Ad Code

శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ చరిత్ర మరియు ఆలయానికి ఎలా చేరుకోవాలి

శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం
ఒంటిమిట్ట లో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం ఉన్నది. ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించి, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.



శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయానికి ఎలా చేరుకోవాలి?
శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి చేరుకోవడానికి అన్నివిధాలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం:
విమానంలో వచ్చేవారు కొత్తగా పునరుద్ధరించబడిన కడప విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి ఏదైనా ప్రవేట్ లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. కడప విమానాశ్రయం కొత్త కాబట్టి విమాన సర్వీసులు ఇంకా అంతగా అందుబాటులో లేవు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం 112 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

రైలు మార్గం:
ఒంటిమిట్ట లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన గానీ లేదా షేర్ ఆటోలో గానీ ఎక్కి చేరుకోవచ్చు. అలాగే భాకరపేట్ రైల్వే స్టేషన్ (7 కి.మీ), కడప రైల్వే స్టేషన్ (25 కి.మీ) మరియు తిరుపతి రైల్వే స్టేషన్ (106 కి.మీ) లు ఒంటిమిట్ట కు చేరువలో ఉన్నాయి.

రోడ్డు మార్గం:
ఒంటిమిట్ట కు రోడ్డు మార్గం చాలా సులభంగా ఉంటుంది. కడప నుండి ప్రతి రోజు అరగంటకోసారి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. కడప 7 రోడ్ల కూడలి వద్ద కానీ లేదా కడప ప్రధాన బస్ స్టాండ్ నుండి కానీ లేదా కడప పాత బస్ స్టాండ్ నుండి కానీ ప్రభుత్వ బస్సులు ఎక్కొచ్చు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రధాన పట్టణాల నుండి ఏపి ఎస్ ఆర్ టీ సి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించినాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిలా నగరం అన్ని పేరొచ్చింది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

కోదండరామ స్వామి ఆలయానికి మూడు ప్రధాన గోపురద్వారాలు ఉన్నాయి. ఆ గోపురాల ద్వారా లోనికి వెళితే విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించారు. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి.


రామ నామ జయమంత్రం
రామ రాజ్యంలో ప్రజానీకం సుఖించడం వెనుక గల కారణాలు పరిశీలిస్తే ధర్మస్వరూపుడైన రాముడు రాజుగా రాజ్యపాలన చేయడం ఒక కారణమైతే ప్రజానీకం అంతా రాముణ్ణి నిరంతరం తలుచుకోవడం వల్ల అనుకోకుండా చేసిన రామ నామ జపసాధన వల్ల వారికి అంతటి సుఖ ప్రాప్తి కలిగిందనేది కూడ కాదనలేని కారణం. రామనామ స్మరణకి గల శక్తి అనేక సందర్భాల్లో అనేకానేక మంది తెలియ జేశారు.

అట్టి రామ నామ జపాన్ని *జయమంత్రం* గా చెప్పబడిన *శ్రీరామ జయ రామ జయ జయ రామ* అన్న మంత్రాన్ని ఉదయం స్నానం చేశాక 11 సార్లు, మధ్యాహ్నం భోజన సమయంలో తినబోయే ఆహారాన్ని చూస్తూ 11 సార్లు (అప్పుడు ఆ ఆహారం రామశక్తిమయం అవుతుంది) అని తర్వాత ఆహారం తినడం, ఇలాగే రాత్రి భోజన సమయంలోను, మరల నిద్రించే ముందు 11 సార్లు అని *రామచంద్రా* *నన్ను నా కుటుంబాన్ని నా దేశాన్ని రక్షించు* అని ప్రార్ధించడం.

ఇలా ప్రతిరోజు చేయడం అలవాటుగా చేసుకోవాలి. దీని వల్ల అన్ని కుటుంబాలు సుఖ శాంతులతో ఉంటాయి. దీన్ని ప్రతి ఒకరు తమ కుటుంబ సభ్యులచే చేయించడమే కాక తమకు తెలిసిన వారందరి చేత చేయించాలి. వాళ్ళకి కూడ వారికి తెలిసిన వారిచే చేయించమని చెప్పాలి. భారత దేశ జనాభాలో కనీసం 50 కోట్లమంది మనిషికి రోజుకి 44 సార్లు చొప్పున చేస్తే *జయమంత్రజపం* ఎంత అవుతుందో ఊహించండి.

