Ad Code

శ్రీ విద్యా కల్పసూత్రాలు

శ్రీ విద్యా కల్పసూత్రాలు



ఓం శ్రీ లలితాయై నమః

శ్రీ లలితా దేవిని మంత్ర, యంత్ర సహితంగా తంత్రోక్త పూజలు చేస్తూ లయ యోగంతో సాధకుడు తనలోని జీవ శక్తిని ఆ పరాశక్తిగా రూపాంతరం చెందించడమే శ్రీ విద్య లక్ష్యం. ఈ విద్యకు మూల స్థంభాలై బాలా, పంచదశి మంత్రాలు, త్రిశతి, శ్రీ చక్రం, ఖడ్గమాల, లలితా సహస్రనామం ఉన్నాయి. ముందుగా లక్ష్యమైన శ్రీ లలిత లక్షణాలను సహస్రనామ వ్యాఖ్య ద్వారా వివరించడం మొదలు పెట్టి క్రమేణా త్రిశతి వ్యాఖ్య ద్వారా పంచదశీ మంత్ర సాధన చేయాలి. శ్రీ చక్రాన్ని ఖడ్గమాల ద్వారా తెలుసుకొని కుండలినీ షట్చక్ర సాధన, అష్టాంగ యోగమార్గాన్ని సమన్వయం చేసుకొంటూ ముందుకు కదలాలి. సందర్భాను సహితంగా శాక్తేయ ఉపనిషత్తులను, తంత్రాలను, సౌందర్య లహరి, కామకళా విలాసం వంటి స్తోత్రాలను, మార్కండేయ పురాణాంతర్గత చండీ సప్తశతిని అర్థ సహితంగా పారాయణం చేస్తూ ముందుకు సాగాలి. వేద, శాస్త్ర సూక్త శ్లోక వివరాలు, ఆధునిక శాస్త్రం ఏ విధంగా ఈ శక్తి తత్వాన్ని నిరూపిస్తున్నది సమన్వయం చేయాలి. కుండలిని శక్తిగా మారిన ఆ మహా శక్తి జీవ స్వరూపం జాగృతం చేసి నిత్య జీవిత ఇహ భోగాలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది తెలుసుకొని ఉపయోగించాలి. వేదాంత సూత్రాలను, త్రిమతాచార్యుల అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత మతాలకు సమన్వయం చేసుకొంటూ సంశయ నివృత్తి చేసుకొంటూ పోవాలి. శివ, విష్ణు తత్వాలకే మూలమైన ఆ పరాశక్తిని ఏక తత్వంగా ఆరాధిస్తూ ఇహ పర భోగ సాధనకు చేసే సాధనలకు ఉపయోగపడే విధంగా, వామ దక్షిణ సమయాచారాలను విశదీకరిస్తూ ఆయా స్థాయి సాధకులకు భావనోపనిషత్తు ఆధారంగా అంతర్ముఖ ఆరాధన సూచించడమే ఈ వ్యాఖ్య లక్ష్యం. ఆ పరా శక్తి కృపతో సాధ్యమైనంతవరకు ఈ తనువు ఉపకరించినంత కాలం ఈ శ్రీ విద్య అనే జ్ఞాన యజ్ఞం కొనసాగిద్దాం. అన్నిటికంటే ముందు ఆ శ్రీ లలిత విశ్వరూపం విప్పి చెప్పింది లలితా సహస్రనామం. ఈ సహస్రనామ వ్యాఖ్యతో ప్రారంభించి శ్రీ విద్య లక్ష్యం తెలుసుకొని ముందుకు సాగుదాం.
