మ పలికిన పలుకులకి రాముడు ఇలా సమాధానం చెప్పాడు ” సీతా! రాక్షసులు తమని బాధపెడుతుంటే ఆ ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు.
తే చ ఆర్తా దణ్డకారణ్యే మునయః సంశిత వ్రతాః |
మాం సీతే స్వయం ఆగమ్య శరణ్యాః శరణం గతాః ||
నేనేమి వాళ్ళని అడగలేదు, వాళ్ళంతట వాళ్ళే వచ్చి నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా. నేను క్షత్రియుడని కనుక వాళ్ళకి కష్టం వస్తే, ఆ కష్టాన్ని నేను తెలుసుకొని రాక్షస సంహారం చేసి తాపసులు తపస్సు చేసుకునేటట్టు నేను చూడాలి. మీకు కష్టం ఉందా అని నేను వాళ్ళని అడగలేదు, నా అంతట నేను రాక్షస సంహారం చెయ్యలేదు. నేను ఇవేమీ చెయ్యలేదు, వాళ్ళు నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశారు, అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా చెయ్యడం క్షాత్ర ధర్మమే. ఒకసారి నేను ఎవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే, నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళని రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్మణుడిని విడిచిపెట్టేస్తాను, ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అంతేకాని ఎట్టి పరిస్థితులలోను మాట తప్పను. ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి తీరుతాను సీతా ” అని రాముడు అన్నాడు.
ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి ” మీరు ఎలా నిర్ణయిస్తే అలానే జెరుగుతుంది” అనింది. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివరన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ అరణ్యంలో వెళుతూ ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక చిత్రమైన పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులోనుంచి సంగీతం వినబడుతోంది, నృత్యం యొక్క ధ్వని వినబడుతోంది, పాటలు వినబడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్న ఆ శబ్దములను విన్న రాముడు ఆశ్చర్యపోయి, తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనే మునిని పిలిచి ” ఈ సరోవరం నుంచి ఇవన్నీ వినబడుతున్నాయి, ఏంటి సంగతి ” అని అడిగారు.
ఇదం పంచ అప్సరో నామ తటాకం సార్వ కాలికం |
నిర్మితం తపసా రామ మునినా మాణ్డకర్ణినా ||
అప్పుడా ధర్మభృత్ ” ఈ సరోవరాన్ని మాణ్డకర్ణి అనే ఋషి తయారు చేశారు. ఆయన 10,000సంవత్సరాలు వాయు భక్షకుడై తపస్సు చేశాడు. ఈయన తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాడేమో అని దిక్పాలకులు అనుకొని, ఆయన తపస్సుని భగ్నం చెయ్యడానికి అయిదుగురు అప్సరసలని పంపారు. అప్పుడా మాణ్డకర్ణి ముని ఆ అప్సరసలకి వసుడయ్యాడు. అప్పుడాయన ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ అంతఃపురం లోపల ఈయన అప్సరసలతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు. తన తపఃశక్తితో యవ్వనాన్ని పొంది ఈ అయిదుగురితో రమిస్తూ ఉంటాడు. లోపల ఆ అప్సరసలు పాడుతున్న పాటలు, వాయిస్తున్న వాద్యముల యొక్క శబ్దములే మనకి ఇలా బయటకి వినబడుతున్నాయి రామ ” అని అన్నాడు.
ఇది విన్న రాముడు ఆశ్చర్యపోయి అక్కడినుంచి ముందుకి పయనమయ్యాడు.
(ఈ మాణ్డకర్ణి మహర్షి జీవితాన్ని తత్వపరంగా చూస్తే, మాణ్డకర్ణి మహర్షి దెగ్గరికి వచ్చిన ఆ అయిదుగురు అప్సరసలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనే జ్ఞానేంద్రియాలు. తన ఇంద్రియాలకి లొంగినవాడై, తను ఇప్పటిదాకా సంపాదించిన తపఃశక్తిని సుఖములు అనుభవించడం కోసం ఉపయోగించాడు. తన జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నాడు)
తాను చూసినటువంటి ఆశ్రమములలో రాముడు ఒకదానిలో 6 నెలలు, ఒకదానిలో 9 నెలలు, మరొకదానిలో 1 సంవత్సరము, అలా ఒక్కొక్క ఆశ్రమంలో కొంత కాలం గడిపాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాలలో రాముడు అన్ని తాపసుల ఆశ్రమాలని సందర్శించాడు. తరువాత ఆయన సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వెళ్ళారు.
అప్పుడు రాముడు ” అయ్యా! 10 సంవత్సరాలలో తాపసుల ఆశ్రమాలన్నిటినీ చూశాను. మీరు మళ్ళి రమ్మన్నారని వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడొ ఉందని విన్నాను, కాని ఈ అరణ్యం చాలా విశాలంగా ఉండడం వలన ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియడం లేదు, అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించాలని అనుకుంటున్నాను ” అని అన్నాడు.
అప్పుడా సుతీక్ష్ణుడు ” రామ! ఈ మాటే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడినుంచి 4 యోజనముల దూరం దక్షిణంగా వెళితే అగస్త్య భ్రాత(అంటె అగస్త్యుని తమ్ముడు అని అర్ధం, ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలొ ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్టు, అగస్త్యుడి తమ్ముడు కనుక ఆయనని అగస్త్య భ్రాత అని పిలిచేవారు) ఆశ్రమం కనబడుతుంది. నువ్వు అక్కడ ఒక రాత్రి పడుకో. మరునాడు ఉదయం అక్కడనుంచి బయలుదేరి వెళితే, నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనబడుతోంది. అక్కడినుంచి ముందుకి వెళితే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు ” అన్నాడు.
సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి దెగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకి బయలుదేరారు. వారు అగస్త్య భ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దెగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! ఈ ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే…………..పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దెగ్గరికి వెళ్ళి, ‘ అయ్యా, రేపు మా తండ్రిగారి ఆబ్దికము, తద్దినం పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి ‘ అనేవారు. అప్పుడా ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి, ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు( త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రిగారికి పెట్టె తద్దిన భోజనంలో మాంసం వండేవారు, ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు). ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత హస్తోదకం వేసి ‘ వాతాపి! రా……..’ అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.
ఇలా చాలాకాలం, చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి ‘వాతాపి! రా…..’ అన్నాడు.
కుతో నిష్క్రమితుం శక్తిర్ మయా జీర్ణస్య రక్షసః |  
భ్రాతుః తే మేష రూపస్య గతస్య యమ సాదనం ||
” నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా ” అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు.
ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా ” అని రాముడు అన్నాడు.
ఈ వృత్తాంతం విన్నాక అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. వాళ్ళకి అగస్త్య భ్రాత ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించాడు, అర్ఘ్య పాద్యాలు ఇచ్చాడు, కందమూలాలు, తేనె పెట్టాడు. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసింది అని అడుగగా ” అదిగొ మీకు కనపడుతున్న ఆ చెట్లకి ప్రదక్షిణ చేసి దక్షిణ వైపుకి వెళితే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడుతోంది ” అని అగస్త్య భ్రాత మహర్షి చెప్పరు.
అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన ఆశ్రమంలో దేవతలకి స్థానాలు ఉన్నాయి( అంటె ఆయన ఆశ్రమానికి దేవతలు వచ్చి, తమ తమ స్థానాలలో కూర్చొని అగస్త్యుడిని పూజించి వెళ్ళేవారు. అక్కడ శివ స్థానం తప్ప మిగిలిన అన్ని దేవతలకి స్థానాలు ఉన్నాయి, అగస్త్యుడు శివుడిని పూజించేవాడు). ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాలలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయేవారు. ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కాని, క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కాని, వంచన చేసేవాడు కాని, మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కాని, ఎప్పుడూ కోరికలతో ఉండేవాడు కాని ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం అనేది జెరగదు.
సీతారామలక్ష్మణులు ఆ అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి, ఆ ఆశ్రమంలో ఎక్కడా చూసిన తడి బట్టలు, నార చీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పవిత్రమైన పదార్ధాలు, పుష్పమాలికలు మొదలైనవాటితో ఆ ఆశ్రమం రంజిల్లుతోంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! నేను సీతతో కలిసి బయట నిల్చుని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి, రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు, ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తార ” అని కబురు చెయ్యి అన్నాడు.
లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారిడితో తన ప్రార్ధన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా ” నేను ఎప్పటినుంచో సీతారాములని, లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు, రాముడు రాగానే నా దెగ్గరికి తీసుకురాకుండా, నా దెగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు, వెంటనే వెళ్ళి సీతరాములని ప్రవేశపెట్టు ” అని అగస్త్యుడు అన్నాడు.
అప్పుడు సీతారామలక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళుతుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైనవారి స్థానములు ఉన్నాయి. ఆ స్థానములలో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళుతుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటిసూర్యుల తేజస్సుతో ఆ గదినుండి బయటకి వచ్చారు.
ఏవం ఉక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్య వర్చసం |
జగ్రాహ ఆపతత్ తస్య పాదౌ చ రఘునందన ||
అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః |
సీతయా సహ వైదేహ్యా తదా రామః స లక్ష్మణః ||
సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు.
అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి, తాను అగ్నికార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి, రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటకి వచ్చిన అగస్త్యుడు ” నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా రామా?, అగ్నికార్యం జెరిగేటప్పుడు అతిథి వస్తే, ముందు అగ్నికార్యాన్ని పూర్తిచెయ్యాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించనివాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు.
రామా! నువ్వు లోకములన్నిటిని పాలించగల రాజువి, ఇవ్వాళ మాకు ప్రియమైన అతిధిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను ” అని రాముడికి వానప్రస్థులకి పెట్టె బోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు ధనుస్సుని, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక  బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు.
” స్వామీ! మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము ” అని రాముడు అడుగగా, ” నిన్ను నేను నాతోపాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను, కాని నా తపఃశక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను, నీ కోరిక ఏమిటో నాకు అర్ధమయ్యింది. అందుకని రామా! ఇక్కడికి దెగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో ” అన్నారు.
సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షి దెగ్గర సెలవు తీసుకొని, ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అనింది. అప్పుడు రాముడు ” నువ్వు ఎవరు ” అని అడుగగా, ఆ పక్షి ఇలా చెప్పసాగింది…….
” నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎనిమిదిమందే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనలా. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి ” మీరు క్షేత్రములు కనుక, నా యొక్క తేజస్సు చేత, నాతో సమానులైన వారిని కనండి ” అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు, కొంతమంది వినలేదు.
అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, ఇద్దరు అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు.
కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే ఇద్దరు జన్మించారు. తామ్రకి క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రీ, శుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళి క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాస పక్షులు పుట్టాయి. శ్యేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రీకి హంసలు, చక్రవాకములు పుట్టాయి. శుకికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది.  ఆ వినతకి గరుడుడు, అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని, నా పేరు జటాయువు, నా అన్నగారి పేరు సంపాతి.
అలాగే క్రోధవశకి మృగీ, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి, మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి, హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి, భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది, ఆ ఇరావతికి ఐరావతంపుట్టింది, మాతంగికి ఏనుగులు పుట్టాయి, శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి, శ్వేతకి దిగ్గజాలుపుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి, కద్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి.
రామా! ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా, కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్ని కశ్యప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే ” అని అన్నాడు ఆ జటాయువు.
ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడినుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు.

రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, జటాయువు పంచవటిని చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి, కావలసినంత నీరు దొరికేటటువంటి, దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి, దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సంవృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి, అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు ” అన్నాడు.
పరవాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియతాం ఇతి మాం వద ||
అప్పుడు లక్ష్మణుడు ” స్వామీ! నన్ను నిర్మించమని చెప్తావేంటి, నిర్మించేవాడిని నేను కాదు. నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి, నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణా! ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి, రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు ” అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ” లక్ష్మణా! ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో, ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది, దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి, ఆ పర్వత చెరియల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు, కారణ్డవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి, ఈ ప్రాంతం చాలా అందంగా, పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరాడుతోంది. అగస్త్యుడు మనన్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది, అందుకని లక్ష్మణా, నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు ”  అన్నాడు.
ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి, మట్టిని తీసి, నీరు పోసి, ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు, వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు, దానిమీద అడ్డుకర్రలు వేశాడు, వాటిమీద జమ్మి మొదలైన కర్రలు, దర్భ గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి, కొన్ని నీళ్ళని, పండ్లని, పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలోకి ప్రవేసించేముందు చేసెటటువంటి శాంతికర్మలన్నిటిని నిర్వహించి సీతారాముల దెగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ” అన్నయ్యా! నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను, వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి, బావుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను ” అని అన్నాడు. ( ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం. భగవంతుడికి సేవ చెయ్యడంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చేస్తాడు, అదే ఆయన లక్ష్మి, అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణా అని పేరు పెట్టారు)
ప్రీతో అస్మి తే మహత్ కర్మ త్వయా కృతం ఇదం ప్రభో |
ప్రదేయో యన్ నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||
ఆ పర్ణశాలని చూసిన రాముడు ” ఏమి పని చేశావయ్యా, నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను. నేను ఇవ్వగలిగిన కానుక ఏంటో తెలుసా ” అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగలించుకుని ” లక్ష్మణా! నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా, నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు, నీ రూపంలో నా దెగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని ” అన్నాడు.
అలా వారు ఆ పంచవటిలో రోజూ చెయ్యవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ, వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ, తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగ కాలం గడపసాగారు.
కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది, అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చెయ్యడానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు ” అన్నయ్యా! నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలొ మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చెయ్యడానికి భయమేస్తుంది, సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది.
నవ ఆగ్రయణ పూజాభిర్ అభ్యర్చ్య పితృ దేవతాః |
ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి, కనుక అందరూ తమ పితృదేవతలకి నవాగ్రయణ పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి, పాడిపంట చేతికిరావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్ళకుండా, ఒడ్డున కూర్చొని, ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియవంశంలో పుట్టి, ప్రగల్భాలు పలికి, యుద్ధంరంగం వైపు చూసి, యుద్ధానికి వెళ్ళకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు. అన్నయ్యా! నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది, అదేంటంటే……సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి, మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు, భరతుడు చాలా మంచివాడు, భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు, మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా, ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి ” అన్నాడు.
” లక్ష్మణా! నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా. మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు. అమ్మని అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు, భరతుడి గురించి మాట్లాడు, నేను పరమ సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను, చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతొ మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ” అని రాముడన్నాడు.
కృతాభిషేకః స రరాజ రామః సీతా ద్వితీయః సహ లక్ష్మణేన |
కృత అభిషేకో తు గిరి రాజ పుత్ర్యా రుద్రః స నందిః భగవాన్ ఇవ ఈశః ||
సీతారామలక్ష్మణులు ముగ్గురూ స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే, వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటకి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీపరమేశ్వరులులాగ కనబడుతున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పారు.
అలా కొంత కాలం గడిచాక, భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ( చాటలంత గోళ్ళు ఉన్నది). అప్పుడామె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు, విచ్చుకున్న పద్మముల వంటి కన్నులున్నవాడు, అపారమైన తెజస్సున్నవాడు, మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు అయిన రాముడిని చూసింది. అప్పుడామెకి విశేషమైన కామం కలిగింది.
రాముడిని చూస్తే ‘ అబ్బ ఎంత బావున్నాడో ‘ అంటారు, ఆమెని చూస్తే ‘ బాబోయి అలా ఉందేంటి ‘ అంటారు. రాముడి కడుపు బయటకి కనపడకుండా లోపలికి ఉంటుంది, ఈమె బాన బోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు, ఈమెని వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది, ఎర్రటి తీగలలాగ ఉన్న జుట్టు శూర్పణఖది. చూడంగానే మళ్ళి చూడాలనిపించే రూపం రాముడిది, పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం, ఈమె మాట్లాడితే కుక్క మొరిగినట్టు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు, ఈమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఈమెది ఎప్పుడూ దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే, వాళ్ళు సంతోషపడతారు, ఈమె ఎవరినన్నా చూస్తే, వాళ్ళు భయపడతారు.
ఇటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి ” నువ్వు ఇంత అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు. నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. కాని ఇక్కడ ఎవత్తో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది. ఇంతకీ మీరు ఎవరు ” అని అడిగింది.
అబద్ధం చెప్పడం రాని, తనని కోరి వచ్చింది కదా అని లేనిపోనీ మాటలు స్త్రీల దెగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు ” నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని, నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు, ఆమె నా భార్య సీత. మేము ముగ్గురమూ తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము. ఇక్కడ తాపసులమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వు ఎవరు? ” అని రాముడు అన్నాడు.
అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |
అరణ్యం విచరామి ఇదం ఏకా సర్వ భయంకరా ||
రావణో నామ మే భ్రాతా యది తే శ్రోత్రం ఆగతః |
వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రం ఆగతః ||
అప్పుడు శూర్పణఖ ” నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు, ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చెయ్యగలిగే ఖర దూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్కపెట్టను, నాకు అపారమైన బలం ఉంది, స్వేచ్ఛావిహారం చేస్తుంటాను, ఇవ్వాళ నిన్ను చూశాక, నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు ” అని సీతమ్మ వైపు చూసి ” ఈవిడెవరు, ఇంత అసహ్యంగా ఉంది. ఈవిడా నీ భార్య, ఈవిడ నీకు తగినది కాదు, నేను నీకు తగినదానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే, ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను, అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించచ్చు” అనింది.
విశేషమైన కామమును పురుషునియందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి, నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే, ఆమె మనస్సు ఖేదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక, కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని, చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు ” నాకు వివాహం అయ్యిపోయిందమ్మ, నా భార్య మీద నాక చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను. రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్నివిధాల నాలా ఉన్న, తేజస్సు కలిగిన, చాలాకాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే, ఆయనకి భార్యగా ఉండు ” అన్నాడు.
అప్పుడా శూర్పణఖ లక్ష్మణుడి దెగ్గరికి వెళ్ళి ” నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనూ అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు, నేనూ అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరమూ సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” నేనే ఓ దాసుడిని, మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినతో ఎలా ఉంటాడు. ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు, అందుకని మా అన్నగారినే అడుగు ” అని పరిహాసం ఆడాడు.
లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకొన్న శూర్పణఖ సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడబోతుంటే భయపడిపోయిన జింకలా సీతమ్మ వెనక్కి వెళ్ళింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” చూశావ లక్ష్మణా! ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దామని అనుకొంది. తాను అందగత్తెని అన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక, కాళ్ళు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక, అందం అంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక, ఆమె ముక్కు, చెవులు కోసెయ్యి ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు, చెవులని కోసేసాడు. కోసేయబడ్డ ముక్కు, చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగార్లైన ఖర దూషణులు దెగ్గరికి వెళ్ళి కిందపడింది. అప్పుడు ఖరుడు ” ఇదేమిటి ఇలా ముక్కు, చెవులు కోయించుకున్నావు. తన పక్కన నిశబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్ళతో గీరినవాడు ఎవడు, నిన్ను ముట్టుకున్న వాడు ఎవడు. వాడు ఈ పృథ్విలో ఎక్కడున్నా బతకడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటకి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు ” అని అడిగాడు.
అప్పుడా శూర్పణఖ ఇలా చెప్పింది ” ఇక్కడికి దెగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, నార చీరలు కట్టుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు, దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు, వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు, వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో, రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు, అంత అందంగా ఉన్నారు, వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు. కాని వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది, ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేసారు. అన్నయ్యా! నాకు ఒక్కటే కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని సంహరించాలి. ఆయనలో నుంచి నురగతోటి, బుడగలతోటి వేడి నెత్తురు బయటకి వస్తుంటే, ఆ నెత్తురుని నా దోసిళ్ళతో పట్టుకొని తాగాలని ఉంది, కనుక నా కోరిక తీరుస్తావా ” అనింది.
” అయ్యయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా, తప్పకుండా తీరుస్తాను ” అని ఖరుడు అన్నాడు.
తరువాత 14 మంది సైన్యాధిపతులని పిలిచి ” మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి, మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది ” అన్నాడు.
తాపసులైన ఆ రామలక్ష్మణులని చంపడం చాలా తేలికని భావించి ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళకి రామ లక్ష్మణులని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరిఘలు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగుతీసారు. అప్పుడు రాముడు ” లక్ష్మణా! నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను ” అన్నాడు.
ఇంద్రుడి చేతినుండి వజ్రాయుధం విడువబడినట్టు, రాముడు బాణములను తన ధనుస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెలకి ఉన్న కవచాలని పగలగొట్టి, వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ, నెత్తురోడుతూ నేల మీద పడి మరణించారు.
ఇదంతా చూసిన శూర్పణఖ మళ్ళి వెళ్ళి ఖరుడి దెగ్గర పడింది. ఇప్పుడే కదా 14 మందిని పంపించాను, మళ్ళి ఏమయ్యిందని ఇలా పడిపోయావు, అని ఖరుడు అడిగాడు. అప్పుడా శూర్పణఖ ” పంపించావులేవయ్య 14 మందిని రామలక్ష్మణులని చంపమని, వాళ్ళని రాముడు ఒక్క క్షణంలో చంపేసాడు. రాముడు మహావీరుడు. నిజంగా నీకు రాముడిని ఎదురించే శక్తి ఉంటె నీ దెగ్గరున్న కింకరులని పంపించడం కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు. నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే, నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలని వదిలేస్తాను. అస్తమానం నా దెగ్గరికి వచ్చి, నేను వాడిని వీడిని చంపాను అంటావేంటి, అవన్నీ ఒట్టిదే, నువ్వు శూరుడివి కాదు. రాముడు మహావీరుడని చెప్పాను కదా, వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో ” అనింది.
ఈ మాటలు విన్న ఖరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి ” నేను ఇప్పుడే బయలుదేరతాను, నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను. నేను కాని యుద్ధానికి వెళితే, నా ముందు నిలబడగలిగే వాడు అంటూ ఎవడూ ఉండడు ” అని పలికి, 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు.
ఆ ఖరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి, ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుపడి, ముందుకి పడిపోయి, పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు-ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లోనుంచి అగ్నిని కక్కుతూ, ఎదురుగా వచ్చి పెద్దగా ఏడిచాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా, ఆ ఖరుడు వాటిని లెక్కపెట్టకుండా ముందుకి వెళ్ళాడు.
ఆ ఖరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితోపాటు దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాథి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు.
అటుపక్క రాముని ఆశ్రమంలో, పక్షులు చిత్రవిచిత్రమైన కూతలు కూస్తున్నాయి, భూమి ఒక్కసారి కంపించింది, అలా కంపించడం వలన బంగారు పిడి కలిగిన ధనస్సు ఎగిరి ఎగిరి పడుతోంది, బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుస్సు భూమి కంపించేసరికి ఎగిరి ఎగిరి పడుతోంది, అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తోంది, అంటె గొప్ప యుద్ధం వస్తోందని ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తోంది అంటె, ఈ యుద్ధంలో జయాపజయాలు దైవనిర్ణయాలు. నా ఎడమ భుజం అదురుతోంది కనుక, ఖచ్ఛితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను.
తస్మాత్ గృహీత్వా వైదేహీం శర పాణిః ధనుర్ ధరః |
గుహాం ఆశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం ||
అందుకని లక్ష్మణా నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని, సీతని తీసుకొని, ఎవరు చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో ‘సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో’ అనే మాటలు చెప్పమాకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు, కాని వీళ్ళతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేడు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో ” అన్నాడు.
అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే, ఆనాడు పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు.
ఆశ్రమానికి వచ్చిన ఖరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతునప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి, ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు.
రాముడు ఒక్కసారి తన ధనుస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయబాణ తూణీరంలొ నుంచి బాణం తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు, అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే, దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి, పర్వతాలు ప్రకంపించాయి, వన దేవతలు వనాన్ని విడిచి పారిపోయారు, క్రూరమృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి, గుర్రాల కాళ్ళు రాలిపోయాయి, రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి, కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏక కాలంలో 13బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులని రాముడు ఒక్కడే సంహరించాడు.
దూషణుడు ఆగ్రహంతో ఒక పరిఘని పట్టుకొని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు వాడి రెండు చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. రాముడు కొట్టిన దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడిపోయినట్టు నేల మీద పడి మరణించాడు. ఇంక ఆ యుద్ధరంగంలో ఖరుడు, త్రిశిరస్కుడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆజ్ఞ మేరకు త్రిశిరస్కుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు.
అప్పుడు ఖరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే, ఆ ఖరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు. ఆ దెబ్బకి వింటినారి తెగిపోయి ఆ ధనుస్సు విరిగిపోయింది. అప్పుడా ఖరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి, ఆయన కవచం పిట్లిపోయి కింద పడిపోయింది. అప్పుడాయన రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు, ఆ దెబ్బలకి పర్వతాల నుంచి సెలయేళ్ళు పారినట్టు, రాముడి గుండెల నుంచి రక్తం కారింది.
