ఇది నాల్గు అక్షరాల మంత్రం. పూజా సమయంలో “మహాయంత్రాయై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
మహా = మహిమాన్వితమైన
యంత్రా = యన్త రూపమైనది శ్రీదేవి.
యంత్రాలు బహువిధాలుగా ఉంటాయి. భూప్రస్తారము, మేరుప్రస్తారము, కైలాసప్రస్తారము, శ్రీ చక్రము, రుద్ర యంత్రము, శ్రీ కనకదుర్గ యంత్రము మొదలగునవి. "యంత్రణా ద్యంత మిత్యాహుః" అనే నిర్వచనాన్ని అనుసరించి ఆయా దేవతా శక్తులను నియంత్రించేది యంత్రమగును.
మత్స్యయంత్రము, కూర్మయంత్రము, ఆంజనేయ యంత్రము, మహాలక్ష్మి యంత్రము, సరస్వతీ యంత్రము మొదలైనవి ఆయా ప్రయోజనములను అనుసరించిన యంత్రాలు అగును. తెలుగులో కొన్ని యంత్రాలను తాయత్తులు అనియు అందురు. పసి పిల్లలకు బాలారిష్ట నివారణకై ఆంజనేయాది యంత్రాలు ధరింపజేస్తారు. ధనార్డులు, ధనప్రాప్తికై మహాలక్ష్మీ యంత్రాలను గృహంలో దైవమందిరాన ఉంచి పూజిస్తారు. సరస్వతీ యంత్రాన్ని విద్యార్థులు కంఠంలో ధరిస్తారు.
ఇక ఈ శరీరమే ఒక యంత్రం. బాహ్యమైన యంత్రంలో వలెనే ఇందులో మూలాధారాది చక్రాలు గలవు. అన్నింటికినీ సమన్వయ కర్త సుషుమ్నానాడి. ఈ శరీర యంత్రానికి నియంత్రిణి కుండలినీ శక్తి, సమష్టి కుండలినీ శక్తియైన పరాశక్తి మహాయంత్ర రూపిణి అగును.
సమష్టి కుండలినీ సంకేతమైనది శ్రీచక్రము. ఇది నవావరణ రూపమైనది. నట్టనడుమ ఉండే బిందువు శ్రీదేవి నివాసము. శ్రీచక్ర విస్తారమే సమస్త సృష్టి, ఇటుల సమష్టి కుండలినీ రూపిణియైన శ్రీదేవి మహాయంత్రా అనబడుచున్నది.
ఈ మంత్రంతో శ్రీదేవిని ఉపాసించే వారికి సృష్టి రహస్యం ద్యోతకం అవుతుంది. అంతయును అమ్మ రూపంగా గోచరిస్తుంది. రాగ ద్వేషాలు నశిస్తాయి. ఆత్మ సిద్ధియు, బ్రహ్మప్రాప్తియు, త్వరగా సంభవిస్తాయి.
0 Comments