ఇది నాల్గు అక్షరముల మంత్రము. పూజా కాలంలో “మహాభోగాయై నమః” అని శ్రద్ధా భక్తులతో
ఉచ్చరించాలి.
మహాన్ భోగః యస్యాః మహభోగా అనగా - మహిమా విశిష్టమైన భోగము గలది శ్రీదేవి.
మరి కొందరు "మహంతః భోగాః యస్య సః మహాభోగా" అనగా (1) అన్నము (2) వస్త్రము (3) గంధము (4) పుష్పము (5) శయ్య (6) తాంబూలము (7) పురుష (లేక స్త్రీ) సుఖము (8) గానము అనే అష్ట విధాలైన భోగాలు సమృద్ధిగా గలది అని వ్యాఖ్యానిస్తారు.
భుజ్యతే ఇతి భోగః = అనుభవింపబడునది (భుజ - ధాతువుకు ప్రత్యయము)
భోగ శబ్దమునకు సుఖము అనే అర్ధమును అనుసరించి పై వ్యాఖ్యలు ఏర్పడినవి.
“భోగః సుఖేస్త్యాది భృతే అహేశ్చ కాయయోః" (అమర కోశము)
ప్రస్తుతము శ్రీదేవి విషయంగా - పాము పడగ, పాము శరీరం అనే అర్థాలే సముచితంగా ఉన్నాయి. వెన్నెముకను వెన్నుపాము అంటాము.
జీవశక్తి మూడున్నర చుట్టలు గల్గిన పాముగా మూలాధార చక్రంనందు (పడగతో) నోటితో తోకను కరచుకొని నిద్రిస్తున్న దనియు, ఆ జీవ శక్తి రూపమైన కుండలినిని జాగృతంగావించి, సుషుమ్నా నాడి ద్వారా మూలాధారా, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ద, ఆజ్ఞాచకాలను
దాటించి సహస్రారచక్రాన్ని చేర్చవలయుననియు తంత్రశాస్త్రం బోధిస్తూ ఉంది.
ఇది కుండలినీ విషయము అనగా ఒక వ్యక్తి యొక్క భోగము, అనగా పాము, అనగా జీవశక్తి అగును. ఇక సమష్టి కుండలినీ అయినచో మహాభోగ అగును. దానినే మహామాయ అనియు అందురు.
వ్యష్టికుండలి ఒక భోగము అనగా ఒక పాము. సమష్టికుండలి మహాభోగము అనగా అనంత భోగసమూహము.
కుండలినీ శక్తి సహసారం చేరిన వారికి సుధా సారాభివర్షిణి” కలిగి సంకల్పసిద్ది కలుగుతుంది.
ఈ "మహాభోగా” పదంచే శ్రీదేవిని ఉపాసించే భక్తులకు మొదట వ్యష్టి భోగరూపమైన కుండలినీ విద్య అలవడుతుంది. క్రమంగా తీవ్ర సాధనచే సమష్టి కుండలినీ రూపమైన అనగా మహాభోగాత్మకమైన విశ్వాత్మ భావం సిద్ధిస్తుంది. ఇటుల సర్వభూతాత్ముడు అయి సచ్చిదానంద రూపమైన బ్రహ్మపదమును పొందును. "నచపునరావర్తతే” - జనన మరణ రూపమైన దుఃఖ సంసారానికి తిరిగిరాడు.
0 Comments