లలితా సహస్రనామ వ్యాఖ, పీఠిక:
అగస్త్యుడు ఎంతో కాలం ఇంద్రియాల అధీనంలో ఉన్న బుద్ధిని స్వాధీనం చేసుకోవడానికి కుంభకాన్ని సాధన చేశాడు కనుక కుంభ సంభవుడు అన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య లోపాముద్ర కూడా ఆ లలితా దేవిని స్వీయ సాధన చేసింది. దేవి ఆదేశం తోనే హయగ్రీవుడు వీరిద్దరికీ శ్రీ విద్య సాధన చెప్పారని తెలుస్తున్నది. ఇక్కడ పరాశక్తిని హయగ్రీవుడుగా, సాధకుడిని అగస్త్యుడు గా, ఆయన జీవ శక్తిని లోపాముద్రగా అంతరార్థంలో చెప్పవచ్చు. ఈ రహస్య విద్యను అజ్ఞానులకు, దుష్టులకు, నమ్మకం లేని వారికి చెప్పడం వలన విపరీత వాదనలు, అర్థాలతో దాని మూల స్వరూపం భంగం అవుతుంది. కనుక యోగ్యులకే ( పరిపక్వత ఉన్నవారికే ) చెప్పమని అన్నారు. బాహ్య అంతర యాగాలను నిత్యం చేసే వారిని ఉపాసకులు అన్నారు. అనుభవం ఆధారంగా నిర్మించబడిన 64 ఆగమ తంత్రాలలోనూ, పురాణాలలోనూ ఆ శ్రీ లలితకు అనేక నామాలు ఉన్నాయి. అవి ఆయా అనుభవాలకు వచ్చిన రూపాలు కనుక సాధకుడు తన స్థాయి, అనుభవాలకు అనుగుణంగా ఉన్న రూప నామాలను తీసుకోవాలి. హిందూ మతంలో అనేక దేవతలను కొలవడానికి కారణం ఇదే. మంత్రాలు పిండ ( ఏక ), కర్తరి ( రెండు ), బీజ ( మూడు నుంచి తొమ్మిది ) మంత్ర ( పది నుండి ఇరవై ), మాల ( ఇరవై పైన ) అక్షర సముదాయం ఆధారంగా ఐదు రకాలు. పదిహేను మాతృకల పంచదశి వంటి దాన్నే మంత్రం అంటారు.
లయ మంత్రయోగ శాశనాలతో జాగృతమైన శక్తిని (బాహ్య అంతర అవయవ శక్తిని ) కుంభకంతో ( మొదట బాహ్య, తరువాత కేవల ) ఏకీకృతం చేయాలి. ఆ ఏకీకృత శక్తిని సర్వ అవయవాల నుండి వచ్చే నాడీ ప్రసరణ మండలం నుండి ప్రత్యాహారం తో సుషుమ్న ( spinal chord ) వైపు ప్రయాణం చేయిస్తే సాధకునికి కుండలినిగా వివిధ చక్రాలలో ( important nerve ganglion in spinal chord ) అనుభవానికి వస్తున్నది. అంతవరకు అసంకల్పితంగా శరీర పోషణకు మాత్రమే ఉపయోగపడే జీవ శక్తిగా ఉన్న ఆ పరా శక్తి లేక విద్వదయస్కాంత శక్తి అంతర్గతంగా జాగృతమై చిత్ స్వరూపం చైతన్యంగా మారుతుంది. ఈ చైతన్యం తన సమతుల్య, జ్ఞాన సాధనతో స్వస్వరూపం లేక స్వస్థత కలిగిన స్థానం అయిన సహస్రారం వెదుక్కొంటూ ప్రయాణిస్తుంది. ఈ ప్రయత్నంలో మొదట శరీరం లోని ఆయా చక్ర స్థానాలలో అది బాల నుంచి కుమారిగా, కాళిగా, లక్ష్మి గా, సరస్వతిగా ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని శాసిస్తూ ప్రయాణిస్తుంది. నిరంతర రూపాంతరం చెందుతూ సంతులిత సంకల్పమై, త్రిగుణాతీతంగా స్థిరమౌతూ తన చుట్టూ ఉన్న భౌతిక, మానసిక, దివ్య ఆధ్యాత్మిక స్థితుల పరిణామానికి కారణమౌతుంది. జ్ఞాన, శక్తుల కలయికలో శ్రీ గా పరిపూర్ణ స్థిరత్వం చెందిన తరువాత శ్రీ లలిత అవుతుంది. అసంకల్ప లలిత గా శరీరంలో ప్రవేశించి మూలాధారంలో అగ్నిరూపంగా ఉన్నా బాల అనే ప్రచండ జీవ శక్తి సహస్రారంలో ముగ్గురమ్మల మూలపుటమ్మ గా సమతుల్య సంకల్పిత శ్రీ లలిత గా మారి సృష్టి స్థితి లయ కారిణిగా మారుతుంది. ఈ స్థాయిలో సాధకుడు త్వమేవాహం లేక అహం బ్రహ్మాస్మి స్థాయికి చేరుకొంటాడు. సహస్రార స్థాయిలో నిరంతరం తన స్వస్వరూప ధ్యానంలో ఉంటూ తన శరీరం, పరిసరాలు, సంఘం, ప్రకృతికి అనుగుణంగా మానవుణ్ణి విష్ణు రూపంగా దిద్ది సమతుల్య సాధన చేయడాన్ని కర్మ యోగం అంటారు.
