Ad Code

నవగ్రహ దోషములకు చేయవలసిన స్నానములు

నవగ్రహ దోషములకు చేయవలసిన స్నానములు



మానవ జీవితమున నవగ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం. ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి పలు రకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.

స్నానౌషధములు సిద్ధౌషధ సేవల వల్ల వ్యాధులు, మంత్ర జపము వల్ల సకల భయం తీరునట్లుగా ఔషధస్నాన విధానం వల్ల గ్రహదోషములు నశించును.

 సూర్య గ్రహ దోష నివారణకు కుంకుమ పువ్వు, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్ళు, యష్టిమధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి. సూర్య గ్రహ దోష నివారణకు గాను సూర్యున్ని పూజించుట, ఆదిత్య హృదయం పారయణ చేయుటకు, కెంపు,(మాణిక్యము) ధరించుట, సూర్యునకు గోధుములు, బెల్లం, కంచు, గుర్రము, రక్త చందనం, పద్మములు, ఆదివారం, దానం చేస్తే రవి వలన కలిగిన దోషాలు తొలుగును.

కంచుతో చేయబడిన ఉంగరం ధరించుట వల్ల మంజిష్టం గజమదం, కుంకుమ పువ్వు రక్త చందనములను రాగి పాత్రయందలి నీటిలో కలిపి ఆ రాగి పాత్ర యందలి నీటితో స్నానము చేసిన దోష నివృత్తి కలుగుతుంది. రాగి ఉంగరము ధరించడం కూడా మంచిదే. శుభ తిధి గల ఆదివారము రోజున సూర్యుని ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః సూర్యాయనమహః అను మూలమంత్రమును 40 రోజులలో 6 వేలు జపము పూర్తి చేసిన సూర్య సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. 

 చంద్ర గ్రహ దోష నివారణకు గో మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు నెయ్యి, శంఖములు, మంచి గంధములు, స్పటికము. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట, దుర్గా దేవి ఉపాసించుట, బియ్యం దానం చేయుట, ముత్యం ఉంగరాన్ని ధరించుట గాని, మాలగా వేసుకొనుట గాని చేయాలి. సీసం, తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రం నేయితో నింపిన కలశం, ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారం దానము చేసినచో చంద్రునకు సంబంధించిన దోషం పోవును. వట్టివేర్లు, దిరిసెన గంధం, కుంకుమ పువ్వు, రక్త చందనము కలిపి శంఖములోపోసిన నీటితో స్నానం ఆచరిస్తే చంద్ర దోష పరిహారం కలుగుతుంది.

సీసపు ఉంగరము, వెండి ఉంగరము గాని ధరించుట మంచిది. శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అంటే 41వ రోజున బియ్యం, తెల్లని వస్త్రం నందు పోసి దానం చేస్తే చంద్ర దోష నివారణ కలుగుతుంది.

 కుజ గ్రహ దోష నివారణకు మారేడు పట్టూ, ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం ఆచరించాలి. కుజ దోష నివారణకు గాను కుజుని పూజించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్లగానీ, ఎర్రని పగడమును గాని కందులు, మేకలు, బెల్లము, బంగారము, ఎర్రని వస్త్రము, రాగి వీటి యందేదయిన దానము చేయుటకు కాని కుజదోష నివారణ అవుతుంది. వెండి పాత్రయందు చండ్రకర్ర గంధము, దేవదారుగంధం ఉసిరిక పప్పు కలిపిన నీటితో స్నానం ఆచరిస్తే అంగారకదోష నివారణ కలుగుతుంది.

బంగారు ఉంగరము ధరించు ఆచారము కలదు. శుభ తిధి గల మంగళవారం రోజున ఓం-క్రాం-క్రీం-క్రౌం-సః భౌమాయనమః అను మంత్రమును 7 వేలు 40 రోజులలో పూర్తి చేసిన ఎర్రనిరంగు బుట్టలో కందులు వేసి 41 వ రోజున దానం చేయడం మంచిది.

బుధ గ్రహ దోష నివారణకు చిన్న సైజులో ఉండే పండ్లు, ఆవు పేడ, గోరోచనము, తేనే, ముత్యములు బంగారము. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించవలెను. బుధ గ్రహ దోష నివారణకుగాను బుధ గ్రహమునకు పూజ,విష్ణు సహస్రనామ పారయణ చేయాలి. పెసలు దానము చేయాలి. ఆకు పచ్చ రంగు బట్ట, తగరము, టంకము, పచ్చ పెసలు, మరకతము, లొట్టపిట్ట, గజదండము (అంకుశము), పచ్చని పూవులు వంటి వానిలో ఒకటి దానం చేసినచో బుధగ్రహం వలన కలుగు దోషం పరిహరించబడును.

నదీసంగమము నందు గల సముద్రపు నీటిని మట్టిపాత్రలో పోసి ఆ నీటిలో గజమదము కలిపి, ఆ నీటిని స్నానం చేస్తే కూడా బుధ దోషం తొలగును. ఇత్తడి లేక కంచు ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభ తిధితో కూడిన బుధవారమునందు ఓం-బ్రాం-బ్రీం-బ్రౌం-సః బుధాయనమః అను మంత్రమును 40 రోజులలో జరిపించి చివరి రోజున అనగా 41 ఆకు పచ్చని వస్త్రములలో పెసలు పోసి దానము చేసినచో బుధగ్రహ దోష నివారన కలుగును.