అప్పుడు రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనుస్సుని తీసుకుని ఖరుడితో ఇలా అన్నాడు ” వాడు మూడులోకములను పరిపాలించగల సమర్ధుడైనా, పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బతికేవాడికి కొంతకాలం లోకం తలవంచి ఉండవచ్చు, కాని వాళ్ళకి ఒకసారి అవకాసం వస్తే, పదిమందిలో ఒక్కత్తె వెళ్ళిపోతున్న పాము కనబడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్టు, అందరూ కలిసి అటువంటివాడిని చంపేస్తారు. ఎక్కడో పర్ణశాలల్లో కూర్చుని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు. వాళ్ళని బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఏ ఋతువులో ఏ పువ్వు పుయ్యాలో, ఆ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. అలా పాపము యొక్క ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు, ఆయన ఇవ్వడం సిద్ధం చేసిననాడు ఆ ఫలాన్ని అనుభవించాలి. ఏ భూమిని నువ్వు ఇంతకాలం బాధ పెట్టావో, ఆ భూమి ఈనాడు నీ ఒంట్లోనుంచి కారే వేడి నెత్తురు తాగుతుంది. నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని తీసేస్తున్నాను ” అన్నాడు.
ఆ మాటలకి ఆగ్రహించిన ఖరుడు యమపాశం లాంటి ఒక అద్భుతమైన గదని రాముడి మీదకి వేశాడు. ఆ గద దారిలో అడ్డొచ్చిన చెట్లని కాల్చుకుంటూ రాముడి మీదకి దూసుకువచ్చింది. అప్పుడు రాముడు ఏకకాలంలో కొన్ని బాణములను ప్రయోగించగా, ఆ గద మార్గమధ్యలోనే తుత్తునియలు అయిపోయింది. తరువాత రాముడు వేసిన బాణాలకి ఆ ఖరుడి ధ్వజం, గుర్రాలు, సారధి పడిపోయారు. ఆ బాణాలు ఖరుడి గుండెల్లో దిగేసరికి, ఆయన గుండెల్లో నుంచి నెత్తురు ఏరులై ప్రవహించింది. ఇక తాను చనిపోతానన్న ఆక్రోశంతో, అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరికించి, దాన్ని రాముడి మీద వెయ్యబోగా, రాముడు ఆ చెట్టుని నారాచ బాణములతో ముక్కలు చేశాడు. అప్పుడా ఖరుడు రాముడి మీద పడబోగా, ఆయన బాణం పెట్టి కొట్టగానె, ఖరుడు భూమి మీద పడి మరణించాడు.
అర్థ అధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః |
చతుర్ దశ సహస్రాణి రక్ష్సాం కామ రూపిణాం |
ఖర దూషణ ముఖ్యానాం నిహతాని మహామృధే ||
రాముడు ఆ 14,000 మంది రాక్షసులని ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జెరుగుతోందో అని కంగారుపడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగుపరుగున వచ్చి రాముడిని ముందునుంచి గట్టిగా కౌగలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి, వెనక నుంచి, మళ్ళి మళ్ళి కౌగలించుకుంది.
అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. చంద్రుడివంటి ముఖంతో సీతమ్మ కౌగలించుకునేసరికి రాముడు తన కష్టాన్నంతా మరిచిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు.
రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు ” అసలు ఆ రాముడు ఎవరు, దండకారణ్యంలో ఎందుకున్నాడు, వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి, అసలు 14,000 రాక్షసులని రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు. నాకు కారణం చెప్పు ” అన్నాడు.
అప్పుడు అకంపనుడు ” రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, దశరథుడి కుమారుడు, విశేషమైన తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, రాముడికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు, ఆయన రాముడికి కుడిభుజం లాంటివాడు, సర్వకాలములయందు రాముడిని కాపాడుకోవడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి ప్రవేశించాడు. తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలని రాముడికి చెప్పుకుంటె, మీకు శత్రువులైన రాక్షసులు నాకూ శత్రువులే కనుక వారిని సంహరిస్తాను అని ఆ ఋషులకి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు తన బాణముల చేత ఈ భూమిని కృంగేటట్టు చెయ్యగలడు, కృంగిపోతున్న భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాలని క్షోభింప చెయ్యగలడు, పర్వతాలని కదపగలడు ” అని అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు.
” అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరిస్తాను ” అని రావణాసురుడు అన్నాడు.
అప్పుడు అకంపనుడు ” మీరు తొందరపడి వెళ్ళవద్దు, ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆయన ముందు మీరు నిలబడలేరు. రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది, రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది. ఆ సీతతో అందంలో సమానమైన వాళ్ళు గంధర్వలులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, రాక్షసులలో కాని, మనుష్యులలో కాని లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో ” అన్నాడు.
రావణుడు వెంటనే బయలుదేరి మారీచ ఆశ్రమానికి వెళ్ళి” నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నువ్వు మాయలు తెలిసినవాడివి. అందుకని సీతాపహరణంలో నాకు ఉపకారం చెయ్యి ” అని అడిగాడు.
ఈ మాటలు విన్న మారీచుడు ” నీకు అసలు ఎవడు చెప్పాడు సీతాపహరణం చెయ్యమని. బహుశా నిన్ను సంహరించడం కోసమని నీ శత్రువు ఎవడో నీకు సలహాలు చెప్పేవాడిగా మాటువేసి ఉన్నాడు. వాడు నిన్నే కాదు సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు నీకు రాముడితో వైరం పెట్టాడు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు ఎవడూ జీవించడు, రాముడి శక్తి సామర్ధ్యాలు ఏమిటో నాకు తెలుసు. నా మాట విని సీతాపహరణం చెయ్యకు ” అన్నాడు.
” నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను సీతాపహరణం చెయ్యను ” అని రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు.
( పైన జెరిగిన కథ గురించి పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని నిజంగా వాల్మీకి మహర్షి రచించార, లేక ఎవరన్నా రచించి రామాయణంలోకి చొప్పించార? ప్రధాన పాత్ర ప్రవేశించినప్పుడు వాల్మీకి మహర్షి ఆ పాత్ర గురించి తగినంత పరిచయము, వివరణ ఇస్తారు. కాని ఇక్కడ రావణ పాత్ర గురించి ఎలాంటి పరిచయము లేకుండానే కథ సాగిపోయింది. అలాగే మారీచుడు చెప్పగానే అంత బేలగా రావణుడు తిరిగి వచ్చేస్తాడ? కేవలం ఒక రాక్షసుడు చెప్పిన కథనాన్ని విని రావణుడు సీతాపహరణం చెయ్యడానికి వెళతాడ? శూర్పణఖ ఆకాశమార్గంలో లంకకి వెళితే, అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. దీని ప్రకారం శూర్పణఖ ముందు వెళ్ళాలి, కాని అకంపనుడే ముందు వెళ్ళాడు. ఇవన్నీ వాల్మీకి రచనాశైలితో విభేదిస్తున్నట్టు కనబడడం చేత కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఈ సర్గలు బహుశా రామాయణంలోనివి కాకపోవచ్చు అన్నారు. కనుక వీటిని వివాదాస్పద సర్గలుగా ప్రకటించారు. అవునా, కాదా అన్నది ఆ పరమేశ్వరుడికే తెలియాలి.) ఇక కథ ప్రకారంగా చూస్తే.
అకంపనుడు వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ లంకా పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్టు, ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. ఆ రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కింపురుషుల చేత సంహరింపబడడు. ఆ సభలో నోరు తెరుచుకొని ఉన్న రావణాసురుడిని చూస్తే, నోరు తెరిచి మీదకి వస్తున్న యమధర్మరాజు జ్ఞాపకంవస్తాడు.
దేవ అసుర విమర్దేషు వజ్ర అశని కృత వ్రణం |
ఐరావత విషాణ అగ్రైః ఉత్కృష్ట కిణ వక్షసం ||
వింశత్ భుజం దశ గ్రీవం దర్శనీయ పరిచ్ఛదం |
విశాల వక్షసం వీరం రాజ లక్ష్మణ లక్షితం ||
దేవతలతో అనేకసార్లు యుద్ధాలు చెయ్యడం వలన, ఆయన గుండెల మీద ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలు ఉన్నాయి. అలాగే ఐరావతం తన దంతాల చేత కుమ్మినప్పుడు తగిలిన గాయాలు కూడా కనబడుతున్నాయి. ఆ రావణాసురుడు 20 చేతులతో, 10 తలకాయలతో, విశాలమైన వక్షస్థలంతో ఉన్న మహావీరుడైన ఆ రావణుడు రాజులకి ఉండవలసిన లక్షణాలతో శోభిస్తున్నాడు. బాగా కాల్చిన బంగారపు కుండలములు పెట్టుకున్నాడు, విశాలమైన భుజాలతో ఉన్నాడు, తెల్లటి పళ్ళతో, పర్వతమంటి నోటితో ఉన్నాడు. శ్రీమహా విష్ణువు యొక్క చక్రము చేత కొట్టబడ్డప్పుడు తగిలిన దెబ్బలు ఆయన శరీరం మీద ఉన్నాయి, అలాగే మిగిలిన దేవతల ఆయుధముల దెబ్బలు వాడి ఒంటి మీద ఉన్నాయి. అంతమంది దేవతల యొక్క దెబ్బలు తిన్నా ఆయన ఎప్పుడూ క్షోభించలేదు. ఆయన అప్పుడప్పుడు సముద్రాలని కలయతిప్పుతూ ఉంటాడు. ఆయన పర్వతాలని విసురుతూ వ్యాయామం చేసేవాడు. కావాలని వెళ్ళి దేవతలతో యుద్ధం చేసేవాడు. ఎక్కడన్నా ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటె, వాళ్ళని హింసిస్తాడు. ఇతరుల భార్యలని బలవంతంగా తీసుకొచ్చి అనుభవించడం ఆయనకి చాలా ఇష్టం.
అలాగే ఆయనకి అనేక రకములైన అస్త్రములను ప్రయోగించడం తెలుసు, ఆ అస్త్రములను ఉపసంహరించడం కూడా తెలుసు. ఎవరన్నా యజ్ఞాలు చేస్తుంటే, తనకున్న శక్తితో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు. ఒకసారి పాతాళంలో ఉన్న వాసుకిని ఓడించాడు, అలాగే తక్షకుడి భార్యని తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. కైలాసంలో కుబేరుడితో యుద్ధం చేసి ఆయన దెగ్గర ఉన్న పుష్పక విమానాన్నితెచ్చుకున్నాడు( కుబేరుడు స్వయంగా రావణుడికి అన్నయ్య. కాకపోతే కుబేరుడు మొదటి భార్య కొడుకు, రావణుడు రెండవ భార్య కొడుకు). ఉత్తర భారతంలో చైత్రరథం అనే అందమైన వనం ఉందని ఎవరో చెబితే, రావణుడు అక్కడికి వెళ్ళి, ఇంత అందమైన వనం నాకు లేనప్పుడు ఎవరికీ ఉండకూడదని ఆ వనాన్ని నాశనం చేశాడు. అలాగే స్వర్గలోకంలోని నందన వనాన్ని నాశనం చేశాడు. అప్పుడప్పుడు ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుల గమనాన్ని ఆపుతాడు.
రావణుడు బ్రహ్మదేవుడి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన పది తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నమై ఏమి కావాలి అని అడుగగా.
దేవ దానవ గధర్వ పిశాచ పతగ ఉరగైః |
అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాద్ ఋతే ||
” నేను పాముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత, ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు ” అని అడిగాడు, కాని రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. యజ్ఞములలో దేవతలకి సమర్పించే సోమరసాన్ని ఆయన అపహరించేవాడు. ఎక్కడన్నా యజ్ఞం పూర్తవబోతుంది అనగా, అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడం రావణుడికి బాగా ఇష్టం. సర్వకాలములయందు దుష్ట ప్రవర్తనతోనే ఉంటాడు. ( ఒకసారి రావణుడు కైలాశ పర్వతాన్ని లేపాలని చూస్తే, పరమశివుడు తన బొటను వేలితో ఆ పర్వతాన్ని కిందకి తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులూ ఆ పర్వతం కిందనే ఉండడంచేత రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలని భయకంపితులని చేసేవిధంగా అరిచాడు కనుక(రవం చేశాడు కనుక) ఆయనని రావణ అని పిలిచారు.)
రావణం సర్వ భూతానాం సర్వ లోక భయావహం | రాక్షసీ భ్రాతరం క్రూరం సా దదర్శ మహాబలం ||
రావణాసురుడు సర్వ లోకములకు, సర్వ ప్రాణులకు భయంకరుడు. అలాంటి రావణుడు మంత్రుల చేత పరివేష్టితుడై ఉండగా, శూర్పణఖ భయపడుతూ ఆయన దెగ్గరికి వెళ్ళి “నువ్వు ఎప్పుడూ గ్రామ్యమైన భోగములని అనుభవిస్తూ ఉంటావు. కామమునకు క్రోధమునకు వశపడిపోయావు. నీకు రాజ్యపాలనం మీద ఇష్టం లేదు, సరైన గూఢచారులని నియమించుకోలేదు. నీ రాజ్యంలో ఏమి జెరుగుతుందో నీకు తెలియడం లేదు. స్మశానంలో ఉన్న అగ్నిని ఎవరూ ముట్టుకోనట్టు, సింహాసనం మీద కూర్చున్న నీలాంటి వాడిని చూసి ప్రజలు దెగ్గరకి రారు. నీ గూఢచారులు ఎక్కడ ఏమి జెరుగుతుందో తెలుసుకోరా?, తెలుసుకున్నా నీకు వచ్చి చెప్పరా?, చెప్పినా నువ్వు బాధపడవా?. రోజురోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు మాత్రం కామంతో కళ్ళు మూసుకుని ఉండిపోయావు. ఒకసారి కాని నువ్వు రాజ్యభ్రష్టుడివి అయ్యావంటే, అవకాసం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు. నీ కీర్తి అంతా సముద్రంలో ఉన్న పర్వతంలా, ప్రకాశించడం మానేస్తుంది.
నువ్వు దండకారణ్యంలో మునులని హింసించమని 14,000 మంది రాక్షసులని పెట్టావు. కాని, ఒక్క రాముడు భూమి మీద నిలబడి ఇంతమందిని చంపేశాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, కొద్దికాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది ” అనింది.
శూర్పణఖ మాటలు విన్న రావణుడు ” అసలు ఆ రాముడు ఎవరు? అరణ్యానికి ఎందుకొచ్చాడు? ఆయన దెగ్గర ఉండేటటువంటి ఆయుధములు ఏమిటి? రాక్షసులని ఎందుకు చంపాడు? నీ ముక్కు చెవులను ఎవరు కోశారు? నువ్వు చూసింది చూసినట్టు నాకు చెప్పు ” అన్నాడు.
దీర్ఘబాహుః విశాలాక్షః చీర కృష్ణ అజిన అంబరః |
కందర్ప సమ రూపః చ రామో దశరథ ఆత్మజః ||
అప్పుడా శూర్పణఖ ” రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునులలాగ నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మధుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనుస్సుని పట్టుకొని, నారాచ బాణములను సంధిస్తే, అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగ ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు, కాని రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురిచూసి వదిలాడో నేను చూడలేదు. కాని రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణములయందు, తేజస్సుయందు సమానమైనవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు.
రామస్య దక్షిణే బాహుః నిత్యం ప్రాణో బహిః చరః |
ఆ లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా, బయట తిరుగుతున్న ప్రాణంలా సర్వకాలములయందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత, ఆమె పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. విశాలమైన నేత్రములు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని అపారమైన ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో ఉంటుంది, అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది, ఎంతో కాంతివంతంగా ఉంటుంది, ఆవిడ సాక్షాత్తు ఇంకొక శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది, ఎర్రటి రక్తం లోపలినుంచి కనబడుతున్నటువంటి తెల్లటి గోళ్ళతో ఉంటుంది, పద్మంలాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరులకి, దానవులకి చెందినదికాదు, ఆమె నరకాంత. కాని ఈ భూమండలంలో నేను ఇప్పటివరకూ అటువంటి సౌందర్యరాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢలింగనం చేసుకుంటుందో, ఎవడు సీతకి భర్త అని అనిపించుకుంటాడో, వాడే మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు, వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు.
నాకు ఆ సీతని చూడగానే, ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే, ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్యా. నువ్వు కాని సీతని చూస్తే, మన్మధ బాణాలకి వసుడవయిపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటె, ఇంక ఆలోచించకుండ వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు ” అనింది.
శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి ” ఇక మీరు బయలుదేరండి ” అన్నాడు. అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గం మీదుగా పయనమయ్యాడు. అలా వెళుతుండగా ఆయనకి ఒక పెద్ద వట వృక్షం కనబడింది.(తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చెయ్యడానికని, గరుక్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరేముందు తన తండ్రి అయిన కశ్యపుడినిఅడిగాడు, నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని. అప్పుడా కశ్యపుడు ” నువ్వు హిమాలయ పర్వతాలకి దెగ్గరగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది, ఆ సరోవరం ఒడ్డున రెండు గజకచ్ఛపాలు కొట్టుకుంటూ ఉంటాయి. అవి ఒక తాబేలు ఒక ఏనుగు. పూర్వకాలంలో, ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంత కాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి, ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవ్వమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడువు ఉంటుంది. ఏనుగు తాబేలుని బయటకి లాగాలని చూస్తుంటుంది, తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగెయ్యాలని చూస్తుంది, అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండడంలేదు. కనుక ఆకలి వేస్తే ఆ రెండిటినీ తినేసెయ్యి ” అని కశ్యప ప్రజాపతి అన్నాడు. గరుక్మంతుడు సరే అని బయలుదేరాడు, అలా వెళుతూ వెళుతూ ఆ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్ళతో పైకి ఎత్తి, న్యగ్రోధం అనే మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్ఛపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా, గరుక్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజకచ్ఛపాలని ఒక పర్వతం మీద పెట్టుకొని తినేశాడు. ఆ తరువాత ఇంద్రుడి దెగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. ఆనాడు గరుక్మంతుడు ఆ గజకచ్ఛపాలని పెట్టినది ఈ వృక్షం మీదనే). రావణుడు ఆ న్యగ్రోధం అనే వృక్షాన్ని చూసి, కిందకి దిగి చుట్టూత చూసేసరికి, ఆయనకి ఒక తాపస ఆశ్రమం కనబడింది.
అప్పుడాయన ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా, అందులో నారచీర కట్టుకొని, జటలు వేసుకొని, నియమముతో ఆహారాన్ని తింటున్నటువంటివాడై, ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనబడ్డాడు. అప్పుడా రావణాసురుడు ” ఓ మారీచా! నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నీవంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు. నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యాలి. నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాల్ని, యజ్ఞాలని నాశనం చెయ్యమని చెప్పాను.  నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడినుంచో రాముడు వచ్చి ఖరుడిని, దూషనుడిని, త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని మరియు 14,000 రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనస్సుకి ఎంత బాధగా ఉందో తెలుసా. రాముడు కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాలని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణులను భయపెట్టేవాడు, దశరథుడికి అసహ్యం వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు, అందుకని నేను రాముడిని బాధపెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధపెట్టిన రాముడిని బాధపెట్టడానికి ఆయన భార్య అయిన సీతని అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అందుకని ఏ యుద్ధమూ చెయ్యకుండా పని జెరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడది నీకు చెబుతాను విను. నీకు సమస్త మాయలు తెలుసు కనుక, నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటిమీద వెండి చుక్కలు ఉండాలి, ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటూ ఇటూ ఆడు. అప్పుడు సీత నిన్ను చూసి, ఆ మృగం కావాలి అని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు, అప్పుడు నువ్వు అదృశ్యమవుతూ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపో, అలా కొంత దూరం వెళ్ళాక హా! సీత, హా! లక్ష్మణా అని రాముడి కంఠంతో అరువు. రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని, రాహువు చంద్రుడిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారిపో ” అన్నాడు.
ఈ మాటలు విన్న మహాత్ముడైన మారీచుడు, దేవతలు కనురెప్ప వెయ్యకుండా ఎలా నిలుచుంటారో అలా నిలుచుండిపోయాడు. శవం నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు. తరువాత ఆయన అన్నాడు.
సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః |
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||
” రావణా! మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కాని వాళ్ళు మనన్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది, కాని ఆ మాటలలో అవతలివారి అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు, ఒకవేళ అలాంటివాడు దొరికినా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్షకట్టి నీ ప్రాణములు తియ్యాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్నీ అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహా ధర్మాత్ముడు, మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమము ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమము ఉంది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా, తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కొసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానము వస్తుంది, సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని, రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికని భూమిమీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు, నీతోపాటుగా లంకా పట్టణం నశించిపోతుంది, రాక్షసులందరూ భూమిమీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు, ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసనుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి, ఇంత చపలబుద్ధితో ఉండకూడదు.
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః |
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః ||
ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట పోసి, దానికి ప్రాణం పోస్తే, ఆయనే రాముడు. సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. రాముడు ఈ లోకములన్నిటికి రాజు. అటువంటి రాముడి జోలికి వెళితే నువ్వు నాశనమయిపోతావు. నీకు తెలియక సీతమ్మని తీసుకొస్తాను అంటున్నావు, ఆమె బూది కప్పిన నిప్పు, తన తేజస్సుతో తనని రక్షించుకోగలదు. ఆమె కారణజన్మురాలు. రాముడి యొక్క కోదండం నీడలో రక్షింపబడుతున్న సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ! ఆవిడని అపహరించడానికి నీ శక్తి సరిపోదు.
జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం |
యత్ ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం ||
నీకు రాజ్యం ఉంది, నిన్ను కామించన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే, రాముడి పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. నీకు ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో, నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి, బంగారు కుండలాలు పెట్టుకొని, వర గర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగం చేస్తుంటే, నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో, అప్పుడు నాకంత పొగరుండేది.
అజాత వ్యంజనః శ్రీమాన్ బాలః శ్యామః శుభేక్షణః |
ఏక వస్త్ర ధరో ధన్వీ శిఖీ కనక మాలయా ||
నేను కిందకి చూసేసరికి, మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని, పద్మములవంటి కన్నులున్న, ఒక్క వస్త్రం కట్టుకుని, చేతిలో కోదండం పట్టుకొని, పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది, వీడా నన్ను చంపేవాడు అని, నువ్వు ఇప్పుడు ఎలా అనుకున్నావో నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడివంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుంచి నాకు రాముడన్నా, రామబాణం అన్నా హడల్.
పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్నా, అధర్మాత్ముడితో స్నేహంపెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళమాకు నాశనమయిపోతావు.
ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళి అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళి కనబడడులే అని ఒక పెద్ద మృగ రూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసులని చంపి, వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి, అక్కడున్న తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకుని, సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు, ఇప్పుడాయన ఒక తాపసి కనుక నేను తినేయ్యచ్చు అనుకొని, నా స్నేహితులిద్దరిని ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని రెండు బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపెస్తాడని, ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేసాను. అప్పటినుంచీ నాకు నిద్రలో రాముడు కోదండం పట్టుకొని కనపడుతున్నాడు, నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అందుకని ఇక చంపడాలు మానేసి, నారచీర కట్టుకుని, శాఖాహారం తింటూ, తపస్సు చేసుకుంటున్నాను.
అలా నేను ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటకి వస్తే, ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డిపరక మీద, భూమి మీద, నీటి మీద, ప్రతీ చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనపడుతుంటాడు. అందుకని నేను బయటకి కూడా వెళ్ళడం లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా, తెరిచినా రాముడే కనపడుతున్నాడు. నాకు అంతా రామమయమై కనపడుతుంటే, నేను ఎవరిని బాధపెట్టను, ఎవరి జోలికి వెళ్ళను? రావణా! ఇవ్వాళ నా పరిస్థితి ఏంటో తెలుసా, నా దెగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందామనో, లేకపోతే రత్నము అని అందామనో, ‘ర’ అని పలుకగానే, వారు తరువాత ‘మ’ అంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటె, యుద్ధం చేసుకో, నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండిటిలో ఏదో ఒకటి చెయ్యి, ఇందులోకి నన్ను మాత్రం లాగకు.
ప్రతీసారి మా చెల్లి ముక్కు చెవులు కోసేసాడు అంటున్నావు కదా, అసలు మీ చెల్లి ఏమి చేసిందని ఆవిడ ముక్కు చెవులు కోసేసారో అని మీరెవరన్నా అడిగార. ఇలా అడగకుండా వెళ్ళిన ఆ ఖరుడు మరణించాడు. నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నామాట విని ఇటువంటి పనులు చెయ్యకు ” అని మారీచుడు అన్నాడు.
మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటం వలన రావణుడు ఇలా అన్నాడు ” అన్ని గొప్పలు చెబుతావేంటి రాముడి గురించి, రాముడు కేవలం ఒక మనిషి, నాదెగ్గర రాముడిని పొగడద్దు, నా నిర్ణయం మారదు. ఖరుడు వెళ్ళిన మార్గంలోనే రాముడిని కూడా పంపుతాను. నీ సహాయంతోనే సీతని ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతని అపహరించడం కోసమని జింక వేషం వెయ్యమన్నాను. అంతేకాని ఇందులో అపాయం ఉందా లేదా అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు. నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువు నీ దెగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, అడిగిన ప్రశ్నకి అంజలి ఘటించి జవాబు చెప్పడం నీ బాధ్యత, ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. రాజు అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు అనే 5 రూపాలలో ఉంటాడు. నువ్వు నా మాట వింటే, నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను, కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో చస్తావో లేదో అన్నది అనుమానమే, కాని వెళ్ళనంటే మాత్రం నేను నిన్ను చంపేస్తాను ” అన్నాడు.