పంచదశి లో క తో మొదలయ్యే కాదివిద్య, హ తో మొదలయ్యే హాది విద్య అని ఆయా సాధకుల అనుభవాలను బట్టి వివరించబడ్డాయి. ఆ తరువాత ఆ మంత్రంలో శ్రీ ని చేర్చారు. నాలుగు ఈ కారాలతో సమస్త ఫలితాలను ఇచ్చే బీజాక్షరమని ఋగ్వేదం (4:47) చెప్తున్నది. శ్రీ ని పంచదశికి కలిపితే షోడశి అంటే పదహారు అక్షరాల మాల మంత్రం అవుతున్నది. ఆ శ్రీ ని సాధన చేసే విద్య కనుక శ్రీ విద్య అన్నారు. పంచ దశి సాధనలో నాదాన్ని, ప్రాణాన్ని జీవ శక్తిలో లయం చేస్తే శ్రీ తో కూడిన షోడశి గా ఆ పరాశక్తి సంకల్పిత సమతుల్య స్థిరత్వ స్థితికి చేరుతుంది. ఈ స్థితిలో తన శక్తిని, బుద్ధిని సాధకుడు తన ఇచ్చానుసారంగా ఉపయోగించి శరీరాన్ని, పరిసరాలను, ప్రకృతిని ఫలితం వైపు నడిపిస్తాడు. దీనికి సంకల్పం, సమతుల్యం, శ్రద్ధ, మేధ, సహనం తోడై అణిమాది అష్ట సిద్ధులతో అనేక శక్తులతో ( ఖడ్గమాల శక్తులు ) ఆయా స్థానాలను ప్రభావితం చేస్తూ అపరాజితగా ఈ దృశ్య ప్రపంచం పై ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఈ స్థాయి పురుషులను అవతార పురుషులుగా, కారణ జన్ములుగా సనాతన ధర్మం పేర్కొంటున్నది.
న్యాసంతో ప్రాణాయామం ( భూర్భువ స్సువరోం ఇతి దిగ్బంధ ) సంధించి ధారణతో ఆయా అవయవాలను శక్తిమయం (అంటే వాటిలో నిబిడీకృతమై ఉన్న శక్తిని జాగృతం) చేయాలి. న్యాసంలో ఆయా శరీర చక్ర స్థానాలలో చెప్పబడిన దేవతలను లేక శక్తులను ఆయా బీజాక్షరాలతో ప్రాణాయామ ధారణ ధ్యానాలను సంయోగం చేసి సాధన చేయాలి. ముందు మంత్ర పురచ్చరణ లో artham, భావం, నాదంగా లయమౌతుంది. నాదం ప్రాణంగా, ప్రాణాన్ని కుంభకంతో కేవలంగా మార్చి, ఆ ప్రాణాన్ని కదిలించే బుద్ధిని, దాన్ని కదిలించే శక్తిని గుర్తించి దాని పై ధారణ, ధ్యానం చేయాలి. అప్పుడు శరీరమంతా అసంకల్పితంగా ఉన్న శక్తి సంకల్పిత శక్తి గా మారుతుంది. బహిర్యాగములో పూజాది నిత్య కార్యక్రమాల ద్వారా యమ, నియమాలను సాధించి, అంతర్యాగంలో ప్రాణ సాధన ద్వారా జీవ శక్తిని ప్రాణంతో ఏకీకృతం చేసి మూలాధార కుండలినిని జాగృతం చేసి సహస్రారం వైపు నడపాలి. ఎనిమిది అష్టకాలతో పూర్ణంగా నడిపే బాహ్య యాగాన్ని ( వరివస్య రహస్యం ) మహాయాగం అంటారు. ఆ తరువాత బాహ్య అవయవాల ( అంగన్యాసం ) నుండి అంతర అవయవాల ( హృదయాన్యాస ) పై దృష్టి కేంద్రీకరించి పైన చెప్పినట్లు ధారణతో శక్తిని జాగృతం చేయాలి. మహాయాగం అని హయగ్రీవుడు చెప్పిన ఈ పురచ్చరణ, జపం అంతర్యాగమై ఉన్నాయి. ముఖ్య న్యాసాలుగా పరాశక్తి, జీవ శక్తి రూపాలైన గణేష, గ్రహ, నక్షత్ర, యోగిని, రాశి, పీఠ అనే ఈ ఆరింటి న్యాసాన్ని శోధన్యాసం అంటారు. ఈ అనుభవాలు చక్రాలలో జరిగినప్పుడు చక్ర న్యాసం అంటారు. ఇవి గాక అంగ న్యాస హృదయ న్యాసం అని కూడా ఉన్నాయి. వారి వారి సాధన అనుభవాల ఆధారంగా ఈ ప్రయోగాలు గురుముఖంగా తెలుసుకొని దీక్ష తీసుకొని ( శక్తిపాతం ద్వారా ) చేయాలి. హోమ ఖండంలో ( బాహ్య, అంతర హోమము – శరీరం చేసే నిత్య నైమిత్తికాలే హోమం కావాలి ). హయగ్రీవుడు చక్ర, విద్య, శ్రీ దేవి, గురు శిష్యుల ఐక్య సాధనను రహస్య కాండంగా చెప్పారు. ఐక్యం అంటే ఇవన్నీ ఒకటిగా అనుభవంలోకి తెచ్చుకొని విడిగా ఉన్న అన్నిటిని ఆ పరాశక్తి లో తాదాత్మ్యం (సాలోక్యం, సాన్నిధ్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం) చేసి ఓం తత్ సత్ అనే భావనతో తన స్వస్వరూపమైన ఆ సమతుల్య సంకల్పిత శ్రీ లలితను చేరుకోవాలి. యోగినీ హృదయంలో చక్రాలను త్రైలోక్య మోహన, సర్వాశా పరిపూరక, సర్వ సంక్షోభణ, సర్వ సౌభాగ్య దాయక, సర్వార్థ సాధక, సర్వ రక్షాకర, సర్వ రోగహర, సర్వ సిద్ధిమయ, సర్వానందమయ చక్రాలుగా ( ఇవే ఖడ్గమాలలో కూడా ఉన్నాయి )చెప్పారు. స్తోత్ర కాండంలో దేవి స్వస్వరూపాన్ని వివరించారు. యోగినీ హృదయంలో ఈ శోథ న్యాసాలు ( గణేష 51, గ్రహ 9, నక్షత్ర 27, యోగిని 7, రాశి 12, పీఠాలు 51 ) గా చెప్పబడ్డాయి. శరీరంలో వివిధ భాగాలలో ఉన్న ఈ శక్తులను క్రింద చెప్పిన విధంగా సాధనతో జాగృతం చేయడమే న్యాసం. మంత్ర పురచ్చరణ సహితమై చేసే ఈ ఆరు న్యాసాలు 5 అవస్థలలో, 7 విశ్వవసు స్థితులలో ( ప్రాణ, మంత్ర, నాడి, ప్రశాంత, శక్తి, కళ మరియు తత్వ ) ప్రసరిస్థాయి. రాజశ్యామల తంత్రంలో మంత్రిణి శక్తి ( జీవ పరిపాలనలో సహాయకురాలిగా ), దండిని లేక వారాహి గా ఇంద్రియ స్వాధీనంలో ఉపయోగపడతారని చెప్పారు.
