మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ (షోడశాక్షరి)
ఇది పదునారు అక్షరాలు గల్గిన మంత్రము. పూజాసమయంలో “మహేశ్వర మహాకల్ప మహా తాండవసాక్షిణ్యై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
మహేశ్వర = మహేశ్వర సంబంధమైన (మహేశ్వరుడు చేసిన)
మహాకల్ప = మహాకల్ప కాలమందలి
మహా తాండవ = మహా తాండవ నృత్యమునకు
సాక్షిణి = సాక్షిణిగా ఉండేది శ్రీదేవి.
మహాకల్ప కాలంలో మహేశ్వరుడు మహా ప్రళయ.నృత్యాన్ని చేస్తాడు. అప్పుడు సమస్త.సృష్టియు, బ్రహ్మ, విష్ణు దేవేంద్రాదులతో సహ కారణ స్వరూపంలో విలీనత పొందుతుంది. కేవలం. శ్రీదేవి ఒక్కతి మాత్రమే ఉంటుంది. ఆ తల్లి మాత్రమే తాండవ నృత్యాన్ని చూస్తుంది. చూచేవారినే సాక్షి అంటారు. సాక్షి శబ్దానికి స్త్రీ లింగ రూపము సాక్షిణీ. మహేశ్వరుడితో ఆమె చేసే నృత్యాన్ని లాస్యం అందురు. శివుడు చేసే ప్రళయ నృత్యాన్ని తాండవం అనియూ, అమ్మ నృత్యాన్ని లాస్యం అనియూ అందురు.
ఈ విషయాన్నే శ్రీ ఆదిశంకరాచార్యుల అర్థనారీశ్వరస్తుతిలో ఇలా ఉల్లేఖించారు.
ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ!
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయైచ నమః శివాయ"
అమ్మ లాస్యంలో అనగా మందహాస నృత్వంలో మీరు ఎంత గంతులేసి ఎగిరి సర్వాన్ని ప్రళయం చేసిననూ, కేవలం నేను చిరునగవుతో సమస్తాన్ని సృష్టిస్తాను అనే భావము - "సృష్యున్ముఖ లాస్యకా" అనే పదం సూచిస్తుంది. ఏమైననూ మహేశ్వరుడి మహా తాండవాన్ని దర్శించే శక్తి ఆ తల్లి ఒక్కదానికే గలదు అని తెలియ దగును.
కృతయుగము 17,28,000 సంవత్సరములు, తేతాయుగము 12,96,000 సంవత్సరములు,
ద్వాపర యుగము 8,64,000 సంవత్సరములు, కలియుగము 4,32,000 సంవత్సరములు.
ఈ యుగాల కాల విషయంలో మతభేదాలును గలవు. ఈ నాలుగు యుగాలు కలిసినచో ఒక మహాయుగం అగును. ఇలాంటి మహాయుగాలు 71 అయినచో మన్వంతరము అగును. ఇటువంటి మన్వంతరాలు 14 అయినచో ఒక కల్పము అగును. ఒక కల్పము బ్రహ్మదేవునికి ఒక దినము అగును. ఈ ప్రమాణంగా నూరు సంవత్సరాలు బ్రహ్మకు ఆయుష్కాలము అగును. దానినే మహాకల్పము అందురు. అటువంటి మహాకల్ప కాలంలో మహేశ్వరుడు చేసే మహాప్రళయ కారణమైన నృత్యాన్ని మహాతాండవము అందురు. ఆ నృత్యానికి సాక్షిణియైనది శ్రీదేవి.
మనము ప్రస్తుతం సంకల్పంలో "ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్తె శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే" అని వచిస్తూ ఉంటాము. అందుచే బ్రహ్మకు ఉండే ఆయువులో సగం అనగా 50 సంవత్సరాలు గడచినవి అనియు శ్వేతవరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాము అనియు గ్రహింపదగును.
మహాప్రళయంలో అమ్మ, అయ్య ఇరువురు మాత్రమే ఉందురు అని గ్రహింపదగును.
"ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉబావపి” (భగవద్గీత)
ప్రపంచంలో అంతయును శివరూపం. శక్తిరూపం అని గ్రహించినచో రాగద్వేషాదులు సాధకులకు నశిస్తాయి. పరమపదం ప్రాప్తిస్తుంది.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments