Ad Code

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళి (షోడశాక్షరి) - Shodashakshari

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళి (షోడశాక్షరి)



ఇది షోడశాక్షరి రూపమైన మంత్రము. పూజాకాలంలో “ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

ఉన్మేష = కన్నులు తెరచుట చేతను,
నిమిష = కన్నులు మూయుట చేతను
ఉత్పన్న = పుట్టిన
విపన్న = నశించిన అంతరించిన
భువన అవళిః = భువనముల సమూహములు గలది శ్రీదేవి.

అమ్మవారు కన్నులు తెరచుటచే సమస్త భువనాలు అవతరిస్తాయి. కనులు మూసినచో సమస్త భువనాలు అంతరిస్తాయి. అనగా విలోమక్రమంగా అన్నియు తమ కారణంలో విలీనతను పొందుతాయి.

మొదటి వివరణ:
మానవ కాలమానము ఇటుల ఉంటుంది.
30 కష్టములు   -  1 కళ
40 కళలు   -  1 విఫల
60 విఫలలు   -  1 ఫల (దీనినే విఘడియ అందురు)
60 ఫలల (విఘడియలు)   -  1 ఘడియ (లేక 24 నిమిషాలు)
60 ఘడియలు (లేక 24 గంటలు)   -  1 దినము
2 ఘడియలు లేక 48 నిమిషాలు   -  1 ముహూర్తము
ఇక నెలలు, సంవత్సరాలు, ఇత్యాది కాలప్రమాణము అందరికినీ తెలియును.
కృతయుగము   -  1728000 సంవత్సరములు
త్రేతాయుగము   -  1296000 సంవత్సరములు
ద్వాపరయుగము   -  0864000 సంవత్సరములు
కలియుగము   -  0432000 సంవత్సరములు
మొత్తము   -          4320000 సంవత్సరాలు
అనగా (4320000) సంవత్సరాలు ఒక చతుర్యుగ కాలము.

సహస్రయుగపర్యన్తమ్ అహర్యద్ర్బహ్మణో విదుః
రాత్రిం యుగసహస్రాంతాం తే హోరాత్ర విదో జనాః (భగవద్గీతా)
ఇటువంటి చతుర్యుగాలు వెయ్యి అయినచో బ్రహ్మదేవునికి ఒక్క పగలు అగును. రాత్రియును అలాగే వేయి చతుర్యుగ కాలంగా ఉంటుంది. ఇలాంటి దినాలు మూడు వందల అరవై యైదు అయినచో బ్రహ్మకు ఒక్క సంవత్సరము అగును. అలాంటి సంవత్సరాలు నూరు అనగా ఒక వంద అయినచో బ్రహ్మకు పూర్ణాయువు అగును తర్వాత ఇంకొకరు బ్రహ్మగా వస్తారు. భావికాలంలో బ్రహ్మగా శ్రీ ఆంజనేయస్వామి అగును అని రామాయణంలో గలదు.
బ్రహ్మదేవుడి శతాయుష్యమునే కల్పాంతముగా కొందరు అందురు. కల్పాంతమునందు సర్వప్రపంచము కారణంలో విలీనం అగును. కల్పాదిలో మరల నిర్గమిస్తుంది.

దీనిచే పరాశక్తి కన్నులు తెఱచి ఉండు కాలము (ఉన్మేష కాలము). ప్రపంచ స్థితి రూపమైన ఒక కల్పము అగును. అలాగే కన్నులు మూసి ఉంచినంత కాలము ప్రపంచ ప్రళయకాలము అగును అనియు తెలియుచున్నది.

గమనిక: ఈ కాల పరిగణన విషయంలో ప్రణవనాదానికీ, ఇతర గ్రంథాలకును మత భేదాలు కలవు. గ్రంథవిస్తరణ భీతిచే ఈ విషయాన్ని ఇంతటితో ముగించడమైనది.

రెండవ వివరణ:
"యతోవా ఇమానిభూతాని జాయస్తే యేన జాతాని జీవని యత్రయన్యభిసంవిశని" (శ్రుతి)
ఈ శ్రుతిచే సంసారోత్పత్తియు, స్థితియు, విలయమును, సామాన్యంగా మాత్రమే నిర్దేశింపబడుతున్నాయి. యుగ కల్పాది పరిగణన లేదు. ఇటులనే 'జన్మాద్యస్యతు:” అనే
బ్రహ్మసూత్రం చేతను సామాన్యంగానే ప్రపంచం యొక్క ఉత్పత్తి, స్థితి, లయాలు బోధింపబడినాయి.

'ఉన్మేష - నిమిషోత్పన్న” ఇత్యాదికమైన ఈ మంత్రంలో కొంత వివరణ గలదు. పురాణాదులందును ప్రణవనాద శాస్త్రంనందును జ్యోతిష్య శాస్త్రంనందును యుగ, కల్ప, మహాకల్ప, మన్వంతరం, మహామన్వంతరాది వివరణ విస్తృతంగా గలదు.

ఈ మంత్రంతో ఉపాసించేవారికి సమస్త సంసారం దేవీ విలాసంగా భాసిస్తుంది. అనన్య భక్తి జనిస్తుంది. తరిస్తారు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments