Ad Code

మహామాయా (చతురక్షరి)


మహామాయా (చతురక్షరి)




ఇది నాల్గు అక్షరాల మంత్రము. పూజా సమయంలో “మహామాయాయై నమః" అని శ్రద్దా భక్తులతో ఉచ్చరించాలి.
మహతీ - మాయా = మహామాయా (పూర్వ పదానికి పుంవద్భావము)

మహిమాన్వితమైన - వర్ణింప సాధ్యంగాని మాయారూపిణియైనది శ్రీదేవి.
య = ఏది అయితే,
మా = లేనిదో (సా = అది) అది మాయా అనబడును.
ఉండే దానిని సత్ = అందురు.

భ్రాంతిలో పడవేసి విజ్ఞానం పనిచేయకుండా చేసేది మాయా స్వభావం అగును. ఉన్నది లేనట్లు గాను, లేని దానిని ఉన్నట్లు గాను చేసి మానవుడిని ఆపదలలో పడద్రోసేది మాయ అనదగును.

ఉదా:- మహా భారతంలో మయసభ ఇట్టి మాయా లక్షణం గలది. ఉన్నది లేనట్లుగా తలచి దుర్యోధనుడు గుంటలో పడతాడు. గారడీవాడు చేసే ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు అన్నియునూ మాయలే అగును. ఇవి కేవలం కనికట్లు రూపాలు అగును. అచ్చట వాస్తవస్థితి అనేది ఉండదు.

రామాయణంలో మారీచుడు బంగారు లేడిగా సీతకు కనబడడం, లంకేశ్వరుడు భిక్షుకుడు అగుట, ఇట్టివి అన్నియునూ మాయలే అగును. ఇవన్నియు క్షణికమైన మాయలు. శ్రీదేవి కల్పితమైన మాయ. మహామాయ అగును. ఆ తల్లిని శరణు పొందినవారు తప్ప అన్యులు ఆ మాయను దాటలేరు.

మమమాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యన్డే మాయామేతాం తరపై తే (భగవద్గీత)

1. నా మాయను ఎవరును తప్పించుకొనలేరు.
2. నన్ను శరణు పొందినవారు మాత్రమే నా మాయను దాటగలరు. దేవిని పూర్ణంగా శరణు పొందినవారు మాత్రమే మాయా ప్రపంచ మోహం నుండి విముక్తి పొందగలరు. ఆ తల్లి మాయను ఆ తల్లియే వదలించి ముక్తిని ప్రసాదిస్తుంది.

శ్రుతి శత నిగమాంత కోవిదులైనను అహంకారాన్ని పొందుదురే గాని మాయను దాటలేరు. కోరికలు తీరినను నూతనమైన కోరికలు జనిస్తూనే ఉంటాయి. అగ్నిలో నెయ్యి వేసినచో, ఇంకా పెద్ద మంట జనిస్తుంది. కట్టెలను తొలగించిననూ, నీరు పోసిననూ మంట చల్లారుతుంది.
అలాగే అమ్మ కరుణ అనే చల్లని నీరు పడినచో కోరికలు అనే అగ్నులు చల్లారుతాయి.

“తాపత్రయాభీల దావాగ్నులింకునే
విష్ణు సంకీర్తనా వృష్టిలేక” (భాగవతము)

రాగ, ద్వేష, సుఖ, దుఃఖాది ద్వంద్వ భావాలతో దొరలింపజేయునదియే మహామాయ అనబడును.
సచ్చిదానంద రూపమైన ఆత్మయందు అనాత్మ భావమును - అనాత్మయును, అనిత్యమును అయిన దేహమునందు ఆత్మ భావమును గల్గించేదే మహామాయ అగును. బ్రహ్మాదులను సైతం భ్రాంతులను జేయునది ఈ మాయా శక్తి అగును.

ఉత్పన్నం జ్ఞానం రహితం కురుతేయా నిరంతరమ్
మహామాయేతి విఖ్యాతా తేన సా పరమేశ్వరీ.

గర్భములో జీవుడు ప్రవేశించినది మొదలు ప్రసవ వాయువుల ద్వారా బాహ్య ప్రపంచానికి వచ్చేటంతవరకు, జ్ఞాన సహితుడుగానే ఉంటాడు. బయటికి రాగానే మాయ ఆవరిస్తుంది. అందుచే జ్ఞానం నశిస్తుంది. ఇటుల చేసే మహాశక్తినే మహామాయ అనియు పరమేశ్వరీ అనియు కీర్తిస్తారు.

ఈ మాయా బంధము తొలగవలయునన్నచో ఆ తల్లి కరుణయు, ఆ తల్లి కరుణను పొందిన సద్గురు దేవుని అనుగ్రహమును చాలా ముఖ్యములు.

“శ్రీ గురు సర్వకారణ భూతశక్తిః” (భావనోపనిషత్)

భావము:- శ్రీదేవి కరుణయు, గురు దేవుని అనుగ్రహమును అనేవి రెండునూ మహోన్నతమైన శక్తులు. ఈ రెండు ఉన్నచో అన్నియును సాధ్యం అగును. అట్టి శ్రీదేవికి సద్గురుమూర్తికీ ప్రణామములు.

సద్గురు దేవుని అనుగ్రహం చేత, శ్రీదేవిని ఉపాసించే విధిని గ్రహించి, ఉపాసకులు సాధన చేసినచో మహామాయ విముక్తులు అయి పరమపదమును పొందగలరు. స్వశక్తిచే ఎవ్వరును ఈ సంసారమాయ నుండి విముక్తిని పొందజాలరు. శ్రీ గురుః శరణం సదా.



Post a Comment

0 Comments