కాది ( శుద్ధ )విద్య: బిందువుతో కలిపి తొమ్మిది చక్రాలుగా ఉన్న శ్రీ చక్రం నుండి మాతృకలు, వర్ణాలు, మూడు బిందువులు, మూడు నాదాలు వెలువడి 36 తత్వాలుగా ( శివ, శక్తి, సదాశివ, ఈశ్వర, శుద్ధవిద్య, మాయ, కళ, కాల, విద్య, రాగ, నియతి, పురుష, ప్రకృతి, అహంకార, బుద్ధి, మనసు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, 5 పంచ మహాభూతాలు కలిసి 36 తత్వాలు ) పరిణమించి వ్యాపించాయి. బిందువు నుండి త్రికోణ చక్ర ఆవరణకు మధ్య ఉన్న ప్రదేశాన్ని చక్రం లేక వాసనా రూపమైన శ్రీదేవి శరీరం లేక శివ తత్వం అంటారు. శ్రీ దేవి శరీరం నుండి ఆయా దేశ కాల సమయ సాధనల ఫలితంగా అనంత శక్తులు విడుదలై సాధకునిపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. జాగరూకుడై ఉండక పొతే ఇవి శరీరం పై పని చేసి తిరిగి అసుర ప్రవృత్తిని కలుగ చేస్తాయి. అందుకే శ్రీ విద్యలో తత్వ ప్రత్యాహారం కూడా ముఖ్యమైన సాధన. తత్వాలు అధీనమైన సాధకునికి ఈ శక్తులు ( అణిమాది అష్ట సిద్ధులు వాటి ఉప సిద్ధులు ) ఆయా స్థాయిలో తురీయ అనుభూతిని ధారణ, ధ్యాన, సమాధి ద్వారా కలుగ చేస్తుంటాయి. శరీరం పై వాటి ప్రభావానికి లొంగకుండా సాధన ముందుకు సాగితే తురీయం, తురీయాతీతం లభించి కైవల్యం అనే మోక్ష స్థితి సిద్ధిస్తుంది. ఇక్కడ ఆ ముక్త స్థితిని ( సంకల్ప సమతుల్య స్థితి చైతన్య జ్ఞాన శక్తి స్థాయి ) స్థిరం చేసుకొని ముందుకు సాగితే అనంత బ్రహ్మాండంలో నిండి ఉన్న ఆ పరాశక్తి జ్ఞాన ప్రతినిధిగా సత్య శాశ్వత శుద్ధ శక్తిగా మనుగడ సాగిస్తారు. అటువంటి సాధకులు ( శ్రీ దత్తాత్రేయ, నవ నాథులు ) ఈ బ్రహ్మాండంలో జ్ఞాన చైతన్యంతో సంచరిస్తూ ఆయా సమయాలలో జ్ఞానాన్ని ఉద్ధరించడానికి మానవ అవతార రూపాలలో జన్మిస్తూ ఉంటారు లేక తమ జ్ఞాన ముక్త చైతన్య స్థితిలో (నేను అనే పూర్ణాహంభావం ) మనుగడ సాగిస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు (అసమతుల్యతా భావ కారణం వలన తమ స్థితి భంగం జరిగినప్పుడు) వీరి నుండి ప్రకాశ విమర్శ బిందువులు ( సంవిత్ బిందువు ) వెలువడి తిరిగి సృష్టి కార్యం నిర్వహిస్తూ ఉంటారు. మానవ జీవితం గమనిస్తే ఆ పరా శక్తి మానవుని జీవ శక్తి గా ఉండి చేస్తున్న పని అదే. కాకపొతే అది అసమతుల్య అసంకల్పిత చర్యలాగా జరుగుతున్నది కాని పూర్ణ స్వస్వరూప జ్ఞాన సంకల్పం తో జరిగే సమతుల్య చర్య కాదు. ఇదే మానవునికి, సాధకునికి, దైవానికి ఉన్న తేడా. ఈ నేను అనే భావాన్ని శరీరానికి ఉపయోగిస్తే సాధారణ మానవుడు, సంఘానికి ఉపయోగిస్తే నాయకుడు, ప్రకృతి