దేశంలో కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉంటే ఇంతకంటె ఏమి కావాలి. ఎంతో మందిని ఈ *జయమంత్ర జపం* లో భాగస్వాముల్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చేసిన పుణ్యం మీకు, మీ పిల్లలకి శ్రీరామ రక్ష అవుతుంది. (వ్యవహారంలో నీకు శ్రీరామరక్ష కలుగు గాక అనే ఎందుకు అంటారు? ఎందుకంటే రాముని రక్ష లభిస్తే ముల్లోకాలలోను అతనికి అపకారం జరగదు కాబట్టి)
ఈ ఆధ్యాత్మిక ఉద్యమానికి మీలో ప్రతి ఒకరు నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలని సవినయంగా ప్రార్ధిస్తున్నాము.

"శ్రీరామ జయ రామ జయజయ రామ"
మహామంత్రమును ఉదయము స్నానము చేసిన తరువాత 11 సార్లు,
మధ్యాహ్నము భోజన ప్రారంభ సమయమున 11 సార్లు,
రాత్రి భోజనమునకు ముందర 11సార్లు,
రాత్రి పడుకునేముందు 11 సార్లు జపించండి.
రామ నామామృత పానము చేయండి.
చైత్రమాసము లో విశేష ఫలితము కలుగుతుంది.
శ్రమస్వల్పము.
ఫలమధికము.
శ్రీరామ జయ రామ జయ జయ రామ!



Sri Kodandarama Swamy Temple, Vontimitta

Kodandarama Temple is a Hindu temple dedicated to the god Rama, located in Vontimitta town in Rajampet taluk of Kadapa District in the Indian state of Andhra Pradesh. The temple, an example of Vijayanagara architectural style, is dated to the 16th century. It is stated to be the largest temple in the region. It is located at a distance of 25 kilometres from Kadapa and is close to Rajampet. The temple and its adjoining buildings are one of the centrally protected monuments of national importance.

According to the local legend, the temple was built by Vontudu and Mittudu, who were robbers-turned-devotees of Rama. After building the temple, they are said to have turned into stone.


సకల కల్యాణ గుణాభిరాముడైన శ్రీరాముని పాలనలో దేశం ఎందుకంత సుభిక్షంగా ఉన్నదో, ప్రజలెందుకు రామరాజ్యాన్ని కోరుకుంటారో, ప్రకృతి ఎందుకు రామరాజ్యంలో పులకరిస్తుందో, ఈనాటి మన నేతలు, పౌరులు చిత్తశుద్ధితో, శ్రీ రాముని మీద భక్తితో, శ్రీమద్రామాయణం మీద శ్రద్ధతో రామాయణం విని అర్ధం చేసుకుంటే తెలుస్తుంది. ఆ ధర్మాలను ఆచరించితే రామ రాజ్యం వస్తుంది.

శ్రీ రామచంద్రుని పరిపాలనలో విద్యా, వైద్య, ఉద్యోగ, పారిశుధ్యత మొదలైన వివిధ రంగాలలో ఎటువంటి అక్రమాలు లేకుండా అందరూ ధర్మపాలనతో, సత్యనిష్ఠతో ఉండేవారు. 'శృతౌ తస్కరతా స్థితా' అంటారు. దొంగతనం అనే మాట వినటమే తప్ప అదెలా ఉంటుందో ఆ ప్రజలకు తెలీదు. రోగులే లేరు కనుక వైద్యుల అవసరమే లేదు. తప్పులనేవే జరిగేవి కావు కనుక న్యాయవాదులు, న్యాయమూర్తులకు పనే లేదు. లంచగొండితనము, నేటి కాలంలో సమాజంలో కనిపిస్తున్న ఎన్నో అక్రమాలు అన్యాయాలు అఘాయిత్యాలు అమానుష కిరాతక చర్యలు మచ్చుకైనా అసలు ఉండేవే కాదు. వారికి ఆ పదాలే తెలీవు. ప్రతి రంగంలోను ఏ లోపం లేని పరిపాలనను అందించాడు శ్రీ రామచంద్ర ప్రభువు.