అప్పుడు మారీచుడు ” రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే, మంత్రులైన వారు చుట్టూ చేరి నిగ్రహించాలి, అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్నవాడిని పాశములతో పట్టే స్థితిలో మంత్రులు లేకపోతే, ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజె ధర్మం, రాజె జయం, రాజు వల్లనే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిననాడు లోకంలో రక్షణ ఉండదు, ఆ రాజుని ఆశ్రయించిన వారెవరూ బ్రతకరు.
స్వామినా ప్రతికూలేన ప్రజాః తీక్ష్ణేన రావణ |
రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా ||
రాజన్నవాడు ప్రజల వెనకాల ఎలా ఉండాలంటే, కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండనివాడు ఆవుల వెనకాల వచ్చిన నక్కలాంటి వాడు. అలాంటివాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు, ఆ రాక్షసులూ నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి, రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక, నా కొనప్రాణం వరకూ నువ్వు చెప్పిన పనిని చెయ్యడానికి ప్రయత్నిస్తాను, కాని సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే, నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను, ఆ తరువాత సీతమ్మని తెచ్చి, నువ్వు సకల బంధుపరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో, అప్పుడే నా ప్రాణాలు పోయాయి, ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ, ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడంలేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పద ” అని అన్నాడు.
రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్లకలువ రంగులో, సగం ఎర్రకలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్ళతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకూ ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది, గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ, అటూ ఇటూ పరుగులు తీస్తూ, అక్కడున్న మృగాల దెగ్గరికి వెళుతూ, మళ్ళి తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
కాని మారీచుడు మిగతా మృగాల దెగ్గరికి వెళ్లేసరికి, అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవవృక్షం యొక్క పూవులు కోస్తుంటే, ఆవిడకి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి ” రామా! లక్ష్మణా! మీరు మీ ఆయుధములను ధరించి గబగబా రండి ” అనింది. రామలక్ష్మణులు వచ్చాక, సీతమ్మ వాళ్ళతో ” ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశార, ఎంత అందంగా ఉందో. సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు. అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా, వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు.
శంకమానః తు తం దృష్ట్వా లక్ష్మణో రామం అబ్రవీత్ |
తం ఏవ ఏనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం ||
” అన్నయ్యా, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది, వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి, భుజించాడు. నామాట నమ్ము, ఇది కచ్ఛితంగా మారీచుడి మాయ ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో ” ఆర్యపుత్రా! నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది, నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింపచేసినట్టు, ఒంటి మీద రాత్నాలలాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి, వాటితో పాటు ఈ జింక కూడా ఉంటె నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం, మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంక కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళి పోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకొనివెళదాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపచేస్తుంది. మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి ‘ అబ్బ, ఏమి మృగం వదిన ‘ అంటాడు, అత్తగార్లు అందరూ చూసి ‘ అబ్బ, ఏమి మృగం ‘ అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే, దాని చర్మాన్ని ఒలుచుకొని, లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే, ఎంతబాగుంటుందో. రామ! నేను స్త్రీని కావడం చేత, ఏదన్నా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ‘ ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే ‘ అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడాన. అలా మాట్లాడితే ఏమి అనుకోకండె ” అనింది.
అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి ” లక్ష్మణా! మీ వదిన ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో ఏమి అడగలేదు. మొట్టమొదటి సారి ఈ జింకని అడుగుతుంది. ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందొ మీ వదిన మాటలలో స్పష్టంగా అర్ధమవుతోంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే, తీసుకురాను అని నేను ఎలా అనగలను. అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకొని తీసుకువస్తాను. ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే, దాని శరీరాన్ని అయినా తీసుకువస్తాను. మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి రెండే ఉన్నాయి, ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది ( దీని అర్ధం ఏంటంటే, చంద్రుడిలో ఎటువంటి మృగం ఉండదు, అలాగే భూమి మీద ఇది ఉందంటే, ఈ రెండూ మాయె అని అర్ధం). ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడె అయితే నేను వాడిని సంహరిస్తాను. లక్ష్మణా! చాలా జాగ్రత్త సుమా. ప్రతి క్షణమూ నువ్వు శంకిస్తూనె ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి ” అని చెప్పి, రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్ళాడు.
జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ, మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు, కాని రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్ధానమయిపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా, మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్ళి కనపడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని, ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కొదండానికి సంధించి, బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడా మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా ” హా! సీత, హా! లక్ష్మణా ” అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులోనుంచి నీరు బయటకి వస్తే ఎలా ఉంటుందో, అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు.
ఆ దృశ్యాన్ని చూశిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకువచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకువచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కాదా అని బెంగపెట్టుకొని, అక్కడున్నటువంటి రెండు మృగాలని సంహరించి, వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి ‘ హా! సీత, హా! లక్ష్మణా ‘ అనే కేక సీతమ్మ చెవినపడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి ” చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. ‘ హా! సీత, హా! లక్ష్మణా’ అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో, ఇవ్వాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు ” అని అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” వదినా! నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు ” అని అన్నాడు.
తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అన్న బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి ” నాకు ఇప్పుడు అర్ధమయ్యింది నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటె నువ్వు ఇంత సంతోషంగా కుర్చోగలుగుతున్నావు. నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండడమే. అందుకే, రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే వచ్చావు. నీ ముఖంలో ఒక గొప్ప నమ్మకం, హాయి కనపడుతున్నాయి. శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతువిని ఇంత హాయిగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు 13 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావు. మహాపాపి! ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా. నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక, రాముడికి సేవ చెయ్యడానికే వచ్చినవాడివి అయితే, రాముడు అరణ్యంలో ‘ హా! సీత, హా! లక్ష్మణా ‘ అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కుర్చోగాలవా, నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడడం కోసం పరుగెత్తేవాడివి. బహుశా భరతుడే నిన్ను పంపాడేమో, మీ ఇద్దరు కలిసి కుట్ర చేశారు ” అనింది.
తన రెండుచేతులతో సీతమ్మకి అంజలిఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు ” దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులంతా ఒకపక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా ఆయనని ఎవరూ నిగ్రహించలేరు. అన్నయ్య పరాక్రమమేమిటో నాకు తెలుసు. వదినా! ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకొని మాట్లాడుతున్నావు, అరిచినది మయా మారీచుడు, అన్నయ్య అరవలేదు. నామాట నమ్ము.
న సస్ తస్య స్వరో వ్యక్తం న కశ్చిత్ అపి దైవతః |
గంధర్వ నగర ప్రఖ్యా మాయా తస్య చ రక్షసః ||
నేను యదార్ధం చెబుతున్నాను, అది అసలు మా అన్నయ్య అరుపే కాదు. మాయావి అయినవాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో, అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయేముందు ఒక మాయావి అరిచాడు. మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెళతావు. అందుకని నువ్వు బెంగపెట్టుకోకు. నువ్వు అలా చూస్తూ ఉండు, అన్నయ్య కోదండం పట్టుకొని వచ్చేస్తాడు. ఆ మాయ మృగం చర్మంతో వస్తాడు. అన్నయ్య వెళ్ళేముందు, వదినని నీకు అప్పజెప్పి వెళుతున్నాను ప్రతి క్షణాన్ని సంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు. నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళితే, అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నిలుచున్నాను తప్ప నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు వదినా. నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు. నిన్నగాక మొన్న ఖర దూషణులతో కలిపి 14,000 మంది రాక్షసులని అన్నయ్య చంపాడు. అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయా స్వరూపంతో ఇవ్వాళ ప్రవర్తించారు. నా మాట నమ్ము, ఆ అరుపులని నమ్మకు ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” నాకు అర్ధమయ్యిందిరా మహా పాపి! కృరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ద్రువపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు, నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కాని నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇందీవరశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటె నువ్వు నా దెగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాళ. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది ” అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని ” వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, కాని నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమి చెప్పుకొని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు, భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది. కాని నన్ను ఇన్నిమాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు.
వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక, ఓ వనదేవతలార! మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినా! నేను రాముడి దెగ్గరికి వెళుతున్నాను, నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను ” అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ ” అమ్మా! నేను మళ్ళి తిరిగొచ్చి, మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే, మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా….” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” పాపిష్ఠివాడ, నువ్వు ఇంకా వెళ్ళకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను. కదులుతావ కదలవా ” అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది.
అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు.
అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక(సాధువు) వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి, అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది.
అలా ఆ రావణుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళి ” నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మములవంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యదేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా. నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి.” అంటూ సీతమ్మని కేశములనుండి పాదముల వరకూ ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే ” చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు, నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం, ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు, నువ్వు తొందరగా ఇక్కడినుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి, అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి ” అన్నాడు. ( ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దెగ్గరికి వచ్చి, ఆమె అందాన్ని పొగుడుతూ, తనని తాను పొగుడుకుంటూ, ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగ ఆనాడు రావణుడు మాట్లాడాడు.)
కాని సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన, రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో, అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్య పాద్యములు ఇచ్చింది.
సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిధ్దపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు.
అప్పుడా సీతమ్మ ” నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని. రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను( సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది). కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు.
మమ భర్తా మహాతేజా వయసా పంచ వింశకః ||
అష్టా దశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||
అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు  ” అని చెప్పి  ” ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు ” అని అడిగింది.
అప్పుడా రావణుడు ” సీత! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దెగ్గరి నుంచీ, ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడంలేదు, అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే, నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే, 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను ” అన్నాడు.
రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ ” రావణా! నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహా సముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో, అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప, నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో, నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దెగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో, నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో, పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుగ్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో, రాముడికి నీకు అంత తేడా ఉంది ” అని అనింది.
అప్పుడా రావణుడు ” నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని, ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి, ఆ కుబేరుడిని లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళి ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే, ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి, రాజ్యం లేక, అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి. నా దెగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు నీ అదృష్టం, నా కన్ను నీ మీద పడింది, నన్ను నువ్వు పొందు ” అని గర్వంగా అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” కుబేరుడి తమ్ముడిని అంటావు, పదిమంది నిలేదీసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గువెయ్యటం లేదా. ఎందుకురా ఈ ప్రవర్తన నీకు. పద్దాక రాముడు పనికిమాలినవాడు అంటున్నావు, మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు. రాముడు వచ్చేవరకు అలా నిలబడు చూద్దాము ” అనింది.
అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి, తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో, కుండలాలతో మెరిసిపోతున్నాడు, ఆకాశం నుండి దిగి వచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడాయన ” నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు, నిన్ను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతానో చూడు ” అని, అపారమైన కామంతో కన్ను మిన్ను కానక, భయపడుతున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని, కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి, ఆవిడని పైకి ఎత్తాడు. పైకి ఎత్తి ఆశ్రమం బయటకి వచ్చాడు. అప్పటివరకూ ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమయ్యి భూమి మీదకి దిగింది.
ఆడ త్రాచుపాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ, రథంలో బలవంతంగా తన తొడల మీద కుర్చోపెట్టుకున్నాడు. అప్పుడాయన రథాన్ని బయలుదేరు అనేసరికి, ఆ రథం బయలుదేరింది. ఆకాశమార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ ” రామ, రామ, మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు. నా కేక మీకు ఎలా వినబడుతుంది. ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మంకోసమని జీవితాన్ని, రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ! నీ భార్యని ఇవ్వాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు కాదా. లక్ష్మణా! సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండేటటువంటివాడ, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కాదా. రక్షించండి, రక్షించండి ” అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తోంది. అలాగే ” ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరీ మీ అందరూ దయచేసి వినండి. నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త రాముడికి తెలియచెయ్యండి ” అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తొడ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే, 20 బాహువులతో ఆడ త్రాచుని నొక్కినట్టు నొక్కి తన తోడ మీద కుర్చోపెట్టుకున్నాడు.