తత్వాలపై ఉపయోగిస్తే సాధకుడు, ప్రకృతిని దాటితే సిద్ధుడు, ప్రకృతిని అధీనంలో ఉంచుకొని తన చుట్టూ సమతుల్యత చేస్తూ ఉంటే దైవం అన్నారు. ఆ పరాశక్తి లో జ్ఞాన సమతుల్య సంకల్పాలతో (లక్ష్మీ కాళి సరస్వతుల ఏక తత్వం) లీనమై ఉంటే ముక్తుడు అన్నారు. అందుకే దుర్వాస, భృగు వంటి మహర్షులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా శాపమిచ్చే శక్తిని కలిగి ఉన్నారు. శుద్ధ విద్య అయిన కాది విద్యతో బయటకు వెలువడిన ఈ తత్వాలను తిరిగి ప్రత్యాహారం చేసి సదాశివ తత్వం అర్ధభాగమైన సమతుల్య శుద్ధ శ్రీ లలితా తత్వాన్ని చేరాలి. ఆ పైన శివ శక్తి సమన్వయమై సంకల్ప సహిత శ్రీ లలిత గా మారాలి. ఈ ఉపాసనలో సాధకుడు తాను ఆరాధించే శ్రీ లలిత తత్వాన్ని చేరి ( జ్ఞాని జ్ఞానమై సాధనతో జ్ఞేయమై ) త్వమేవ అహం అని ఏకమౌతాడు. సదాశివ లేక పరమశివుని అస్తిత్వం చేరగానే తాను ఆది నాథుడు లేక ఆది గురు తత్వాన్ని పొందుతాడు. ఇటువంటి సాధనలు అవి సాధించిన గురువుల ద్వారా మాత్రమే నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. కనుకనే వాటిని రహస్యం అన్నారు. అదే విధంగా శిష్యులు ఆ గురు తత్వాన్ని ( జ్ఞేయ స్వాధ్యాయ సాధన ల్లో స్థాయిని గుర్తించి )నిరంతరం ఆరాధించి గురు తత్వాన్ని పొందాలి. జీవించి ఉన్న గురువులు ప్రత్యక్ష బోధనలు, శక్తిపాతం ద్వారా తమ శిష్యులను ఉద్ధరిస్తారు. స్వాధ్యాయ ( జ్ఞాన కాండ )సాధనాల్లో ( కర్మ కాండ – జప, తప, శ్రీ చక్ర ఆవరణ పూజ, హోమము, సహస్రనామం తో ) క్లిష్టతను విప్పి మార్గం సుగమం చేస్తారు. శివ సూత్రాలలో చెప్పినట్లు అటువంటి శక్తి తత్వ సాధకులు తమ భూత తత్వా లను ఉపసంహరిస్తే విశ్వం వారి వైపు ఆకర్షించబడుతుంది. మానవులలో ఈ ఆకర్షణను స్థాయిని బట్టి వారి అభివృద్ధిగా చూస్తూనే ఉన్నాము.
న్యాసం చేసేటప్పుడు పాదాలలో కీలకం, ఆధారంలో శక్తి, నాభిలో బీజం, హృదయంలో త్రిపుర సుందరిని భావన చేస్తూ లలితతో కూడిన వశిని మొదలైన దేవతలను ఆజ్ఞనుండి సహస్రారం వరకు ఆయా చక్రాలలో బీజాక్షరాలతో మానసిక మంత్రోచ్ఛారణతో న్యాసం చేయాలి. బాహ్య రూపాన్ని హృదయం వరకే ధ్యానం చేయాలి. ఆ పరాశక్తి సాధన తో అద్భుత శక్తులు కలిగిన మనుష్యులకు ఆరాధన, ప్రీతి పెరిగి క్రమేణా జీవన లక్ష్యంగా మారుతుంది. ఇది భిన్న స్థాయిలలో ఉంటుంది కనుక భిన్న దేవతారాధనలు జరుగుతున్నాయి. రూపం శక్తిగా మారిన తరువాత అది సహస్రారం వైపు ప్రయాణిస్తుంది. సహస్రనామాలు ఆ పరాశక్తి శ్రీ లలిత వివిధ రూప నామ క్రియా ఫలితాలుగా చెప్పబడ్డాయి.