మానవ సంబంధాలు ఎంతో ధర్మబద్ధంగాను పటిష్ఠంగాను ఉండేవి. ప్రజలందరూ శ్రీ రాముడేర్పరచిన ధర్మపథంలో నడిచేవారు. మానవుల ప్రేమలో నిష్కల్మషత్వము స్వచ్ఛత ఉండేవి. అవి నేటి కాలంలో లోపించాయి. ఆ కాలంలో తల్లితండ్రుల పిల్లల బంధాలు, తోడపుట్టిన వారితో, బంధువులతో బంధాలు, తోటి మానవులతో అనుబంధాలు అన్నీ నైతిక విలువలతో కూడి పవిత్రమైన మనస్సులతో, స్వచ్ఛమైన ఆలోచనలతో ఉండేవి. అందరూ సంప్రదాయ బద్ధమైన వస్తరధారణతో కట్టు బొట్టు, మడి మన్నన, ఆచారము వ్యవహారములు అన్నీ సత్త్వగుణ సంపన్నుల ప్రవర్తనల వలె ఉండేవి. అప్పటి ఆడపిల్లలు ఆడపిల్లలలా, విద్యార్ధులు, గృహస్థులు మొదలైన నాలుగు ఆశ్రమల వారు ఎవరి ధర్మాలను వారు పాటిస్తూ, జీవించేవారు. రామనామ స్మరణతో తరించేవారు.

నేటి కాలంలో అది కొరవడుతోంది. సత్త్వగుణము పాలు కంటే రజోగుణ తమోగుణముల అంశలు ఎక్కువై, స్వార్ధము, ద్రోహచింతన , మితిమీరిన అహంకారము, ధర్మప్రవర్తన లోపము, సత్యసంధత లోపించటము వల్ల, అనైతికత వల్ల సంఘంలో ఏ ఒక్కరిలోను నిజమైన ఆత్మీయత, ప్రేమానుబంధాలు లేవు. చాలా మంది మనస్సులలో ఒక విధమైన భయము, అశాంతి, నిర్లిప్తత, ద్వేషము, మాత్సర్యము, మితిమీరిన స్వార్ధము, లోభము విజృంభిస్తున్నాయి. అందరికీ తెలుసును. కానీ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటున్నాము. మనుష్యుల మనస్సులు, ఆలోచనా ధోరణులు కలుషితమయ్యాయి. ఇటువంటి స్థబ్దత, దుస్థితి పోవాలంటే అందరి హృదయాల్లో ముందు అలజడి తగ్గి ప్రశాంతత కలగాలి. అధికారులు అధికారహోదా అనుభవించటం కోసం, అహంకరించటం కోసం కాక తాము పాలించవలసిన ప్రజలకు సర్వ సదుపాయాలు కలిగిస్తూ, ఆశ్రిత పక్షపాతం లేకుండా, ఆశ్రయించిన వారిలో ధర్మముంటే, వారని కాపాడుతూ, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరికీ ఎవరి వృత్తే వారికి దైవమవాలి. కుటుంబంలో, కార్యాలయములలో ఎదురయ్యే ఏ విధమైన సమస్యలకైనా శాశ్వత పరిష్కారాలను ఆలోచించి అమలుపరచాలి. శ్రద్ధ, ప్రతిభ, పట్టుదల కలవారికి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని, వేతనాన్ని అందించాలి. అర్హులైనవారి అర్హతను గుర్తించాలి. అనర్హులను అందమెక్కించరాదు.

శ్రీరాముని పాలనలో అందరూ ఆనందంగానే ఉండేవారు. ఎందుకంటే 'యథా రాజా తథా ప్రజాః' కనుక ! మూర్తీభవించిన ధర్మస్వరూపుడైన రాముని మీది ప్రేమతో, భయంతో ప్రజలందరూ ధర్మబద్ధంగానే జీవించేవారు. తమలో తమకు ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చినా, చిన్న గొడవలు జరిగినా, అది శ్రీరామునికి ఎక్కడ బాధ కలిగిస్తుందోనని వారే వెంటనే సర్దుకుని అభిమానం, ప్రేమ ప్రకటించుకుని అన్యోన్యంగా ఉండేవారు.

