Ad Code

మహాపాతక నాశినీ (అష్టాక్షరి) - Ashtakshari

మహాపాతక నాశినీ (అష్టాక్షరి)




ఇది అష్టాక్షరమైన మంత్రము. పూజా సమయంలో “మహాపాతకనాశిన్యై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి. మహతాం పాతకానాం నాశః శీలం అస్యాః ఇతి మహాపాతక నాశినీ.

గొప్ప పాపాలను నశింపజేసే స్వభావం గలది శ్రీదేవి. అలాగే గొప్ప పాతకాలను నశింపజేసే స్వభావం గలది శ్రీదేవి.

పాపములకు, పాతకములకు భేదము.

పాపములు:
పరిసర ప్రభావాలచే మనోదౌర్బల్యం వలన చేసేవి పాపములు అనబడును. ఈ పాపాలు చేసే వారికి తాము చేసే పని మంచిది కాదు అని సామాన్యంగా తెలిసి ఉంటుంది. కొందరికి అంతటి పరిశీలనా జ్ఞానం లేకయు ఇలాంటి పాపాలు చేస్తూ వుంటారు.

ఉదా:- నీరు - నీటికి సహజ గుణం చల్లదనము. కానీ వేడియైన వస్తువు యొక్క సంపర్కం వలన ఆ నీరు వేడి గలది అగును. ప్రక్కకు తీసినచో క్రమంగా నీరు మెల్లగా చల్లబడును. అటులనే పరిసర ప్రభావం వలన కొందరు మంచివారు సైతం కోపపడడం, అసత్యమాడడం వంటి చెడ్డ
పనులు చేస్తూ వుంటారు. ఇట్టి వాటిని పాపములు అంటారు. ఇట్టి వాటిని శాస్త్రకారులు సంగ్రహంగా దశవిధాలుగా విభజించారు.

1. అసత్యోక్తి
2. ఇతరులపై లేని దోషాలను స్వార్థంతో ఆరోపించడం
3. కర్కశ భాషణము
4. నిరుపయోగమైన (వాక్కు) సంభాషణ
5. అవసరాన్ని బట్టి దొంగతనం చేయడం
6. ఇతరులు రెచ్చగొట్టడం వలన చెడ్డ పనులు చేయడం
7. చెడ్డ పనులపై కోరిక గల్గడం
8. పరకాంతాపేక్ష
9. పరధనాపేక్ష
10. పరహింసా.

పాతకములుః
సహజంగా దుర్వృత్తులు గల్గి చేసే దుష్ట కార్యాలు పాతకములు అనబడును. ఇట్టి వారు తాము చేసిన దుష్ట కార్యాలను తప్పుగాదు అనియూ సమర్థించుకుంటారు.

ఉదాః ఒకానొక రౌడీయైన వాడు ఒకానొక యువతిపై బలత్కారంగా అత్యాచారం చేస్తాడు. కొందరిని బెదిరించి ధనం అపహరిస్తాడు. ఎవరైనా పెద్ద మనుషులు “ఇది తప్పు” అని మందలిస్తే అతని సమాధానం ఇలా ఉంటుంది. ఇదియా తప్పు? అందమైన ఆడదియు, సంపదయు, వీరభోజ్యాలు. పూర్వం రాజులు ప్రక్క రాజులపై దండెత్తి వారి ధనాన్ని, స్త్రీలను ఎత్తుకు పోయేవారు గదా” అని తమ తప్పులను సమర్థిస్తారు. ఇటువంటివి పాతకములు అంటారు.

ఇక స్త్రీ హత్యలు, శిశు హత్యలు, బ్రహ్మ హత్యలు, గో హత్యలు, సుప్త హత్యలు, గృహదహనాలు మొదలైనవి మహాపాతకములు అందురు. ఇటువంటి మహాపాతకములు సైతం శ్రీదేవిని ఉపాసించే వారికి నశిస్తాయి. వారి దుర్గుణాలు అమ్మ కరుణచే తొలగిపోతాయి. సుగుణాలు అలవడుతాయి. క్రమంగా జ్ఞానసిద్ధులై తరిస్తారు.

ఈ విషయంలో పురాణ ప్రమాణము:

"కృతస్యాం ఖిలపాపస్య జ్ఞానతో జ్ఞాన తోపివా
ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తేః పరాస్మృతి"

భావము: తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపములు కన్నింటికినీ ప్రాయశ్చిత్తము పరాశక్తిని భక్తిపూర్ణంగా తలంచడమగును.

జగన్మాతను శ్రద్దా భక్తులతో ఉపాసించే వారికి వెనకటి మహాపాతకాలు నశిస్తాయి. ఇక ఏ విధమైన పాతకాలు గానీ, పాపాలు గానీ చేయరు. జ్ఞానులై తరిస్తారు.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.



Post a Comment

0 Comments