బ్రహ్మను రెండు రకాలుగా చెప్పబడింది. సకల లేక ఆపర ( రూప నామాలు కలిగిన బాహ్య రూపం ) నిష్కళ లేక పర ( రూప నామాలు లేని నిర్గుణ పరబ్రహ్మ ) అని రెండు రకాలు. ఒకటి బాహ్య రూపమైతే ( పదార్ధం లేక శివుడు ) రెండవది అంతర్గత శక్తి చైతన్యం. ఒకటి నిమిత్తకారణమైతే రెండవది పరిణామకారణం. ఆపర తిరిగి చరాచర జీవులుగా, దివ్య, మానవ, పశు, అసుర ప్రవృత్తి గల వారిగా ఉన్నారు ( వ్యాసుని బ్రహ్మ సూత్రాలు ). మానవునిలో శక్తి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలలో ప్రాజ్ఞుడు, తైజసుడు, విశ్వవసువుగా ఉన్నది. దేవి హిమవంతునికి ధ్యాన ప్రక్రియ చెప్తూ నా అవ్యక్త బ్రహ్మ రూపం నీకు అవగతం కాకపొతే నీ బుద్ధికి అందిన నా అనంత సకల నామ రూపాలలో దేనినైనా గుర్తించి, ధ్యానించి తాదాత్మ్యం చెందమని ( బాహ్యారాధన ) చెప్పింది. కాని నా నిష్కలా రూపాన్ని చూడడానికి జ్ఞాన యోగ లయంతో కాని సాధ్యం కాదు అన్నది. నిష్కలను ధ్యానించే సాధకులకు ఆహారం అన్ని వైపులనుండి సునాయాసంగా అందుతుంది అని బృహదారణ్యకోపనిషద్ ( 4:4:24 ) చెప్తుంది. ఓం కారాన్ని ఉదాత్త, అనుదాత్త, మానస, అనుస్వరంతో కూడిన ఔకారం ఆయా పరిణామ స్థాయి సాధకులు పలకడానికి అర్హులు. ప్రణవం ( అ ఉ మ్ అనీ మూడక్షరాలు చంద్ర సూర్యాగ్ని మండలాలు, బాహ్య అంతర సహస్రార సంతులిత సంకల్పిత స్థాయిలకు సూచనలు )స్థిర చైతన్యమై ప్రతి మంత్రానికి మొదట చివర ఉచ్చరిస్తే లక్ష్యం నుండి దృష్టి మరలదు. ఆ శ్రీ లలితను సచ్చిదానంద రూపం ( The Unity of Existence, Consciouness and Bliss ) గానే ఆరాధించాలి. అది ముందుగా సాధ్యపడకపోతే సాధకుని జ్ఞాన స్ధాయిని బట్టి ఆ తల్లి అనంత నామ రూపాలను కొలవ వచ్చును. సకల నిష్కళ రూపాలను వాటి సాధనను, వాటి వలన వచ్చే ఇహ పర సౌఖ్యాలను లలితా సహస్రనామం చెప్తున్నది. సహస్రనామం మొదట అద్భుత సౌందర్య రాశి అయిన సకల రూపంగా ప్రారంభించి చివరకు పదార్థ శక్తి ఐక్య రూపమైన శివ శక్తి ఏక రూపిణిగా ముగిస్తారు. ఈ మధ్యలో ఉన్న నామాలు సాధకునికి వివిధ దశలలో ఆయా చక్రాలలో వచ్చే రూప నామ అనుభూతులు వివరిస్తున్నాయి. తంత్ర శాస్త్రమంతా పరశురామ కల్ప సూత్ర ఆధారంగా నిర్మితమయ్యింది. ఈ వ్యాఖ్య భాస్కర రాయల లలితా సహస్రనామానికి ఆంగ్లేయ అనువాదం ( 1899 ) చేసిన అనంతకృష్ణ శాస్త్రి గారి పుస్తకం ఆధారంగా చేయబడింది. భాస్కర రాయలు గంభీరభారతి కోనమాంబ ల రెండవ సంతానం గా తనుజ అనే గ్రామం, విజయ అనే జిల్లాలో మహారాష్ట్రం లో జన్మించారు. ఈయన నృసింహ అనే గురువు దగ్గర శ్రీ విద్యతో పాటు అష్టాదశ విద్యలు నేర్చుకొన్నారు. భాస్కర రాయలు ఆసేతు హిమాచలం పర్యటించి అనేక మంది రాజులకు వారి కుటుంబీకులకు శ్రీ విద్యా దీక్ష ఇచ్చారు. అనేక దేవాలయాల ఉద్ధరణ చేశారు. ఈయన భార్య ఆనందితో కలిసి కాశీ లో కొన్ని సంవత్సరాలు వసించి అక్కడినుండి నుండి దక్షిణంలో కృష్ణా, కావేరి నదీ సమీపంలో స్థిరపడ్డారు. తంజావూరు జిల్లాలోని భాస్కర పురంలో స్థిరపడి తన శ్రీ విద్య పూజ ను స్థాపించారు. ఈయన లలితా సహస్రనామ భాష్యాన్ని 1785 లో పూర్తి చేశారు. భాస్కర రాయలు వ్రాసిన వరివస్య రహస్యం, లలితా సహస్రనామ భాష్యం, సేతుబంధ అనే గ్రంధాలు దేవి పై శ్రీవిద్యపై ప్రస్థాన త్రయంగా చెప్తారు. మూలాధారంలో కుండలినీ జాగృతం నుండి సహస్రార ప్రయాణం చేసి అక్కడ సమాధి స్థితిలో ఆ శ్రీ లలితగా ఐక్యం కావడమే శ్రీ విద్య ( ఈ విషయం సౌందర్య లహరి పదవ శ్లోకంలోనూ, ఈ సహస్రనామ వ్యాఖ్య లో 90-110 శ్లోకాల వ్యాఖ్య లో విశదీకరించబడింది.