రామరాజ్యంలో అందరూ సంపూర్ణమైన ఆయుర్దాయంతో జీవించేవారు. ఎప్పుడూ ఎక్కడా అకాల మరణాలు లేవు. పెద్దలు జీవించి ఉండగా పిల్లలు మరణించటాలు లేవు. ఎప్పుడూ ఎవ్వరికీ దుర్మరణాలు కలగ లేదు. స్త్రీలకు వైధవ్యం లేదు. వ్యాధుల వల్ల కానీ, శతృరాజుల వల్ల కానీ, కౄరమృగాల వల్ల కానీ ఎవ్వరికీ ఎప్పుడూ బాధలు కలగలేదు. ఎప్పుడూ ధర్మకార్యాలు, దైవకార్యాలు జరుగుతూ ఉండేవి. యజ్ఞ యాగాదులు చక్కగా నిర్వహింపబడుయూ ఉండేవి. సకాల వర్షాలు కురిసేవి. ఏ ఋతు ధర్మాలు ఆ ఋతువులలో ప్రవర్తిల్లుతూ ప్రజలకు హితవును కలిగించేవి. ఎప్పుడూ వరదల వల్ల, తుఫానుల వల్ల, వడదెబ్బల వల్ల ప్రాణి హింస, మరణములు సంభవించేది కావు. రాజు ధర్మాత్ముడై ఉంటే, ప్రజలు ధర్మాత్ములై ఉంటారు. రాజు, ప్రజలు అందరూ ధర్మాత్ములై ప్రవర్తిస్తూ ఎవరి కర్తవ్యాలను వారు నారవర్తిస్తుంటే, ప్రకృతి ఆనందించి సర్వ మానవులకు, సర్వ ప్రాణికోటికీ అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రకృతి ఆనుకూల్యత వల్ల అందరి మనస్సులు ప్రశాంతతను, సంతృప్తిని, ఆనందాన్ని పొందుతాయి.

"ఆసన్ ప్రజాః ధర్మరతాః
రామే శాసతి నానృతాః !
సర్వే లక్షణ సంపన్నాః
సర్వే ధర్మపరాయణాః" !

శ్రీరాముని పాలనలో ప్రజలందరూ ధర్మపరాయణులై, సర్వ శుభ లక్షణ సంపన్నులై, సత్య పరిపాలకులై ధర్మవర్తనులై ఉండేవారు.

శ్రీ రామచంద్రుని పరిపాలన ఎలా ఉండేది కాదు. అన్నది మనము రామాయణంలో అడుగడుగున గమనించ వచ్చును. రాముని స్వభావము, ప్రవర్తన ఎలా ఉంటాయో, ఆయన పరిపాలన అలాగే ఉంటుంది కదా ! రఘువంశములోని రాజులందరలో సర్వసాధారణంగా ఉండే పదహారు సద్గుణాలను కాళిదాస మహాకవి తన రఘువంశ మహాకావ్యంలో ఇలా కీర్తించాడు.

సో2హమాజన్మ శుద్ధానా
మాఫలోదయ కర్మణామ్ !
ఆ సముద్ర క్షితీశానామా
నాక రథ వర్త్మనామ్ !!

రఘువంశములో జన్మించిన రాజులందరూ జన్మతః పరిశుద్ధులు, ప్రారంభించిన కార్యములను విజయవంతముగా పూర్తి చేయువారు, సముద్రము వరకు కల భూమికి అధిపతులు, స్వర్గమునకు వెళ్ళు తల మార్గము కలవారు, అనగా మాటి మాటిమాటికీ స్వర్గాది లోకములకు వెళుతూ వస్తూ ఉండేవారు.

యథావిధి హుతాగ్నీనాం
యథా కామార్చితార్ధినామ్ !
యథాపరాధ దండానాం
యథావిధి కాల ప్రబోధినామ్ !!