గురు గ్రహ దోష నివారణకు మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయడం వల్ల దోష నివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఎదొకదానిని దానము చేయుటవలన కూడా గురునకు సంబంధించిన దోషము శాంతించగలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి, ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానం చేస్తే గురువునకు సంబంధించిన దోషము తొలగిపోవును.

బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము. శుభతిధి గల గురువారము నాడు ఉదయము ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః బృహస్పతయే నమః అను మంత్రము 40రోజులలో 16వేలు జపము పూర్తి చేసి పసుపు పచ్చని బట్టలో సెనగలు దానమిచ్చినచో గురుగ్రహ దోష శాంతి కలుగును.

 శుక్ర గ్రహదోష నివారణకు కుంకుమ పువ్వు, యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించాలి. శుక్ర గ్రహ గ్రహ నివారణకు గాను శుక్ర గ్రహమునకు లక్ష్మీదేవికి పూజ చేయాలి. వజ్రమును ఉంగరంను ధరించుట వలన శుభ వస్త్రము, తెల్లని గుర్రము తెల్లని ఆవు, వజ్రం, వెండి, గంధము, బియ్యం బొబ్బర్లు వీటియందేదొకటి దాన మిచ్చుట వలన గాని శుక్ర గ్రహ దోషం నివారింపబడును. వెండి పాత్రయందలి నీటిలో గోరోచనము గజమదము, శక్తిపుష్పము, శతావరిని కలిపి, ఆ నీటితో స్నానం ఆచరిస్తే శుక్రగ్రహ సంబంధమైన దోషం తొలగును.

వెండితో చేసిన ఉంగరము గాని, ముత్యముతో వెండి ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభతిధితో కూడిన శుక్రవారమునందు ఓం-ద్రాం-ద్రీం-ద్రౌం-సః శుక్రాయనమః అను మంత్రము 20 వేలు 40రోజులలో జపము పూర్తిచేసి, 41వ రోజున తెల్లని వస్త్రములో బొబ్బరులుపోసి దానము చేసిన శుక్ర సంబంధమైన దోషం నివారింపబడును.

 శని గ్రహ దోష నివారణకు సాంబ్రాణి, నల్ల నువ్వులు, సుర్మరాయి, సోపు వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి. శని గ్రహ దోష నివారణకు శనిగ్రహ పూజలు,ఈశ్వర పూజ, తైలాభిషేకం, నీలమణి ధరించుట, నువ్వులు దానం చేయడం వల్ల గ్రహ దోష నివారణ కలుగును. నీలం, నూనె, నువ్వులు, గేదె, ఇనుము, నల్లని ఆవులందు ఏదో ఒకటి దానం చేయవలెను. ఇనుప పాత్రయందు గల నీటిలో మినుములు, ప్రియంగు ధాన్యము, నీలగంధ, నీల పుష్పములు వేసి ఆ నీటితో స్నానము చేస్తే శనిగ్రహ దోష నివారణయగును.
శుభతిధి గల శనివారము నుండి ఓం-ఖ్రాం-ఖ్రీం-ఖ్రౌం-సః శనయేనమః అను మంత్రము 40 రోజులలో 19 వేలు జపము చేసి, 41వ రోజున నువ్వులు నల్లని బట్టలో వేసి శని గ్రహ దోష నివారణ కలుగుతుంది.

 రాహు గ్రహ దోష నివారణకు నువ్వు చెట్టు ఆకులు, సాంబ్రాణి, కస్తూరి, ఏనుగు దంతము (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి). ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించాలి.  రాహు గ్రహ దోష నివారణకుగాను రాహు గ్రహమును పూజించుట, దుర్గాదేవిని పూజించుట, గోమేధికమును ధరించుట వలన రాహు గ్రహ దోష నివారణ యగును, గోమేధ్కము, గుర్రము, నీలవస్త్రము, కంబళి నూనె, మినుములు, పంచలోహములు, వీటియందేదైన దానం చేయడం వల్ల కూడా దోష శాంతి కలుగును.

గేదె కొమ్ముతో చేసిన పాత్రయందలి ఉదకమున గుగ్గిలము, ఇంగువ,హరిదళము, మనశ్శిలలతో కలిపి ఆ నీటితో స్నానం చేసి అన్చో రాహు దోషం తొలగును. పంచ లోహములతో చేసిన ఉంగరము ధరించుట సాంప్రదాయం. శుభతిధి గల శనివారము నాడు రాహుమంత్రమగు ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః అను మంత్రమును 40 రోజులలో 18 వేలు జపము పూర్తి చేసి, 41వ రోజున మినుము చల్లని బట్టలో వేసి దానం చేసినచో రాహుగ్రహ సంబంధమైన దోషం తొలగిపోవును.

 కేతు గ్రహ దోష నివారణకు సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, మేజ మూత్రం, మారేడు పట్ట, ఏనుగు దంతం, (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి).  ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను. కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేస్తూ ఉలవలు దానం ఇవ్వాలి. వైఢూర్యం, నూనె, శాలువా, కస్తూరి, ఉలవలు వీటిని దానం చేసినా కూడా కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.

ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్మతో తవ్వబడిన మట్టి, మేక పాలు కలిపి ఆ నీటితో స్నానం ఆచరిస్తే కేతుగ్రహ దోష నివారణ కలుగును. పంచలోహముల ఉంగరం ధరించుట సాంప్రదాయం. శుభ తిధి గల మంగళవారం నాటి నుంచి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రంలో ఉలవలు పోసి దానమిచ్చిననూ కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.

లోకాస్సమస్తాస్సుఖినోభవంతు

Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.





Post a Comment

0 Comments