Ad Code

తైజసాత్మికా (పంచాక్షరి) - Panchakshari

తైజసాత్మికా (పంచాక్షరి)



ఇది అయిదు అక్షరాలు గల్గిన మంత్రము. పూజాసమయంలో “తైజసాత్మికాయై నమః"
అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

తైజస - ఆత్మికా = స్వప్నావస్థకు సూక్ష్మశరీర అభిమానియైన జీవుడిని తైజసుడు అందురు. అతని స్వరూపమైనది పరాశక్తి.

స్వప్నావస్థలోని మనోమయ శరీరం మాత్రమే ఉంటుంది. అది తేజస్సు కలిగి మహా సూక్ష్మమైనదియు, వేగవంతమైనదియును అగును. సమష్టి స్వప్నావస్థలో జీవుడిని హిరణ్యగర్భుడు అందురు.

“స్వప్నేతు జీవః సుఖదుఃఖభోక్తా
స్వమాయయా కల్పిత జీవలోకే” (కైవల్యోపనిషత్తు)

ఉపనిషద్కారికా భావము:- స్వప్నావస్థయందు జీవుడు మనోమయ కల్పితమైన లోకమునందు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ విహరిస్తూ ఉంటాడు.

జాగ్రదవస్థా భావములే సామన్యంగా స్వప్నావస్థలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. అందుచే జాగ్రదవస్తను దేవిమయంగా గడిపే వారికి స్వప్నావస్థయును దేవీమయంగా పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది.

స్వప్నావస్థాభిమానియైన తైజస రూపిణిని దేవీమయంగా భావించి సాధకుడు పవిత్రంగా వర్తించి, శుభ స్వప్నములను పొందడానికి సర్వకాల సర్వావస్థలలోను యత్నించి శుభములను పొందుటయే ఈ మంత్రోపాసనా ఫలము అగును.





Post a Comment

0 Comments