అలా రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే, అక్కడే చెట్టు మీద కూర్చొని ఉన్న వృద్ధుడైన జటాయువుకనబడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరాలు. అప్పుడా జటాయువు ” దుష్టుడైన ఓ రావణా! నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి, అరణ్యాలకి వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కాని, అర్ధంలో కాని, కామంలో కాని ఎలా ప్రవర్తించాలి అని అనుమానమొస్తే, తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి, వాళ్ళు అలాగే బ్రతుకుతారు. రాజె ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికిమాలినవాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు, నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను వృద్ధుడిని, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావ. నా ప్రాణములు ఉన్నంతవరకూ నువ్వు సీతమ్మని తీసుకెళ్ళకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలు అంటె ఏంటో చూద్దువు ” అని పెద్ద పెద్ద రెక్కల ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు.
తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు, ఆయన మీదకి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నా, ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేసాడు. తరువాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి, రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి, బాణాలు కింద పడిపోయాయి. మళ్ళి ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. అప్పుడాయన తన వాడి ముక్కుతో ఆ రథసారధి శిరస్సుని కోసేసాడు. తన కాళ్ళ గోళ్ళతో ఆ రథానికి ఉన్న పిశాచాల్లాంటి గాడిదలని సంహరించాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో కిందపడిపోయాడు. అలా పడిపోతు పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ చంకలో దూర్చి పట్టుకున్నాడు.
ఇది చూశిన జటాయువుకి ఎక్కడలేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కిందపడిపోయింది.  రావణుడికి మళ్ళి ఆ 10 చేతులు పుట్టాయి. అప్పుడా రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదకి వస్తున్న జటాయువు యొక్క రెండు రెక్కలని, కాళ్ళని నరికేశాడు.
అప్పుడా జటాయువు ఒంట్లోనుంచి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది. అప్పుడా జటాయువు అదుపుతప్పి ఒక చెట్టు దెగ్గర పడిపోయాడు. తనకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి, జుట్టంతా విరజిమ్ముకు పోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సేతమ్మని చూసి రావణుడు ” జటాయువు కోసం ఏడుస్తావే, రా ” అని సీతమ్మ వెనక రావణుడు పరుగుతీసాడు. అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడున్న లతలని, చెట్లని కౌగిలించుకుంది.
అప్పుడా రావణుడు అక్కడికి వెళ్ళి ” చెట్లని, లతలని కౌగలించుకుంటావే, రా ” అని, ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు, చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే, ప్రపంచాన్నంతటిని అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడాయన తన దివ్య నేత్రంతో చూసి ” ఒరేయ్, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవ్వాళ మూటకట్టుకున్నావురా ” అన్నారు.
రావణుడు సీతమ్మ జుట్టు పట్టి, ఈడ్చుకొని తెచ్చి, తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఓడిసిపట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు, ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు, అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు.
ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కిందపడిపోయాయి, ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది, తిలకం పక్కకి తొలగిపోయింది. అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద 5 వానరాలు కనబడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని, తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి, అందులో తాను ధరించిన నగలని మూటకట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్ప వెయ్యకుండా ఆ 5 వానరాలు ఈ దృశ్యాన్ని చూశారు.
త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా |
మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా ||
రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది ” నువ్వు మాయా మృగాన్ని సృష్టించి, నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్టసంకల్పంతో ఆ మృగాన్ని ఆశ్రమంలోకి పంపించి, ఒక్కత్తిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది ఒక గొప్ప కార్యమని ఎవరూ అనరు. అలాగే ఇది యాద్రుచ్చికముగా జెరిగిన సంఘటన కాదు. ఇలా జెరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించావు. ఇలా చెయ్యడం నీ పరాక్రమానికి కాని, నీ తపస్సుకి కాని, ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కాని ఏవిధంగా నిదర్శనంగా నిలబడుతుంది. ఒక పరస్త్రీని ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు, ఇలా చెప్పుకోడానికి నీకు సిగ్గువెయ్యడం లేదా. నువ్వు నిజంగా అంత గొప్పవాడివి అయితే, రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, రాముడు ఉండగా ఎందుకు రాలేకపోయవు. నువ్వు చేసిన పని పెద్దలైనవారు, వీరులైనవారు అంగీకరించేటటువంటి పని కాదు. నన్ను ముట్టుకోవడం, నన్ను అనుభవించడం నువ్వు ఒక్కనాటికి చెయ్యగలిగే పని కాదు. కాని నన్ను ముట్టుకొని తేవడం వలన, నీ శరీరం పడిపోయాక నరకానికి తీసుకువెళ్ళి, చీము నెత్తురుతో ఉండే అసిపత్రవనంలొ పడేస్తారు, అలాగే ఘోరమైన వైతరణి నదిలో పడేస్తారు. ఇప్పుడు నన్ను పట్టుకున్నానని సంతోషపడుతున్నావు, రేపు నువ్వు చచ్చాక నరకంలో ఒంటి నిండా శూలాలుండే శాల్మలీ వృక్షాన్ని కూడా గట్టిగా పట్టుకుంటావు. నిన్ను పాశములతో కట్టేసి కాలము లాక్కొనిపోతుందిరా. నువ్వు ఎప్పుడైతే మహాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్నావో, ఆనాడే నీ జీవితంలో సుఖం అనేది పోయింది, నువ్వు మరణించడం తధ్యం ” అనింది.
సీతమ్మ చెప్పిన మాటలని ఆ రావణుడు విని, గాలికి వదిలేశాడు. తరువాత వారు సముద్రాన్ని దాటి, మయుడు మాయతో నిర్మించిన గంధర్వ నగరంలా ఉండే లంకా పట్టణాన్ని చేరి, తన అంతఃపురం దెగ్గర దిగాడు.
అబ్రవీత్ చ దశగ్రీవః పిశాచీః ఘోర దర్శనాః |
యథా న ఏనాం పుమాన్ స్త్రీ వా సీతాం పశ్యతి అసమ్మతః ||
తరువాత భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పిశాచ స్త్రీలని పిలిచి ” ఈ సీత అంతఃపురంలో ఉంటుంది, నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కాని, పురుషుడు కాని సీతని చూడడానికి వీలులేదు. నేను మిమ్మల్ని ఎవన్నా రత్నాలు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని తీసుకురండి అంటె, వేరొకరి అనుమతి లేకుండా నాకు తెచ్చి ఎలా ఇస్తారో, అలాగే ఈ సీత మణులు కాని, మాణిక్యములు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని అడిగితే, ఎవరి అనుమతి అవసరం లేకుండా వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి. ఈ సీతతో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కాని, తెలియక కాని సీత యొక్క మనస్సు నొచ్చుకుందా, ఇక వారి జీవితము అక్కడితో సమాప్తము ” అని వాళ్ళతో చెప్పి, తాను చేసిన ఈ పనికి చాలా ఆనందపడినవాడై అంతఃపురం నుంచి బయటకివెళ్ళి, నరమంసాన్ని తినడానికి అలవాటు పడిన కొంతమంది రాక్షసులని పిలిచి ” నేను చెప్పే మాటలని జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు జనస్థానంలొ ఖర దూషణుల నాయకత్వంలో 14,000 మంది రాక్షసులు ఉండేవారు. ఇప్పుడు ఆ రాక్షసులందరూ రాముడి చేతిలో నిహతులయిపోయారు, ఆ జనస్థానం ఖాళీ అయిపోయింది. అప్పటినుంచీ నా కడుపు ఉడికిపోతుంది. ఆ రాముడిని చంపేవరకు నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు ఉత్తరక్షణం బయలుదేరి అక్కడికి వెళ్ళండి, పరమ ధైర్యంగా ఉండండి. అక్కడ ఏమి జెరిగినా వెంటనే నాకు చెప్పండి ” అన్నాడు.
రావణుడి ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసులు జనస్థానానికి బయలుదేరారు. అప్పుడు రావణుడు అక్కడినుంచి బయలుదేరి అంతఃపురానికి వచ్చి, సీతని తెచ్చానని మనసులో చాలా ఆనందపడ్డాడు.
అశ్రు పూర్ణ ముఖీం దీనాం శోక భార అవపీడితాం |
వాయు వేగైః ఇవ ఆక్రాంతాం మజ్జంతీం నావం అర్ణవే ||
ఆ అంతఃపురంలో కళ్ళనిండా ఏడుస్తూ, చెంపల మీద ఆ కన్నీళ్ళు కారుతూ, అత్యంత దీనంగా, శోకం చేత పీడింపబడి, పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోతున్న నౌకలోని వారు ఎటువంటి దిగ్భ్రాంతికి లోనవుతారో, అటువంటి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉంది. వేటకుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడి పిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో, అలా సీతమ్మ తల దించుకుని ఏడుస్తూ ఉంది.
అలా ఏడుస్తున్న సీతమ్మని రావణాసురుడు బలవంతంగా రెక్కపట్టి పైకి తీసుకువెళ్ళి, తాను కట్టుకున్న అంతఃపురాన్ని, వజ్రాలతో నిర్మించిన గవాక్షాలని, దిగుడు బావులని, సరోవరాలని, తన పుష్పక విమానాన్ని, బంగారంతో తాపడం చెయ్యబడ్డ స్తంభాలని, ఆసనాలని, శయనాలని మొదలైనవాటిని సీతమ్మకి చూపించాడు. అలా తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక ” ఈ లంకలో ఉన్న బాలురని, వృద్ధులని లెక్కనుంచి మినహాయిస్తే, 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగు తీసేవారు 1000 మంది ఉంటారు. నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు, వీరందరూ నన్ను కోరి వచ్చినవారే. ఓ ప్రియురాల! నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏంటో తెలుసా, నాకున్న భార్యలందరికీ నువ్వు అధినాయకురాలివై నాకు భార్యగా ఉండు, నాయందు మనస్సు ఉంచు. సముద్రానికి 100 యోజనముల దూరంలో నిర్మింపబడిన నగరం ఈ కాంచన లంక. దీన్ని దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని, నాగులు కాని, పక్షులు కాని కన్నెత్తి చూడలేరు. ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు ఎవరు, తీసుకెళ్ళే వాడు ఎవరు?
రాజ్య భ్రష్టేన దీనేన తాపసేన పదాతినా |
కిం కరిష్యసి రామేణ మానుషేణ అల్ప తేజసా ||
ఇంకా రాముడు, రాముడు అంటావేంటి. ఆ రాముడు అల్పాయుర్దాయం కలిగినవాడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యములను పట్టి తిరుగుతున్నాడు, రాముడు కేవలం మనిషి, అటువంటి రాముడితో నీకేమి పని. నీకు తగినవాడిని నేను, అందుకని నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా, సంతోషంగా తిరుగు. హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చో, మళ్ళి పట్టాభిషేకం చేసుకుందాము. ఆ పట్టాభిషేకము చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిసి, నాతో కలిసి సకల ఆనందములు అనుభవించు. నువ్వు నీ జీవితంలో ఏదో గొప్ప పాపం చేసుంటావు, ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు, రాముడికి భార్యగా ఉండిపోయావు. నువ్వు చేసిన పుణ్యం వలన నాదెగ్గరికి వచ్చావు. నువ్వు ఈ అందమైన మాలలు వేసుకొని చక్కగా అలంకరించుకో, మనమిద్దరమూ పుష్పక విమానంలో విహారం చేద్దాము ” అన్నాడు.
ఏ ముఖాన్ని చూసి ఆ రావణుడు ఇలా హద్దులు మీరి మాట్లాడుతున్నాడో, ఆ ముఖాన్ని తన ఉత్తరీయంతో కప్పుకొని, సీతమ్మ తల్లి కళ్ళు ఒత్తుకుంటూ ఏడ్చింది.
ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ |
ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసో అహం అస్మి తే ||
ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన ఆ రావణుడు ” నీ పాదాలు పట్టుకుంటున్నాను సీతా, నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు ” అన్నాడు. ( రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక, సీతమ్మని ఇన్ని మాటలు అన్నా కొంతకాలమైనా బతికాడు.)
అప్పుడు సీతమ్మ, తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డిపరకని పెట్టి ” రాముడు ధర్మాత్ముడు, దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, విశాలమైన కన్నులున్నవాడు, ఆయన నా భర్త, నా దైవం. ఇక్ష్వాకు కులంలో పుట్టి, సింహం వంటి మూపు ఉండి, లక్ష్మణుడిని తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణములు పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉండు రావణా. నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటె, ఈ పాటికి నువ్వు ఖరుడి పక్కన పడుకొని ఉండేవాడివిరా. నీ ఆయువు అయిపోతుంది, నీ ఐశ్వర్యము పోతుంది, నీ ఓపిక అయిపోతుంది, నీ ఇంద్రియాలు కూడా పతనమయిపోతాయి, నీ లంకా పట్టణం విధవగా నిలబడడానికి సిద్ధంగా ఉంది, ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో జెరగబోతున్నాయి. నీటి మీద పట్టే నాచుని తినే నీటికాకిని, నిరంతరం రాజహంసతో కలిసి క్రీడించడానికి అలవాటుపడిన హంస చూస్తుందా. రాముడిని చూసిన కన్నులతో నిన్ను నేను చూడనురా పాపి, అవతలకి పో ” అనింది.
ఈ మాటలకి ఆగ్రహించిన రావణుడు ” నీకు 12 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నీ అంతట నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు. అలాకాకపోతే 12 నెలల తరువాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు ” అని చెప్పి, భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలని పిలిచి ” ఈమెని అశోక వనానికి తీసుకువెళ్ళండి. ఆమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి, బతికీ బతకడానికి కావలసిన ఆహారాన్ని, నీళ్ళని ఇస్తూ, శూలాలలాంటి మాటలతో ఈ సీతని భయపెట్టి నా దారికి తీసుకురండి. ఇక తీసుకువెళ్ళండి ” అన్నాడు.
వికృత నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపెడుతుంటే, అశోక వనంలో శోకంతో ఏడుస్తూ ఆ సీతమ్మ ఉంది.
ఇటుపక్క రామచంద్రమూర్తి మాంసం పట్టుకుని వస్తుంటే, విచిత్రంగా వెనకనుంచి ఒక నక్క కూత వినబడింది. అలాగే రాముడిని దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమ వైపు నుండి ప్రదక్షిణంగా తిరిగాయి. ఈ శకునాలని చూసిన రాముడు, సీతమ్మకి ఏదో జెరిగిందని భావించి గబగబా వస్తుండగా ఆయనకి ఎదురగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడిని చూడగానే రాముడి పైప్రాణాలు పైనే ఎగిరిపోయాయి.
అప్పుడాయన లక్ష్మణుడితో ” సీతని వదిలి ఎందుకు వచ్చావు. సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను. సీత క్షేమంగా ఉంటుందా? బతికి ఉంటుందా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఖర దూషణులని సంహరించాక రాక్షసులు నా మీద పగబట్టారు. మారీచుడు మరణిస్తూ ‘హా సీతా! హా లక్ష్మణా!’ అన్నాడు. సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది, అందుకని నువ్వు వచ్చావు. నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించడమైనా జెరిగుంటుంది, లేదా ఆమె కుత్తుక కోసి, ఆమెని తినెయ్యడం అయినా జెరిగుంటుంది. ఏదో ప్రమాదకరమైన పని జెరిగుంటుంది. లక్ష్మణా! నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు. నువ్వు రాకుండా ఉండి ఉండవలసింది. ఈ ముఖం పెట్టుకొని నేను అయోధ్యకి ఎలా వెళ్ళను. అందరూ వచ్చి సీతమ్మ ఏది అని అడిగితే, నేను ఏమని చెప్పుకోను. అరణ్యవాసానికి తనని అనుగమించి వచ్చిన సీతమ్మని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడు, అని అందరూ చెప్పుకుంటుంటే, ఆ మాటలు విని నేను ఎలా బతకను. నేను అసలు వెనక్కి రానే రాను. సీత ఆశ్రమంలో కనపడకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను.
ఏ సీత యొక్క ఓదార్పు చేత 13 సంవత్సరాల అరణ్యవాసాన్ని క్షణములా గడిపానో, ఆ సీత నా కంటపడనప్పుడు నాకు రాజ్యం అక్కరలేదు, అంతఃపుర భోగములు అక్కరలేదు. నువ్వు అయోధ్యకి వెళ్ళి, నేను చెప్పానని చెప్పి, భరతుడిని పట్టాభిషేకం చేసుకొని రాజ్యం ఏలమన్నానని చెప్పు. నా తల్లి కౌసల్యని సేవించు. నేను అయోధ్యకి తిరిగొస్తే, జనకుడు నన్ను చూసి ‘ రామ! నీకు కన్యాదానం చేశాను కదా, ఏదయ్యా సీతమ్మ’ అని అడుగుతారు, అప్పుడు నేను జనకుడి ముఖాన్ని ఏ ముఖంతో చూడను. సీతని వదిలి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించాను. కాని నా ఆజ్ఞని పాటించకుండా సీతని వదిలి నువ్వు ఒక్కడివీ ఎందుకు వచ్చావు ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్య! నా అంత నేనుగా రాలేదు, సీతమ్మని విడిచిపెట్టి రాలేదు. నీ మాటని పాటిద్దామని ప్రతిక్షణం సీతమ్మ దెగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను.
ఆర్యేణ ఏవ పరిక్రుష్టం – పరాక్రుష్టం – హా సీతే లక్ష్మణ ఇతి చ |
పరిత్రాహి ఇతి యత్ వాక్యం మైథిల్యాః తత్ శ్రుతిం గతం ||
కాని ఎప్పుడైతే అరణ్యంలోనుంచి నీ గొంతుతో ‘హా సీతా! హా లక్ష్మణా’ అన్న మాటలు సీతమ్మ విన్నదో, నీయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయవిహ్వల అయిపోయింది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, లక్ష్మణా వెళ్ళు, అని నన్ను ఒకటికి పదిమార్లు తొందరచేసింది. కాని మా అన్నయ్య అలా నీచంగా రక్షించండి అని ఒక్కనాటికి అరవడు, ఇది రాక్షస మాయ అని సీతమ్మకి చెప్పాను. కాని ‘నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి, నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యవాసానికి వచ్చావు’ అని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటె, నేను ఇంక తట్టుకోలేక బయలుదేరి వచ్చేశాను. నాయందు ఏ దోషము లేదన్నయ్య, నన్ను మన్నించు ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నువ్వు ఎన్నయినా చెప్పు లక్ష్మణా, సీతని ఒక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇలా రాకూడదు. నా మాటగా రాక్షసుడి మాట వినపడితే, సీత నిన్ను ఒకమాట అని ఉండవచ్చు, అంతమాత్రాన సీతని విడిచి వచేస్తావ. ఇప్పుడు సీత ఎంత ప్రమాదంలో ఉందో. నువ్వు కోపానికి లోనయ్యావు, అందుకని సీతని విడిచిపెట్టి వచ్చేశావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యను…….” అని అంటూ ఆ పర్ణశాల ఉండే ప్రదేశానికి చేరుకున్నారు.
రాముడు ఆ పర్ణశాలలో అంతా చూశాడు, కాని సీతమ్మ ఎక్కడా కనపడలేదు. అప్పుడాయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు, దెగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు, నదుల దెగ్గరికి వెళ్ళి చూశాడు, అక్కడే ఉన్న జింకల దెగ్గరికి వెళ్ళాడు, పెద్ద పులుల్ని, చెట్లని అడిగాడు. అలా ఏనుగు దెగ్గరికి వెళ్ళి ” ఓ ఏనుగా! నీ తొండం ఎలా ఉంటుందో సీత జెడ కూడా అలానే ఉంటుంది, నీకు తెలిసుంటుంది సీత ఎక్కడుందో, నాకు చెప్పవా ” అన్నాడు. దెగ్గర ఉన్న చెట్ల దెగ్గరికి వెళ్ళి ” సీత ఎక్కడుందో మీకు తెలిసుంటుంది, నాకు నిజం చెప్పరా ” అన్నాడు. అక్కడే ఉన్న జింకల దెగ్గరికి వెళ్ళి ” సీత మీతో ఆడుకునేది కాదా, సీతకి ప్రమాదం జెరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. నాకు సీత ఎక్కడ ఉందో చెబుతారా ” అన్నాడు. అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ ” అయ్యో, రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి, ఆమె రక్తాన్ని తాగేసి, మాంసాన్ని భక్షిస్తుంటే, ‘హా! రామ, హా! రామ’ అని అరిచి ఉంటుంది. ఎంత అస్త్ర-శస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమి చెయ్యగలిగాను, సీతని కాపాడుకోలేకపోయాను ” అని ఏడుస్తున్నాడు.
రాముడి బాధని చూసి లక్ష్మణుడు ” అన్నయ్యా! బెంగ పెట్టుకోకు, వదిన గోదావరి తీరానికి నీళ్ళు తేవడానికి వెళ్ళి ఉంటుంది. అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను ” అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు.
తిరిగొచ్చిన లక్ష్మణుడు ” సీతమ్మ ఎక్కడా కనపడలేదు ” అన్నాడు. అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది దెగ్గరికి వెళ్ళి ” గోదావరి! నిజం చెప్పు. ఎక్కడుంది సీత. నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు, కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు ” అన్నాడు.
భూతాని రాక్షసేంద్రేణ వధ అర్హేణ హృతాం అపి |
న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ ||
అక్కడున్న పంచభూతాలు జెరిగినది చూసాయి, కాని చెపుదాము అంటె, రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. అప్పుడా పంచభూతాలు గోదావరితో ” గోదావరి! సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పెయ్యి. రాముడి బాధ చూడలేకపోతున్నాము ” అన్నాయి. కాని రావణుడి దుష్ట చేష్టితములు, భయంకరమైన స్వరూపం, వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు. అక్కడున్న మృగాలు జెరిగినదాన్ని చెబుదాము అనుకున్నాయి, కాని అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి.
మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు ” అన్నయ్యా!  ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు. అవి కొంత దూరం పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, ‘మాకు చెప్పడం రాదు, నీకు అర్ధం అవ్వడం లేదా, మా వెంట రా’ అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళి పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటూ వైపు తీసుకెళ్ళారేమో అన్నయ్యా, మనకి ఆనవాలు దొరుకుతుంది, ఈ మృగాల వెనకాల వెళదాము ” అన్నాడు.
అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ మృగాల వెనుక పరుగు తీసారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనపడింది. అప్పుడు రాముడు ” మారీచుడు వచ్చేముందు నేనే సీత తలలో ఈ పూలదండ పెట్టాను. ఎవడో దురాత్ముడు సీతని భక్షించి ఉంటాడు. చూశావ ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి, రక్త బిందువులు కనపడుతున్నాయి, అంటె ఎవరో సీతని తినేశారు. ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనపడుతుంది, ఎవరిదో గొప్ప ధనుస్సు విరిగి కింద పడిపోయి ఉంది, ఎవరో ఒక సారధి కూడా కింద పడిపోయి ఉన్నాడు, పిశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో గెలిచినవాడు సీతని తీసుకెళ్ళి తినేశాడు.
సీత ఏ ధర్మాన్ని పాటించిందో, ఆ ధర్మం సీతని కాపడలేదు. ఎవడు పరాక్రమము ఉన్నా మృదువుగా ప్రవర్తిస్తాడో, వాడిని లోకం చేతకానివాడు అంటుంది. లక్ష్మణా! ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపము ఏమిటో. ఈ పర్వతం ముందు నిలబడి ‘సీత ఎక్కడుంది’ అని అడిగితే, నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటనే మళ్ళి ప్రతిధ్వనిగా పైకి పంపింది. ఇప్పుడే ఈ పర్వతాన్ని నాశనం చేసేస్తాను, నాకున్న అస్త్ర-శస్త్రములన్నిటిని ప్రయోగించి సూర్య చంద్రులని గతిలేకుండా చేస్తాను, ఆకాశాన్ని బాణాలతో కప్పేస్తాను, దేవతలు ఎవరూ తిరగడానికి వీలులేకుండా చేసేస్తాను, నదులలో, సముద్రాలలో ఉన్న నీటిని ఇంకింప చేసేస్తాను, భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాను, నా బాణాలతో భూమిని బద్దలుకొడతాను, రాక్షసులు అనే వాళ్ళు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేస్తాను, నా క్రోధం అంటె ఎలా ఉంటుందో ఈ దేవతలు చూస్తారు, మూడులోకాలని లయం చేసేస్తాను. సీత ఎక్కడున్నా, బతికున్నా మరణించినా, దేవతలు తీసుకువచ్చి నా పాదములకి నమస్కరించి ప్రార్ధన చేస్తే వదిలిపెడతాను, లేకపోతె ఇవ్వాళతో ఈ బ్రహ్మండాలని నాశనం చేసేస్తాను. వృద్ధాప్యం రాకుండా, మృత్యువు రాకుండా ఎవడూ ఎలా నిరోధించుకోలేడో, అలా క్రోధముర్తి అయిన నా ముందు నిలబడడానికి దేవతలకి కూడా ధైర్యం చాలదు. పడగోట్టేస్తున్నాను లక్ష్మణా……” అని కోదండాన్ని తీసి చేతిలో పట్టుకున్నాడు.
