సూర్య నమస్కారాలు
సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా, అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.
ఆసనానికో ప్రయోజనం:
సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా, అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు, వీటిలో ఒకటి నుంచి ఐదు, ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం.
ఒకటి, పన్నెండు: శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.
రెండు, పదకొండు: జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.
మూడు, పది: రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.
నాలుగు, తొమ్మిది: వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఆరో ఆసనం: మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఏడో ఆసనం: జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.
మరెన్నో లాభాలు:
సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు. మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. “సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.
ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు. సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
1. నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.
2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః):
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.
3. పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః):
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.
4. ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ):
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.
5. పర్వతాసనం ( ఓం ఖగాయ నమః):
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
6. సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః):
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి ‘అష్టాంగ నమస్కారం’ అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం – ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.
7. సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ):
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.
8. పర్వతాసనం ( ఓం మరీచయే నమః):
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
9. ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః):
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి
10. పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః):
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.
11. హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః):
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.
12. నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః):
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.
0 Comments