శాస్త్రోక్త ప్రకారముగా హోమములు చేయువారు, యాచకుల కోర్కెలననుసరించి దానము చేయువారు, తప్పులకు తగిన దండనను విధించువారు, ఏయే కాలములలో ఏయే పనులు చెయ్యాలో, ఆయా కార్యములలో జాగరూకులై ఉండువారు.

త్యాగాయ సంభృతార్ధానాం
సత్యాయ మిత భాషిణామ్ !
యశసే విజిగీషూణాం
ప్రజాయై గృహమేథినామ్ !!

సత్పాత్రులకు దానము చెయ్యటానికే ధనమును సంపాదించుచు, సత్యమునే మాట్లాడుట కొరకు మితముగా మాట్లాడుచు, కీర్తిని సంపాదించుట కొరకు శతృ రాజులను జయించవలెననెడి కోరిక కలిగి ఉండి, పితౄణ విముక్తికి సాధన భూతులగు సత్సంతానమును పొందుట కొరకే వివాహమును చేసుకొనెడివారు.

శైశవే2భ్యస్త విద్యానాం
యౌవనే విషయేషిణామ్ !
వార్ధకే ముని వృత్తీనాం
యోగేనాంతే తను త్యజామ్ !!

బాల్యమునందు విద్యల నభ్యసించుచు, యౌవనమునందు గృహస్థాశ్రమ ధర్మమునాచరించుచు, వార్ధక్యమునందు వానప్రస్థాశ్రమ ధర్మమును పాటించుచు అంత్యకాలము నందు యోగము చేత దేహత్యాగమును చేయువారు.

ఈ గుణములు రఘువంశములో పుట్టిన రాజులందరిలోను సమానంగా ఉన్నాయి. సూర్యుడు తాను గ్రహించిన నీటిని వేయి రెట్లుగా వర్షరూపంలో ఎలా తిరిగి అందిస్తాడో, అదే విధంగా రఘురాజులు పన్నుల రూపంలో ప్రజల నుంచి గ్రహించిన ధనము స్వల్పమైనా ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వారు చేసే కార్యాలోచనములను ఎవ్వరికీ తెలియనీయక రహస్యముగా నుంచి ఫలముల వల్ల మాత్రమే తెలియబడేవిగా అమలుచేస్తారు. ఏ భయము లేనివారయి తమ శరీరమును ధర్మార్ధకామముల సాధన కొరకు రక్షించుకొనుచు, ఏ బాధ లేకుండా ధర్మము నాచరించుచు, ఏ కోరిక లేకుండా ధనము సంపాదిస్తూ, ఏ ఆసక్తి లేకనే సుఖముల ననుభవించెడివారు. దిలీప మహారాజును గురించి చెప్తూ,

"ప్రజానాం వినయాధానా
ద్రక్షణాద్భరణాదపి !
స పితా పితరస్తాపసాం
కేవలం జన్మహేతవః !!

దిలీపమహారాజు ప్రజలను సన్మార్గ వర్తనులనుగా చెయ్యటము వలన, భయములు కలుగకుండా అన్ని విధములుగా రక్షించటం వలన, అన్నపానాదుల చేత పోషించటం వలన వారందరికీ తండ్రి అయ్యాడు. వారి తల్లితండ్రులు వారికి కేవలం జన్మనిచ్చుటకు హేతూభూతులై ఉన్నారు.

దుదోహ గాం స యజ్ఞాయ
సస్యాయ మఘవా దివమ్ !
సంపద్వినిమయేనోభౌ
దధతుర్భువన ద్వయమ్ !!

దిలీప మహారాజు రాజుల దగ్గర నుంచి కప్పము రూపములో భూమి యందలి ద్రవ్యమును తీసుకుని విస్తారముగా యజ్ఞములను చేయుట ద్వారా దేవతలకు తృప్తిని కలుగజేసి స్వర్గమును, దేవేంద్రుడు సవర్గము నుండి భూమి మీద సకాల వర్షమును కురిపించి సస్య వృద్ధిని కలుగ జేసి, ఒకరి లోకమును మరియొకరు చొప్పున రెండు లోకములను సంరక్షించు చుండెడివారు.

Post a Comment

0 Comments