వేదవ్యాసుని అష్టాదశ పురాణాల్లో చివరి బ్రహ్మాండ పురాణం రెండవ అధ్యాయంలో మూడు భాగాలుగా 320 శ్లోకాలతో లలితా సహస్రనామం ఉంది. వేదాలలో జ్ఞానం నిగూఢంగా ఉండడం వలన పురాణ, రామాయణ, భారత, భాగవత గ్రంధాల ఆధారంగా అప్పటి చరిత్ర, సంస్కృతి ఆధారంగా వాటిలోని జ్ఞానాన్ని విశదీకరించారు. తంత్ర శాస్త్రం మీద విద్యారణ్య మునీంద్రులు రచించిన విద్యారణ్య అనే గ్రంథ రాజం ఇప్పుడు కాశ్మీరులో జమ్మూ లైబ్రరీ లో ఉంది. కాని ఈయన విజయనగర సామ్రాజ్య నిర్మాణంలో ఉన్న విద్యారణ్యుడు అనేది తెలియదు. భట్ట నారాయణుడని మరొకరు లలితా సహస్రనామ వ్యాఖ్య వ్రాసినవారు. ఆది శంకర కృతి అయిన సౌందర్య లహరి లోని మొదటి 41 శ్లోకాలు ఆనంద లహరి గానూ, 42నుంచి 100 వరకు సౌందర్య లహరి గానూ వర్ణిస్తారు. భాస్కర రాయలు ఎక్కువగా సౌందర్య లహరి ఆధారంగా వ్యాఖ్య చేసినట్లు కనపడుతుంది. భాస్కర రాయలు తన సహస్రనామ వ్యాఖ్యలో మొదట ఆ త్రిపుర సుందరిని ప్రార్థిస్తూ ” ఎఱ్ఱని వర్ణంతో కామ రాజ రూపం కలిగిన అవయవాలతో బిందువు లో ఏకాంతవాసంలో ఉండి సృష్టి గా పరిణమించే ఆ త్రిపురను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణాలతో ఆరాధిస్తున్నారు” అంటారు. మూడు వృత్తాల భూపురంలో, మూడు కోణాల మధ్యలో మూడు బీజాక్షరాల మంత్రంలో మూడు రూపాలతో ( మహాకాళి, మహా సరస్వతి, మహా లక్ష్మీ ) ఉన్న ఆ శ్రీ లలితను మహాత్రిపుర సుందరి అంటున్నారు. కౌళంలో కుల అంటే సుషుమ్నలో దారి, కు పృథ్విని ల లయం చేసేది, కుల అంటే తత్వ లయం కావించేది అని అర్థం. కులనిధి అంటే దేవి నివాసం అని అర్థం. ధర్మ బద్ధమైన నిష్కామ పుణ్య కర్మలతో మనో నిగ్రహం, శరీర దృఢత కలిగి, సద్గురు బోధలతో జ్ఞానం ( పరోక్ష అపరోక్ష ) వికసించి శ్రీ దేవి ఆరాధనకు బీజం పడుతుంది. ఇంద్రియాలు మనస్సులో మనస్సు ప్రాణంలో, ప్రాణం బుద్ధిలో, బుద్ధి శక్తిలో లయమై నిర్మలుఁడైన శివ సాక్షాత్కారం లభించి ప్రకృతి వికృతులనుండి విముక్తుడై కైవల్య మార్గంలో ప్రయాణిస్తాడు. సహస్రనామం లో 51 శ్లోకాలు పీఠికగా, 182 1/2 శ్లోకాలు నామాలు గా, మిగిలిన 86 1/2 శ్లోకాలు ఫల శ్రుతిగా ఉన్నాయి.
ప్రకృతిని ఉపేక్షించిన పురుషుడు ఇరవై ఆరవ తత్వమైన ఆ శక్తిని కేవల నిర్వివాద స్థితిలో పొంది నిత్య నిరంజనుడై ముక్తిని పొందుతున్నాడు.
ఓం తత్ సత్ !!






Post a Comment

0 Comments