అప్పుడు లక్ష్మణుడు పరుగు పరుగున వచ్చి, అంజలి ఘటించి ” అన్నయ్యా! నువ్వు సర్వభూత హితేరతుడివి అన్న పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటివాడివి నువ్వు క్రోధమునకు వశమయిపోయి మూడులోకాలని కాల్చేస్తే, ఇంక లోకంలో శాంతి అన్న మాటకి అర్ధం ఎక్కడుంది అన్నయ్యా. ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని, వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నిటిని బాధపెడతావ అన్నయ్యా. నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. రాజు ప్రశాంతమూర్తుడై తగినంత శిక్ష వెయ్యాలి, అంతేకాని ఎవడో ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పీడిస్తావ. అన్నయ్యా! ఇక్కడ ఇద్దరు యుద్ధం చెయ్యలేదు. ఎవడొ ఒకడే రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని, సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి. అన్నయ్యా! నీకు అంజలి ఘటించి, నీ పాదములకు నమస్కరించి అడుగుతున్నాను, నువ్వు శాంతించు. రాముడే ఆగ్రహాన్ని పొందితే, ఇక లోకాలు నిలపడలేవు. నువ్వు ఏ ఋషులని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో, వారి మాట సాయంతో, నీ పక్కన నేనుండగా, సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా పట్టుకుందాము. అంత సాదుధర్మంతో నువ్వు అన్వేషించిననాడు కూడా సీతమ్మ నీకు లభించకపోతే, ఆనాడు నువ్వు కోదండం పట్టుకొని లోకాలన్నిటిని లయం చేసెయ్యి. కాని ఈలోగా నీకు ఉపకారం తప్పక జెరిగితీరుతుంది. నీకు ఋషులు, పంచభూతాలు, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మండములలో ఉండదు. నువ్వు సీతమ్మని పొందుతావు, ఇది సత్యం, సత్యం సత్యం. నేను నీ పక్కన ఉండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు. నువ్వు శాంతిని పొందు ” అన్నాడు.
లక్ష్మణమూర్తి మాటల చేత శాంతిని పొందినవాడై, రాముడు తూణీరం నుండి బాణాన్ని తీయకుండా ఆగిపోయాడు.
శాంతించిన రాముడితో లక్ష్మణుడు ” అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతిఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా. ( ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు, అదేంటంటే ” యయాతి! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు? ” అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా ” నేను ఎన్నడూ అసత్యం పలకలేదు ” అన్నాడు. ” నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు ” అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.)  జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గమునుండి పతనమై భూమి మీద పడిపోయాడు.
అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజూ శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువు గారు బెంగపెట్టుకోలేదు. మనం రోజూ చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది, ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటినుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలం కలిగినవారు, వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహాలైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రశిస్తున్నారు, మళ్ళి విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిననాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్యా, దయ చేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్యా, నీకు సమస్తం తెలుసు. కాని నిప్పుని బూది కప్పినట్టు, నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడంలేదు, నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, అంతే ” అన్నాడు.
పూర్వజో అపి ఉక్త మాత్రః తు లక్ష్మణేన సుభాషితం |
సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||
అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి, తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి ” తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధం రా. కాని నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వతగుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము ” అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.
అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటినిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో, రెక్కలు తెగిపోయి, ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. అప్పుడు రాముడు ‘ రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను, లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మాను, ఇప్పుడిది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను’ అని మనసులో అనుకొని, కొదండంలో బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.
అప్పుడు జటాయువు ” రామ! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో, అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా. నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను, కాని వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు, ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు, అందుకని నేను ఏమి చెయ్యలేకపోయాను. రామ! నేను చచ్చిపోయానయ్య, ఇంకొక్కసారి నన్ను చంపకు ” అన్నాడు.
జటాయువు మాటలు విన్న రాముడు, ఆ కొదండంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.
రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్టా మృతే ద్విజః |
ఈదృశీ ఇయం మమా లక్ష్మీః నిర్దహేత్ అపి పావకం ||
అప్పుడు రాముడు ” నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది.  అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా! ” అన్నాడు. అలాగే ” జటాయు! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతని స్వరూపం ఏమిటి. నాకు చెప్పు ” అన్నాడు.
అప్పుడా జటాయువు ” ఆ రావణుడు సీతమ్మని అపహరించి, మేఘములను, ధూళిని సృష్టించి, సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది కాని, నా రెక్కలు తెగిపోవడం వలన, నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడంలేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలొ ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు కనుక, నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది, నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్య….” అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి, తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి ” ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు…..” అని చెప్పి, శిరస్సు పక్కకి పడిపోగా, ఆ జటాయువు మరణించాడు.
అప్పుడు రాముడు ” చూశావ లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.
అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి, నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. అప్పుడు మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక, రోహి మాంసాన్ని పిండంగా పెడదాము ” అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు, జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు).
ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి ” నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు” అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.
జటాయువు ఉత్తమలోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు.
తరువాత రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనబడింది. ఆ చీకటి గుహ దెగ్గర అలికిడి, చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి, వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని ” నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు. మనిద్దరమూ ఈ పర్వాతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము ” అనింది.
లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అప్పుడా అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది.
తరువాత వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక, లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు ” అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడ వంజులకంఅనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది, కాని పరమ దారుణమైన యుద్ధం జెరుగుతుంది……..” అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి, సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దెగ్గరినుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక, ఆ చేతులతో అడవిలో తడిమి, దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి, అసలు ఇదేమిటిరా ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది ”  నేను రాక్షసుడిని, నన్ను కబంధుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు, ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను ” అని అంటూ వాళ్ళని దెగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడితో ” మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు, అందుకని వీడి చేతులని ఖండించేద్దాము ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. అప్పుడా కబంధుడు ” మీరు ఇద్దరు ఎవరు? ” అని అడిగాడు.
” ఈయనని రాముడు అంటారు, దశరరథుడి కుమారుడు, తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేంటి? నీలాంటి రక్షాసుడిని మేము ఎప్పుడూ చూడలేదు ” అని లక్ష్మణుడు అన్నాడు.
అప్పుడా కబంధుడు ” నేను మీకు నా కథ చెబుతాను, కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అదేంటంటే, ఒక పెద్ద గొయ్య తీసి, లేకపోతె ఒక చితి పేర్చి, దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి ” అన్నాడు. ” సరే, నువ్వు కోరినట్టే నిన్ను కల్చేస్తాములే కాని, సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వూ రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా ” అని రామలక్ష్మణులు అడిగారు.
అప్పుడా కబంధుడు ” మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు, కాని ఆ శరీరానికి అన్నీ తెలుసు. కనుక నన్ను కాల్చెయ్యండి ” అన్నాడు.
” కాలుస్తాములే కాని, నువ్వు అసలు ఎవరు, ఇలా ఎందుకు ఉన్నావు” అని రామలక్ష్మణులు అడిగారు.
అప్పుడు కబంధుడు ” పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అంత అందమైన శరీరంతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిని ఆలోచన వచ్చింది, అదేంటంటే, ‘ నేను కామరూపిని కనుక, ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది, అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది ‘ అని. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా, నేను ఆయన వెనకాలకి వెళ్ళి, ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి ‘ ఇలా ఈ రూపంతో తిరగడం నీకు ఎంత సరదాగా ఉందో, నువ్వు ఇలాగె చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు’ అని వెళ్ళిపోయారు. అప్పుడు నేను నా నిజ స్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి ‘ మీరు చెప్పిన మాట ప్రకారం, నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది. కాని నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది’ అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు ‘ నీకు వచ్చిన ఈ ప్రకోపం పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది’ అని చెప్పారు.
అప్పుడు నేను వెంటనే వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ‘ ఏమి కావాలి ‘ అని అడిగారు. అప్పుడు నేను ‘ నాకు దీర్ఘాయువు కావాలి ‘ అని అడిగాను. బ్రహ్మగారు తధాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘ ఆయుర్దాయం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది, అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది, నా రెండుచేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకూ ఉన్న శరీరంతో కిందపడ్డాను.
అప్పుడు నేను ఇంద్రుడితో ‘ నువ్వు నన్ను కొట్టేశావు, బాగానేఉంది. నా చేతులు, కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయం ఉందని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కాదా, మరి నేను ఏమి తిని బతకను ‘ అని ఇంద్రుడిని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరభాగం మీద ఏర్పాటు చేసి, యోజనం పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు.
రామ! నేను అప్పటినుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యంలో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటినుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను, ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చెయ్యండి నేను మీకు ఉపకారం చేస్తాను ” అన్నాడు.
( మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణం నుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకి ఉన్నదానిని పదిమందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది)
అప్పుడు వాళ్ళు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు పెట్టుకుని, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతొ ధనువు పైకి వచ్చి ” రామ! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తుంది. నీలాగే భార్యని పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు, నలుగురు వానరములతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆయనని, ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరస పుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కాదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి, సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడినుంచి పశ్చిమ దిక్కుకి వెళ్ళు, అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు, అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనాలు వస్తాయి. మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంపా అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు దెగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతిముద్దల్లా ఉంటాయి. మీరు ఆ పక్షులని చంపి వాటి మాంసాన్ని తినండి. అలా చెయ్యడం వల్ల మీరు సేద తీరుతారు. అలాగే ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి, మీరు వాటిని కూడా తినండి. తరువాత సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని తాగండి. మీరు సాయంత్రం పూట అక్కడ విహరించండి, అప్పుడు మీకొక విచిత్రమైన విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు.
ఇక్కడికి ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామ. పూర్వం మతంగ మహర్షి ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్ధాలు అరణ్యమునుండి మూట కట్టి తీసుకెళ్ళేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి, ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంతగా గురు సుశ్రూష చేసినవారంటే, వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూల దండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపా సరోవరానికి ముందరే ఋష్యమూక పర్వతం కనపడుతుంది.
ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు, దానిని ఎక్కడం చాలా కష్టం. చిత్రమేమిటంటే, ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఆ గున్న ఏనుగులు రోజూ పంపా సరోవరం దెగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్ళు తాగుతాయి. దాహం తీరిపోగానే పౌరుషం వచ్చి ఆ ఎనుగులన్నీ నోట్లోనుంచి నెత్తురు కారేటట్టు కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక, అవి స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు, తొండాలు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూక పర్వతం చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే, ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో, ఉదయానికల్లా అది జెరిగి తీరుతుంది. పాపకర్మ ఉన్నవాడు, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద 5 వానరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళితే ఒక పెద్ద గుహ ఉంటుంది, దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్ద తోట ఉంటుంది, అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ, అక్కడే ఉన్న సరస్సులోని నీళ్ళు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు.
ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడూ గుహ నుండి బయటకి వచ్చి, ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామ, ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరం వరకూ భూమి మీద పడతాయో, అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు. అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి ” అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు రామలక్ష్మణులు బయలుదేరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు మతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకి వచ్చి వారి పాదాలని గట్టిగా పట్టుకుంది. వారికి అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక, రాముడు శబరితో ” నువ్వు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా, నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా, తపస్సు చెయ్యగలుగుతున్నావా, నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా ” అని అడిగాడు.
అప్పుడా శబరి ” రామ! ఏనాడు నీ దర్శనం చేశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమలోకాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు ‘ మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆతిధ్యం ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువు ‘ అని చెప్పి వెళ్ళారు. అందుకని నీకోసం నేను ఇక్కడే ఉండిపోయాను ” అని చెప్పింది.
అప్పుడా రాముడు శబరితో ” నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి ” అన్నాడు.
అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి ” రామ! మా గురువుగారు ఈ అగ్నివేది దెగ్గరే అగ్నిహోత్రం చేసేవారు. వృద్ధులైన మా గురువులు వొణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామ! ఒక్కసారి ఆ వేది మీద చూడు, ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుంచి వచ్చే కాంతి దశదిశలని ప్రకాశింప చేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవ్వడం వలన, నదీ తీరానికి వెళ్ళి స్నానం చెయ్యలేకపోయేవారు. అందుకని వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారం చేసేవారు. వారు అలా నమస్కారం చెయ్యగానే ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి, అప్పుడు మా గురువులు అందులో స్నానం చేశారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి, ఇక్కడే తీగల మీద ఆరేసేవారు. నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు, అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో, అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపంగా ఉండిపోయారు.
రామ! నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యం నుండి చాలా సంభారాలని సేకరించాను, నువ్వు వాటిని స్వీకరించు” అని చెప్పి, ఆ సంభారములని రాముడికి ఇచ్చి ” మా గురువులు నీకు ఆతిధ్యం ఇవ్వమన్నారు, నేను ఇచ్చేశాను. అందుకని నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ” అని చెప్పి, సంకల్పమాత్రం చేత అగ్నిని రగిల్చి, అందులో చీర క్రిష్ణాంబరాలతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది. అప్పుడా అగ్నిలోనుంచి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకి వచ్చి, తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది.
ఆహా, ఏమి ఋషులు, ఏమి తపస్సు అని రామలక్ష్మణులు పొంగిపోయి, అక్కడినుండి బయలుదేరి ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరారు.

Post a Comment

0 Comments